logo

రిటైల్‌ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం

అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్‌ రంగంతో అలరారుతున్న హైదరాబాద్‌.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌ అన్నారు.

Published : 25 Apr 2024 02:14 IST

జయేశ్‌ రంజన్‌తో పురస్కారాలు అందుకున్న ఇస్మాయిల్‌ అజాని, బాబురావు, ప్రసాద్‌రావు, అవ్‌నిష్‌ కుమార్‌, మనీష్‌, కెజాస్‌ పెస్టంజీ తదితరులు

రాయదుర్గం, న్యూస్‌టుడే: అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్‌ రంగంతో అలరారుతున్న హైదరాబాద్‌.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌ అన్నారు. రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీలోని ఓ హోటల్‌లో బుధవారం రిటైలర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (రాయి) తెలంగాణ విభాగం అధ్వర్యంలో హైదరాబాద్‌ రిటైల్‌ సమ్మిట్‌ నిర్వహించారు. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ఉత్పత్తులను అందించడం ద్వారా వ్యాపారాభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. ప్రపంచంలో నదుల ఒడ్డున ఉన్న నగరాలు అనేక వ్యాపారాలతో అక్కడి ఆర్థిక వ్యవస్థలో కీలకంగా నిలుస్తున్నాయని చెప్పారు. నగరంలో చారిత్రక మూసీ నది ఉన్నా అలాంటి ప్రయోజనం పొందలేకపోతున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నగరాన్ని మరింత అభివృద్ధి పరిచేందుకు చేపడుతున్న పథకాల్లో మూసీ రివర్‌ రివైవల్‌ పథకం ఒకటని చెప్పారు. దీంతో మూసీ నదీ తీరంలో ఆర్థిక కార్యకలాపాలు మరింత పెరగుతాయని అన్నారు.

డేటా భద్రతకు ప్రాధాన్యమివ్వాలి.. రాయి తెలంగాణ విభాగం ఛైర్మన్‌, నీరుస్‌ ఎన్‌సెంబుల్స్‌ ఎండీ అవ్‌నిష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. నగరం రిటైల్‌ వ్యాపార గని అని అన్నారు. జాతీయ బ్రాండ్‌లతో పోటీ పడుతూ నగర బ్రాండ్‌లు సత్తా చాటుతున్నాయని తెలిపారు. రాయి సీఈఓ కుమార్‌ రాజగోపాలన్‌ మాట్లాడుతూ.. ఆర్థిక వ్యవస్థలో రిటైల్‌ వ్యాపారానిదే కీలకభూమికని చెప్పారు. ఒక ఉత్పత్తి వినియోగదారుడికి చేరేందుకు 8 మంది వివిధ దశల్లో పనిచేస్తారని, తద్వారా ఈ రంగం ఉపాధి కల్పనలోనూ ముందుందన్నారు. చిల్లర వ్యాపారంలో సామాజిక మాధ్యమాలను వినియోగించుకోవాలని సూచించారు. రిటైలర్లు డేటా భద్రతకు ప్రాధాన్యమివ్వాలని చెప్పారు.   చిల్లర వ్యాపారంలో ఉత్తమంగా ఎదిగిన వ్యాపారులు.. శరత్‌ సిటీ మాల్‌ అధినేత సయ్యద్‌ అస్లాం, హాలీవుడ్‌ ఫుట్‌్ వేర్‌ యజమాని ఇస్మాయిల్‌ అజాని, జీఎంఆర్‌ గ్రూప్‌నకు చెందిన మనీష్‌, ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌కు చెందిన టి.ప్రసాద్‌రావు, నీలోఫర్‌ కేఫ్‌నకు చెందిన బాబురావు, నీరూస్‌ ఎన్‌సెంబుల్స్‌ ఎండీ అవ్‌నిష్‌ కుమార్‌,  చర్మాస్‌కు చెందిన కేజాస్‌ పెస్టన్‌జీలకు పురస్కారాలు అందజేశారు.  కార్యక్రమంలో రాయి వైస్‌ ఛైర్మన్‌ విజయ కుమార్‌, డా.హితేష్‌ భట్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని