logo

పోస్టు పెట్టినా.. కామెంట్‌ రాసినా జరభద్రం!

చేతిలో స్మార్ట్‌ఫోన్‌.. సమయం చిక్కితేచాలు.. నచ్చినట్టు పోస్టులు పెట్డడం.. ఆ పోస్టులతోపాటు నచ్చినవాటిని సైతం ఇతరులకు ఫార్వర్డ్‌ చేయడం.. అందులో ఏం రాసుందో పరిశీలించకుండానే షేర్‌ చేస్తున్నారు.

Published : 21 Aug 2023 05:18 IST

సామాజిక మాధ్యమాలపై  సైబర్‌ పెట్రోలింగ్‌

ఈనాడు, హైదరాబాద్‌: చేతిలో స్మార్ట్‌ఫోన్‌.. సమయం చిక్కితేచాలు.. నచ్చినట్టు పోస్టులు పెట్డడం.. ఆ పోస్టులతోపాటు నచ్చినవాటిని సైతం ఇతరులకు ఫార్వర్డ్‌ చేయడం.. అందులో ఏం రాసుందో పరిశీలించకుండానే షేర్‌ చేస్తున్నారు. ఆడపిల్లల ఫొటోలు కనిపించగానే ఆకతాయిలు అసభ్యపదజాలంతో ఛాటింగ్‌ చేస్తున్నారు. వాటిలో ఏవైనా సున్నితమైన అంశం ఉన్నపుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులు, కామెంట్స్‌ ఎవరూ గమనించరనే నమ్మకంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.   పోలీసు నిఘాలో దొరికి కేసుల్లో ఇరుక్కుంటున్నారు.

మూడో కన్ను గమనిస్తోంది.. అసలే ఎన్నికల ఏడాది.. వచ్చేనెల నుంచి వరుస పండుగలు. సాధారణ సమయాల్లోనే సంబరాలు.. ఉత్సవాల్లో బందోబస్తు, శాంతిభద్రతల నిర్వహణ పోలీసులకు సవాల్‌.  ఈ కీలకమైన సమయంలో ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టా వంటి వేదికలపై ప్రచారం ప్రశాంత వాతావరణాన్ని దెబ్బ తీస్తోంది. పోలీసు యంత్రాంగం ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఊహించని ఘోరాలు జరిగే అవకాశాలున్నాయి. పరిస్థితి చేయి దాటకముందే వీటికి అడ్డుకట్ట వేయాలనే హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసులు అప్రమత్తమయ్యారు.

  • సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టే దుష్ప్రచారాలు, రెచ్చగొట్టే ప్రకటనలు, వదంతులు వంటి వాటిపై నిఘా ఉంచారు. ‘సైబర్‌ పెట్రోలింగ్‌’తో రోజూ వేలాది పోస్టులను గమనిస్తూ పోకిరీలు, అసాంఘిక శక్తుల ఆట కట్టిస్తున్నారు.

ఎలా చిక్కుతున్నారంటే.. వరంగల్‌కు చెందిన యువకుడు ఓ ప్రజాప్రతినిధి ఫొటో మార్ఫింగ్‌ చేసి, దుర్భాషలాడుతూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు. నెల తరువాత నగర సైబర్‌క్రైం పోలీసులు ఆ యువకుడిని గుర్తించి నోటీసు జారీ చేశారు. రోజువారీ కూలీపనులు చేసుకొనే తనకు సరైన అవగాహన లేదని, వాట్సాప్‌ గ్రూపులో వచ్చిన పోస్టును కాపీ చేశానంటూ పోలీసులను ప్రాధేయపడ్డాడు.

  • విజయవాడకు చెందిన డిగ్రీ విద్యార్థికి ఫేస్‌బుక్‌లో నగరంలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న యువతి పరిచయమైంది. కొద్దిరోజులు మంచిగా మెలిగి అనంతరం అసభ్య పదజాలంతో సందేశాలు పంపి మనోవేదనకు గురిచేశాడు. సైబర్‌ పెట్రోలింగ్‌లో భాగంగా సైబరాబాద్‌ పోలీసులు ఉంచిన నకిలీ ప్రొఫైల్‌కు అతడు స్నేహ అభ్యర్థన పంపాడు. తనతో ఛాటింగ్‌ చేసేది యువతే అనే ఉద్దేశంతో తన వికృతరూపం ప్రదర్శించాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించటంతో లోగుట్టు వెలుగుచూసింది. ఆ యువకుడు ఎంతోమంది యువతులను ఇదే తరహాలో వేధించినట్టు గుర్తించి కేసు నమోదు చేశారు.

పసిగట్టి.. వడకడుతున్నారు

రాచకొండ, సైబరాబాద్‌ పరిధిలో సైబర్‌పెట్రోలింగ్‌, హైదరాబాద్‌లో స్మాష్‌(‘సోషల్‌ మీడియా యాక్షన్‌ స్క్వాడ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌) పేరిట సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచుతున్నారు. ఐటీ సెల్‌ ఆధ్వర్యంలో 24 గంటలూ పోలీసుబృందాలు ఫేస్‌బుక్‌, ట్విటర్‌, వాట్సాప్‌, గూగుల్‌, ఇన్‌స్టా వంటి వేదికల్లో ట్రెండింగ్‌ అంశాలను గుర్తిస్తారు. విద్వేషపూరిత ప్రసంగాలు, మార్ఫింగ్‌ ఫొటోలు, వదంతులను ప్రత్యేకటూల్‌ సాయంతో గుర్తిస్తారు. సాధారణ రోజుల్లో 4000-5000 మంది ఖాతాలను పరిశీలిస్తారు. పండుగలు, ఉత్సవాలు, ఎన్నికల వంటి సమయాల్లో 10,000 సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తున్న అంశాలను విశ్లేషిస్తున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అంశాలను గుర్తించగానే పోలీసు విభాగాలన్నీ అప్రమత్తమవుతాయి. ఆ పోస్టు చేసిన వ్యక్తులు/సంస్థలను నిమిషాల వ్యవధిలోనే గుర్తించేలా చర్యలు తీసుకుంటారు. నగర పరిధిలోనే ఉన్నట్టు తేలితే అదుపులోకి తీసుకుంటారు.

  • సామాజిక మాధ్యమాల్లో పోస్టుల వెనుక కారణాలు తెలుసుకున్నాక చట్టపరమైన చర్యలు చేపడుతున్నారు. ఉద్దేశపూర్వకంగా చేసినవారిపై కేసులు నమోదుచేస్తున్నారు. అవగాహనలోపం, ఫార్వర్డ్‌ చేసినట్టు నిర్ధారిస్తే కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. వదంతుల వ్యాప్తి వల్ల తలెత్తే దుష్ప్రభావాలు, యువత చదువు, కెరీర్‌పై పడే ప్రభావాలను పోలీసులు వివరిస్తున్నారు. ఈ ఏడాది మూడు పోలీసు కమిషనరేట్స్‌ పరిధిలో 200 మందికి సైబర్‌క్రైం పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. భవిష్యత్‌లో ఎటువంటి తప్పిదం చేయమంటూ వారితో లిఖితపూర్వక పత్రాలు రాయించారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని