KCR: లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం: కేసీఆర్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత బాగా ఉందని భారాస అధినేత కేసీఆర్‌ అన్నారు.

Updated : 18 Apr 2024 18:11 IST

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత బాగా ఉందని భారాస అధినేత కేసీఆర్‌ అన్నారు. తెలంగాణభవన్‌లో పార్టీ లోక్‌సభ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు. కాంగ్రెస్‌ నేతలు కొందరు తనతో టచ్‌లో ఉన్నారని, అక్కడ అంతా భాజపా పెత్తనమే నడుస్తోందని వారు చెప్పారని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ‘‘కాంగ్రెస్‌లోకి వెళ్లిన నేతలు బాధపడుతున్నారు. గతంలో 104 మంది ఎమ్మెల్యేలున్న మన ప్రభుత్వాన్ని కూల్చేందుకే భాజపా ప్రయత్నించింది.. 64 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్‌ను వదిలిపెడుతుందా? లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయంగా గందరగోళం తలెత్తుతుంది. ఏం జరిగినా మనకే మేలు. రాష్ట్రంలో భవిష్యత్‌ భారాసదే’’ అని కేసీఆర్‌ అన్నారు.

‘‘ కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైంది. రానున్న రోజులు మనవే. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో టీమ్‌ వర్క్‌ లేదు.. స్థిరత్వం లేదు. ఉద్యమకాలం నాటి కేసీఆర్‌ను మళ్లీ చూస్తారు. కవితపై ఎలాంటి కేసూ లేదు.. అయినా.. కక్ష కట్టి అరెస్టు చేశారు. భాజపా సీనియర్‌నేత బీఎల్‌ సంతోష్‌కు నోటీసులు పంపాం. ఆ పార్టీ కేంద్ర కార్యాలయానికి రాష్ట్ర పోలీసులు వెళ్లారు. అందుకే  మనపై కక్ష పెంచుకున్నారు. ఇసుక కుంగడం వల్లే మేడిగడ్డ ఆనకట్ట వద్ద సమస్య తలెత్తింది. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితిలో మిల్లర్లు లేరు. అన్నింటా ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం మాట అధికారులు వినడం లేదు. కాంగ్రెస్‌ను నమ్మడం లేదని అసదుద్దీన్‌ ఓవైసీ చెప్పారు’’ అని కేసీఆర్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని