logo

అవుటర్‌పై.. తరచూ అంధకారం

జోరువాన, గాలులే కాకుండా ఇతర సాంకేతిక కారణాలతో తరచూ అవుటర్‌రింగ్‌రోడ్డుపై  రాత్రివేళ చీకట్లు కమ్ముకుంటున్నాయి.

Published : 23 Aug 2023 07:04 IST

120 కి.మీ. వేగంతో దూసుకెళ్తున్న వాహనాలు
రాత్రివేళ ఆందోళనలో ప్రయాణికులు

ఈనాడు, హైదరాబాద్‌:  జోరువాన, గాలులే కాకుండా ఇతర సాంకేతిక కారణాలతో తరచూ అవుటర్‌రింగ్‌రోడ్డుపై  రాత్రివేళ చీకట్లు కమ్ముకుంటున్నాయి. నగరం చుట్టూ 150 కి.మీ. మేర ఓఆర్‌ఆర్‌ విస్తరించి ఉంది. 2016 తర్వాత ఇది అందుబాటులోకి వచ్చినా ఇంటర్‌ ఛేంజ్‌లోని టోల్‌బూత్‌ల వద్ద మినహా ఎక్కడా సెంట్రల్‌ లైటింగ్‌ లేదు. ఈ క్రమంలో తరచూ ప్రమాదాలు జరిగేవి. వాహన రద్దీతో పాటు అవుటర్‌ చుట్టూ నివాస ప్రాంతాలు ఏర్పాటుకావడంతో తొలుత గచ్చిబౌలి నుంచి శంషాబాద్‌ వరకు 22 కి.మీ.మేర సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటుచేశారు. ప్రయాణికుల వినతులతో 2021లో మిగతా 132 కి.మీ. మేర 13,303 ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటుచేశారు. దీంతో రాత్రివేళల్లో అవుటర్‌పై ప్రయాణం సులువుగా మారింది. కొన్ని సాంకేతిక కారణాలు, నిర్వహణ లోపంతో తరచూ రాత్రి వేళ లైట్లు వెలగడం లేదని, 120 కి.మీ వేగంతో వెళ్తున్నప్పుడుఅవుటర్‌పై అంధ కారం ఆందోళన కలిగిస్తోదని  వాహనదారులు చెబుతున్నారు.  

నిర్వహణ తీరు మారేనా?

అవుటర్‌ లైటింగ్‌, రోడ్ల మరమ్మతులు, పచ్చదనం అభివృద్ధి తదితర పనులకు ఏటా హెచ్‌ఎండీఏ రూ.150 కోట్ల వరకు వెచ్చించేది. ఇటీవల ఓఆర్‌ఆర్‌ను అద్దె ప్రాతిపదికన 30 ఏళ్లు ఓ ప్రైవేటు సంస్థకు లీజుకు ఇచ్చిన సంగతి తెలిసిందే. పచ్చదనం మినహా ఇతర నిర్వహణంతా సదరు సంస్థ చేతిలోకి వచ్చింది. ఎప్పటికప్పుడు మౌలిక వసతులను మెరుగుపరిస్తేనే ఎక్కువ వాహనాలు రాకపోకలకు అవకాశముంటుంది. త్వరలో అవుటర్‌పై 23 కి.మీ. మేర సోలార్‌ ప్యానెళ్ల రూఫ్‌తో కూడిన సైకిల్‌ ట్రాక్‌ రానుంది. దీంతో 16 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసి లైటింగ్‌కు వినియోగించుకోనున్నారు. వీటితో పాటు ప్రత్యేక లైన్లు వేస్తే అంతరాయం లేని సరఫరాకు అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రత్యామ్నాయ మార్గాలపై వెంటనే దృష్టి సారించాల్సిన అవసరముంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని