logo

తుది జాబితాపై కసరత్తు పూర్తి

పాలమూరులో ఓటర్ల తుది జాబితాపై కసరత్తు పూర్తయ్యింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎస్‌ఎస్‌ఆర్‌-2024కు అదనంగా కొత్త ఓటర్లను జత చేసి తుది జాబితాను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించనున్నారు.

Updated : 28 Apr 2024 06:44 IST

తప్పులకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు

ఈనాడు, మహబూబ్‌నగర్‌, న్యూస్‌టుడే, కొడంగల్‌, బొంరాస్‌పేట: పాలమూరులో ఓటర్ల తుది జాబితాపై కసరత్తు పూర్తయ్యింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎస్‌ఎస్‌ఆర్‌-2024కు అదనంగా కొత్త ఓటర్లను జత చేసి తుది జాబితాను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 16,80,417 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 8,32,080 మంది పురుషులు, 8,48,293 మంది మహిళలు, 44 మంది ఇతరులు ఉన్నారు. నాగర్‌కర్నూల్‌ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో మొత్తం 17,34,773 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 8,64,034 మంది పురుషులు, 8,70,694 మంది మహిళలు, 45 మంది ఇతరులు ఉన్నారు.

దొంగ ఓట్లు అరికట్టడానికి..

తుది జాబితాలోనూ ఎక్కడైనా పొరపాట్లు వస్తే వాటిని పరిష్కరించడానికి ప్రత్యేకంగా ఎన్నికల అధికారులు ఏఎస్‌డీ(ఆబ్సెంట్‌, ఫిఫ్టెడ్‌, డెడ్‌) జాబితాపై దృష్టి పెట్టనున్నారు. స్థానికంగా లేనివారి పేర్లు ఉంటే వీరి పేరు మీద దొంగ ఓట్లు వేయడానికి ఆస్కారం ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో పెద్ద ఎత్తున వలస ఓటర్లు ఉన్నారు. పోలింగ్‌ బూత్‌ల వారీగా ఓటరు జాబితాలో పేరుండి మృతి చెందినవారు, స్థానికంగా లేనివారు, ఆ ఇంటి చిరునామాలో లేని వ్యక్తులను గుర్తించి ఈ జాబితా రూపొందించనున్నారు. దీనిని పోలింగ్‌ కేంద్రం ప్రిసైడింగ్‌ అధికారికి అందిస్తారు. ఆ జాబితాలో పేరున్న వారు ఓటు వేయడానికి వస్తే ప్రత్యేకంగా పరిశీలిస్తారు. వారి వద్ద ఉన్న గుర్తింపు కార్డులు, ఇతర వివరాలు అడుగుతారు. ఒక వేళ ఇవేవీ లేకుండా జాబితాలో ఉన్న వ్యక్తి కాకుండా వేరే వ్యక్తి దొంగ ఓటు వేయడానికి వస్తే పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. దీనిపై మహబూబ్‌నగర్‌ అదనపు కలెక్టర్‌ మోహన్‌రావు ‘ఈనాడు’తో మాట్లాడుతూ తుది జాబితా సిద్ధమైందన్నారు. ఈ సారి ఎలాంటి తప్పులకు అవకాశం లేకుండా పకడ్బందీగా జాబితా రూపొందించామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని