logo

తల్లి ప్రవర్తన నచ్చక.. హత్య చేసిన కుమారుడు

తల్లి ప్రవర్తన నచ్చక కుమారుడే హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుండిగల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Published : 24 Apr 2024 01:54 IST

దుండిగల్‌, న్యూస్‌టుడే: తల్లి ప్రవర్తన నచ్చక కుమారుడే హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుండిగల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సాపూర్‌ ఎర్రకుంట తండాకు చెందిన గన్య, సక్కుబాయ్‌ (48) దంపతులకు ఇద్దరు కుమారులు. ఆరేళ్ల క్రితం గన్య మృతిచెందాడు. ఆరు నెలల క్రితం ఉపాధి నిమిత్తం కుమారులతో కలిసి ఆమె డి.పోచంపల్లిలోని 120 గజాలకు వలస వచ్చి కూలీ పనులు చేసుకుంటోంది. పెద్ద కొడుకు అంజకు ఇటీవల వివాహం కావడంతో వేరుగా ఉంటున్నాడు. కొంతకాలంగా తల్లి ప్రవర్తన నచ్చక ఆమెను కడతేర్చాలని పెద్ద కొడుకు నిశ్చయించుకున్నాడు. అందుకు తన స్నేహితుడితోపాటు మరొకరితో కలిసి పథక రచన చేశాడు. ఈనెల 20న రాత్రి క్యాటరింగ్‌ పని ఉందంటూ తల్లిని నమ్మించి బౌరంపేట పరిధి సతీష్‌ లేఅవుట్‌లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. పదునైన ఆయుధంతో ఆమె గొంతుపై పొడవడంతోపాటు తల వెనుక భాగంలో రాయితో మోది దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని అదే ప్రాంతంలోని ఖాళీ స్థలంలో ఉన్న నీటి సంపులో పడేసి వెళ్లిపోయారు.

పట్టుబడింది ఇలా.. ఆరోజు రాత్రి తల్లి ఇంటికి రాకపోవడంతో చిన్న కొడుకు ఆందోళనతో అన్నకు విషయం చెప్పాడు. క్యాటరింగ్‌ పని ఉండడంతో తానే అమ్మను గండిమైసమ్మ చౌరస్తాలో వదిలిపెట్టానని.. అదే సమయంలో పని రద్దు కావడంతో ఇంటికి వెళ్లమన్నానని తమ్ముడికి చెప్పాడు. స్నేహితురాలిని కలిసి ఇంటికి వెళ్తానని అమ్మ చెప్పిందని నమ్మించాడు. అనంతరం తమ్ముడు, బంధువులతో కలిసి ఆమె కోసం గాలించినట్లు నటించాడు. ఈనెల 21న సాయంత్రం బౌరంపేటలోని సతీష్‌ లేఅవుట్‌లోని నిర్మానుష్య ప్రాంతంలో అమ్మ పర్సు తనకు దొరికిందని తమ్ముడికి ఫోన్‌ చేసి చెప్పాడు. తమ్ముడు హుటాహుటిన ఆ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ రక్తపు మరకలను గమనించిన అతను సమీపంలో ఉన్న నీటి సంపును పరిశీలించగా అందులో తల్లి మృతదేహాన్ని చూసి షాకయ్యాడు. ఈ ఘాతుకానికి ఎవరో పాల్పడి ఉంటారని అన్న కట్టు కథ అల్లాడు. మృతురాలి చిన్న కొడుకు ఫిర్యాదు మేరకు దుండిగల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గండిమైసమ్మ చౌరస్తాలో సీసీ ఫుటేజీల ఆధారంగా అంజను, సహకరించిన ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించడంతో అసలు విషయం వెలుగు చూసింది. నిందితుల అరెస్టును పోలీసులు ధృవీకరించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని