logo

సీడ్‌ కంపెనీలో శాస్త్రవేత్త.. గ్యాంబ్లింగ్‌లో దిట్ట

విత్తనాల కంపెనీలో సైంటిస్ట్‌గా విధులు.. అడ్డదారిలో అదనపు సంపాదనకు జూద స్థావరాల నిర్వహణ.. మూడేళ్లు యథేచ్ఛగా సాగిన దందా ఆదివారం పోలీసులు దాడి చేయడంతో బండారం బయట పడింది.  

Updated : 22 Apr 2024 08:03 IST

శిబిరంపై పోలీసుల దాడి: 14 మంది అరెస్టు
రూ.1.80 లక్షల నగదు, చరవాణుల స్వాధీనం

మేడ్చల్‌: విత్తనాల కంపెనీలో సైంటిస్ట్‌గా విధులు.. అడ్డదారిలో అదనపు సంపాదనకు జూద స్థావరాల నిర్వహణ.. మూడేళ్లు యథేచ్ఛగా సాగిన దందా ఆదివారం పోలీసులు దాడి చేయడంతో బండారం బయట పడింది.  సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు కండ్లకోయ టీచర్స్‌ కాలనీలోని ఓ ప్లాట్‌లో నిర్వహిస్తున్న స్థావరంపై దాడి చేశారు. 14 మందిని జూదరులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1.80 లక్షల నగదు, గ్యాంబ్లింగ్‌ కాయిన్స్‌, 13 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు.

నగదు, సెల్‌ఫోన్‌లు, పేకలు

ఇదీ దందా: పెగినేని రాజేశ్‌ గుండ్లపోచంపల్లి పరిధిలోని ఓ విత్తనాల కంపెనీలో శాస్త్రవేత్తగా చేస్తున్నారు. పోలీసులకు చిక్కకుండా స్థావరాలను మారుస్తూ గ్యాంబ్లింగ్‌ నిర్వహిస్తున్నాడు. రాజేశ్‌ ప్రతి రోజు 50 ఆటలు ఆడిస్తాడు. ప్రతి ఆటకు కమీషన్‌ రూ.1000 వసూలు చేస్తాడు. పోలీసులు దాడి చేసినా నగదు లభించకుండా ఉండేందుకు ఆటలో పాల్గొనే ప్రతి వ్యక్తి నుంచి రూ.20 వేలు తీసుకొని సమాన విలువ ఉన్న గ్యాంబ్లింగ్‌ ప్లాస్టిక్‌ కాయిన్స్‌ ఇస్తాడు. ఇలా వచ్చిన డబ్బును రహస్య ప్రాంతానికి తరలిస్తాడు. ఆట పూర్తయిన తర్వాత డబ్బు చేరవేస్తారు. ఎస్‌వోటీ పోలీసుల ఫిర్యాదుతో మేడ్చల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.


కల్తీ పాల విక్రయం.. ముగ్గురి అరెస్టు

పోలీసులు అరెస్టు చేసిన కల్తీ పాల తయారీదారులు

ఆసిఫ్‌నగర్‌, న్యూస్‌టుడే: అమ్మోనియా సల్ఫేట్‌ ద్రావణంతో కల్తీ పాలు తయారుచేస్తున్న ముగ్గురిని హబీబ్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ రాంబాబు వివరాల ప్రకారం.. ఆగాపురలోని ఓల్డ్‌ జూల అంబేడ్కర్‌ విగ్రహం ప్రాంతంలోని ఓ ఇంట్లో కల్తీ పాలు తయారు చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఎస్సై శివకుమార్‌ ఆధ్వర్యంలో దాడి చేసి.. కాచిగూడలోని గణేష్‌ ఆలయం ప్రాంతానికి చెందిన ప్రధాన నిందితుడు పి.ప్రభాకర్‌రెడ్డి(40), నాంపల్లి గాంధీ భవన్‌ గేట్‌-2 ప్రాంతంలో నివసించే బిహార్‌కు చెందిన సంతోష్‌ సదా(25), జియాగూడ దుర్గానగర్‌కు చెందిన కోడిగంటి పవన్‌(25)లను అరెస్టు చేశారు. లీటరు అమ్మోనియా సల్ఫేట్‌, 80 లీటర్ల కల్తీ పాలు, 15 పాల ప్యాకెట్లు, కేసరి ఎల్లో కలర్‌, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.


నీటి సంపులో పడి యువకుడి మృతి

ఇల్లెందు, న్యూస్‌టుడే: భద్రాద్రి జిల్లా ఇల్లెందు పట్టణానికి చెందిన ఓ యువకుడు హైదరాబాద్‌లో ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందాడు. బాధిత కుటుంబం తెలిపిన ప్రకారం పట్టణంలోని 8వ వార్డుకు చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ ఖలీల్‌ కుమారుడు అక్మల్‌ సుఫియాన్‌ (26) హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తూ కొండాపూర్‌లో అద్దెకు ఉంటున్నాడు. ఉదయం జిమ్‌కు వెళ్లి వచ్చిన అతను తన గదికి వెళ్లే క్రమంలో అపార్ట్‌మెంట్‌ కింద భాగంలో తెరిచి ఉన్న నీటి సంపులో ప్రమాదవశాత్తు పడిపోయాడు. అపార్ట్‌మెంట్‌ యజమాని ఆలస్యంగా సీసీ కెమెరాలో ప్రమాదాన్ని గుర్తించారు. చుట్టుపక్కల వారిని పిలిచి అక్మల్‌ను బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు.  


కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లో గంజాయి స్వాధీనం

గంజాయిని చూపిస్తున్న జీఆర్‌పీ ఇన్‌స్పెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, ఆర్‌పీఎఫ్‌ ఎస్సై నసీమాబేగం

నాంపల్లి, న్యూస్‌టుడే: రైల్లో రూ.1.25లక్షల విలువ చేసే సుమారు 5 కిలోల గంజాయిని నాంపల్లి ఆర్‌పీఎఫ్‌, జీఆర్‌పీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఆర్‌పీఎఫ్‌, జీఆర్‌పీ ఇన్‌స్పెక్టర్లు ఎస్‌.కల్పన, ప్రవీణ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నికల కోడ్‌ దృష్ట్యా రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌, రైల్వే పోలీసులు సంయుక్తంగా రైళ్లలో ఆకస్మిక తనిఖీలకు శ్రీకారం చుట్టారు. శనివారం మధ్యాహ్నం భువనేశ్వర్‌ నుంచి బేగంపేట్‌ రైల్వేస్టేషన్‌ మీదుగా ముంబాయి వెళ్తున్న కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఎస్‌-2 బోగీలో కుర్చీ కింద లగేజీ బ్యాగ్‌లో సుమారు 5 కిలోల గంజాయి ప్యాకెట్‌ను గుర్తించి సీజ్‌ చేశారు. అయితే రవాణా చేస్తున్న వారెవరో తెలియరాలేదు. ఆర్‌పీఎఫ్‌ ఎస్సై, బేగంపేట్‌ శక్తి టీమ్‌ ఇన్‌ఛార్జి నసీమాబేగం పాల్గొన్నారు.


భాజపా ఎంపీ అభ్యర్థి మాధవీలతపై కేసు

బేగంబజార్‌, నారాయణగూడ, న్యూస్‌టుడే: భాజపా హైదరాబాద్‌ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై బేగంబజార్‌ ఠాణాలో కేసు నమోదైంది. ఇన్‌స్పెక్టర్‌ జి.విజయ్‌కుమార్‌ వివరాల ప్రకారం.. ఈనెల 17న శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా రాత్రి సిద్దిఅంబర్‌బజార్‌ ప్రధాన కూడలి వద్ద స్వాగత వేదికపై నుంచి ఎదురుగా ఉన్న ఓ ప్రార్థన మందిరంపై బాణం ఎక్కువ పెట్టి వదులుతున్నట్లు నటించారు. ఈ విషయమై నాంపల్లి ఫస్ట్‌లాన్సర్‌ ప్రాంతానికి చెందిన షేక్‌ ఇమ్రాన్‌(38) శనివారం బేగంబజార్‌ పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. తమ మనోభావాలు దెబ్బతీశారని.. మత సామరస్యానికి భంగం కలిగించే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. మాధవీలతపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని మీమ్‌ సామాజిక సేవా సంస్థ నిర్వాహకులు ఇమ్రాన్‌, సమీర్‌, మాజిద్‌ తెలిపారు. సైఫాబాద్‌లోని ఓ హోటల్‌లో ఆదివారం రాత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల ఓ హిందీ టీవీ ఛానల్‌కిచ్చిన ఇంటర్వూలో ఓ వర్గం ప్రజలు వెళ్లిపోతేనే దేశం బాగుపడుతుందని చెప్పిన వీడియోను ప్రదర్శించారు.


విమానాశ్రయంలో భద్రతాధికారిణిని దూషించిన దంపతుల అరెస్టు

శంషాబాద్‌, న్యూస్‌టుడే: మహిళాధికారిణి విధులకు ఆటంకం కల్పించడమే కాకుండా అసభ్య పదజాలంతో దూషించిన దంపతులను భద్రతాధికారులు అరెస్టు చేసిన సంఘటన శంషాబాద్‌ విమానాశ్రయంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎయిర్‌పోర్ట్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన అహ్మద్‌ సిద్దిఖీ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లడానికి విమానాశ్రయానికి వచ్చారు. ఇమ్మిగ్రేషన్‌ కేంద్రంలో వీసా, ధ్రువీకరణ పత్రాలను తనిఖీ చేసే మహిళాధికారిణితో ఆ దంపతులు వాగ్వాదానికి దిగారు. ఆ అధికారిణిని దంపతులు తీవ్ర స్వరంతో దూషించి విమానాశ్రయంలో హల్‌చల్‌ చేశారు. దీంతో అక్కడి భద్రతాసిబ్బంది వారిని అదుపులోకి తీసుకుని ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు.


మదర్సా నుంచి సోదరుల అదృశ్యం

గోల్కొండ, న్యూస్‌టుడే: మదర్సాలో చదువుకుంటున్న ఇద్దరు సోదరులు అదృశ్యమైన ఘటన గోల్కొండ ఠాణా పరిధిలోని సాలేనగర్‌కంచాలో జరిగింది. గోల్కొండ ఇన్‌స్పెక్టర్‌ సైదులు తెలిపిన వివరాల ప్రకారం..  మల్లేపల్లికి చెందిన ఫిరోజ్‌ కుమారులు మహ్మద్‌ బిలాల్‌(10), మహ్మద్‌ రహీం(8)లను సాలేనగర్‌కంచాలోని మదర్సా జామియా తాలీమ్‌ ఉల్‌ ఖురాన్‌లో చేర్పించాడు. శనివారం మదర్సాలో నమాజ్‌ చేసే సమయంలో ఇద్దరు మదర్సాను వదిలి వెళ్లిపోయారు. నిర్వాహకులు విషయాన్ని తండ్రికి సమాచారం ఇచ్చారు. ఆయన మదర్సా పరిసర ప్రాంతాలతో పాటు బంధువుల ఇళ్లలో వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో గోల్కొండ ఠాణాలో ఫిర్యాదు చేశారు.


ఇద్దరు ఆర్టీసీ డ్రైవర్లపై దాడి

వికారాబాద్‌, న్యూస్‌టుడే: ఇద్దరు ఆర్టీసీ డ్రైవర్లపై ఓ ప్రయాణికుడు దాడి చేసిన ఘటన ఆదివారం వికారాబాద్‌ బస్టాండ్‌లో జరిగింది. ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపిన  ప్రకారం..వికారాబాద్‌- సదాశివపేట మార్గంలో రాకపోకలు సాగించే ఇద్దరు డ్రైవర్లు మధ్యాహ్నం బస్సులను బస్టాండ్‌లో నిలిపారు. అదే సమయంలో బస్సులో ఎక్కుతున్న ప్రయాణికులకు ‘భోజనానికి వెళ్తున్నాం..కాస్త ఆలస్యమవుతుందని చెప్పి’ వెళ్లారు. అనంతరం ఓ ప్రయాణికుడు భార్యతో కలిసి బస్సు ఎక్కాడు. భోజనం చేసి వచ్చిన డ్రైవర్‌ రాములుతో ఆలస్యానికి కారణంపై వాగ్వాదానికి దిగి దాడి చేశాడు. డ్రైవర్‌ను బస్సునుంచి  కిందకు లాగేందుకు యత్నించాడు. గమనించిన మరో డ్రైవర్‌ వారించడానికి రాగా అతనిపై కూడా దాడి చేశాడు. ఈ క్రమంలో కండక్టర్‌ స్వాతి స్వల్పంగా గాయపడ్డారు. కండక్టర్‌ స్వాతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని