logo

పైవంతెనపై ఏం జరుగుతోంది?

పైవంతెనలపై వేగ పరిమితి బోర్డులు మాయమవుతున్నాయి. హైటెక్‌సిటీలో వంతెనలన్నింటిపైనా ఇదే పరిస్థితి.

Updated : 08 Jul 2023 04:55 IST

 హైటెక్‌సిటీలో వేగ పరిమితి బోర్డులన్నీ మాయం
మాకేం తెలియదంటున్న జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్‌ పోలీసులు

ఖాజాగూడ - బయోడైవర్సిటీ వంతెనపై మాయమైన వేగపరిమితి సూచిక

ఈనాడు, హైదరాబాద్‌: పైవంతెనలపై వేగ పరిమితి బోర్డులు మాయమవుతున్నాయి. హైటెక్‌సిటీలో వంతెనలన్నింటిపైనా ఇదే పరిస్థితి. మలుపులు, వాలును పరిగణనలోకి తీసుకుని వాహనాలకు జీహెచ్‌ఎంసీ విధించిన గరిష్ఠ వేగ పరిమితి బోర్డులు కనిపించకుండాపోవడం ఆందోళన కలిగిస్తోంది. పైవంతెనలపై సర్వాధికారాలున్న జీహెచ్‌ఎంసీకి ఈ విషయమే తెలియదు. నగరంలో లక్ష సీసీకెమెరాలు ఏర్పాటుచేసి చీమ చిటుక్కుమన్నా తెలుస్తోందనే ట్రాఫిక్‌ పోలీసులూ మాకేం తెలుసంటున్నారు. ఈ తీరుపై నగరవాసులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.  

గచ్చిబౌలి వంతెనపై సూచికకు నల్ల రంగు


ప్రమాదాల నివారణకు..

2019 నవంబరులో ఖాజాగూడ కూడలి నుంచి బయోడైవర్సిటీ రెండో స్థాయి పైవంతెనపైకి వేగంగా దూసుకెళ్లిన ఓ కారు కిందకు పల్టీ కొట్టింది. రోడ్డుపై ఉన్న మహిళ ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి దుర్ఘటనలు నగరంలోని వేర్వేరు పైవంతెనలు, రహదారులపై గతంలో జరిగాయి. ఈ నేపథ్యంలో.. జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్‌ విభాగం ప్రధానరోడ్లపై గంటకు 60కి.మీ, పైవంతెనలపై 40కి.మీ వేగాన్ని పరిమితిగా విధించింది. సూచికలు పెట్టింది. గచ్చిబౌలి ఓఆర్‌ఆర్‌నుంచి శిల్పాలేఅవుట్‌ మీదుగా ఐకియా వెనుకవైపు వరకు శిల్పాలేవుట్‌ పైవంతెనపై మలుపులు ఎక్కువ ఉండటంతో.. వేగాన్ని 30కి.మీ.కే పరిమితం చేసింది. ఇప్పుడు ఆయా బోర్డులేవీ కనిపించట్లేదు. బయోడైవర్సిటీ కూడలి పైవంతెనపైనా బోర్డులు మాయమయ్యాయి. గచ్చిబౌలి పైవంతెన సూచికలు నల్లరంగు పులుముకున్నాయి. జీహెచ్‌ఎంసీని వివరణ కోరగా.. తమకు విషయం తెలియదని ఓ సీనియర్‌ అధికారి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వివరాలు తెలుసుకుని ఉదయం పోలీసులకు ఫిర్యాదుచేస్తామన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని