logo

నిధియే.. ఆటలకు పెన్నిధి

క్రీడాకారులకు సదుపాయాలు కల్పించేందుకు సర్కారు కృషి చేస్తోందని అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది.

Updated : 31 Mar 2023 05:44 IST

దృష్టి సారిస్తేనే ప్రయోజనం

న్యూస్‌టుడే, వికారాబాద్‌ కలెక్టరేట్‌, పరిగి: క్రీడాకారులకు సదుపాయాలు కల్పించేందుకు సర్కారు కృషి చేస్తోందని అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. గ్రామాల్లో  వివిధ ఆటలపై ఆసక్తి ఉన్న విద్యార్థులు, యువకులు ఎంతో మంది ఉన్నారు. సరియైన సౌకర్యాలు లేక సాధన చేయడంలేదు. అయితే ఈ నేపథ్యంలోనే జిల్లాలో నాలుగు ప్రాంతాల్లో స్టేడియం నిర్మాణానికి పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ఆయితే ఇంతవరకు నిధులు మంజూరు చేయలేదు. ఇక ఇటీవల ఏర్పాటు చేసినా క్రీడాప్రాంగణాలు వల్ల కూడా ప్రయోజనం చేకూరడంలేదు.

పాఠశాల ఆవరణలోనే వాలీబాల్‌ ఆడుతున్న విద్యార్థులు


నాలుగు ప్రాంతాల్లో స్థలాలు సిద్ధం

మైదానాల ఏర్పాటుకు వికారాబాద్‌ ఎన్నెపల్లి సమీపంలో 5.6, కొడంగల్‌ పట్టణంలో 5, కుల్కచర్లలో 7, యాలాల మండలం బెన్నూరులో 5 ఎకరాల భూములను 2015లో సేకరించారు. ఒక్కో స్టేడియం నిర్మాణానికి రూ.2.65 కోట్లు విడుదల చేయాలని ప్రతిపాదించారు. ఇవి మంజూరైతే ప్రతి స్టేడియంలో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్‌, క్రికెట్‌ ఆడేందుకు సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించారు. అయినా అడుగు ముందుకు పడలేదు. ప్రస్తుతం ఈ వ్యయం రెండింతలయిందని అధికారులు పేర్కొంటున్నారు.


ఖేలో ఇండియా పథకంలో..

ఖేలో ఇండియా పథకం కింద క్రీడా కేంద్రం మంజూరైంది. దీనిని రూ.7లక్షలతో పరిగిలో ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. ఇక్కడ ఖోఖో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. నిర్వహణ, అభివృద్ధి, పోటీల నిర్వహణకు ఏటా రూ.5 లక్షలు చొప్పున నాలుగేళ్ల పాటు మంజూరు కానున్నాయి.


అభివృద్ధికి నోచని నల్ల మైదానం

వికారాబాద్‌లో నల్ల మైదానాన్ని (బ్లాక్‌ గ్రౌండ్‌) ప్రత్యేకంగా అథ్లెటిక్స్‌ కోసం తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఇది కూడా ప్రతిపాదనల వద్దనే మిగిలిపోయింది. పరిగిలో మాత్రం రూ.28 లక్షలతో ఇండోర్‌ స్టేడియాన్ని నిర్మించారు. జిల్లాలోని నాలుగు క్రీడా మైదానాల నిర్మాణానికి ఉన్నతాధికారులకు లేఖలు రాస్తూనే ఉన్నామని స్థానిక అధికారులు తెలిపారు.  


400 మీటర్ల ట్రాక్‌ ఏర్పాటు చేయాలి

జిల్లా కేంద్రంలో ఆటలకు వసతులు లేవు. 400 మీటర్ల వాకింగ్‌ ట్రాక్‌ను ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉంటుంది. శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. దీనివల్ల  పోలీసు, ఆర్మీ, బీఎస్‌ఎఫ్‌ తదితర వాటిల్లో ఉద్యోగం సాధించే వీలుంటుంది. 

ప్రతాప్‌రెడ్డి, వ్యాయమ ఉపాధ్యాయుడు, శివారెడ్డిపేట


వసతుల కల్పనకు కృషి చేస్తాం

జిల్లాలోని నాలుగు ప్రాంతాల్లో మైదానాలను ఎంపిక చేశాం. నిధులు విడుదల చేయకపోవటంతో పనులు ప్రారంభించలేదు. ఈ విషయమై లేఖలు రాస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికే కాకుండా, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఖేల్‌ ఇండియా సంస్థను సంప్రదించాం. పరిగిలో ఖోఖో కేంద్రం ఏర్పాటుకు నిధులు మంజూరు చేశారు.

హన్మంత్‌రావు, జిల్లా యువజన అధికారి, వికారాబాద్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని