logo

ఒక్క ఫోటో .. నాలుగేళ్ల కష్టం

ఈ చిత్రం చూశారా.. ఓయూ ఆర్ట్స్‌ కళాశాల అనుకుంటున్నారా.. అయితే మీరు పొరబడినట్లే. ఇది కైరోలోని ఈజిప్ట్‌ ప్రెసిడెన్షియల్‌ ప్యాలెస్‌. దీని ఆర్కిటెక్ట్‌ మొనేసర్‌ ఎర్నెస్ట్‌ జాస్పర్‌.

Published : 28 Apr 2024 07:28 IST

ఓయూ ఆర్ట్స్‌ కళాశాల భవన రూపశిల్పి జాస్పర్‌ చిత్రం లభ్యం

ఓయూ ఆర్ట్స్‌ కళాశాల కాదు.. ఈజిప్ట్‌ ప్రెసిడెన్షియల్‌ ప్యాలెస్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఈ చిత్రం చూశారా.. ఓయూ ఆర్ట్స్‌ కళాశాల అనుకుంటున్నారా.. అయితే మీరు పొరబడినట్లే. ఇది కైరోలోని ఈజిప్ట్‌ ప్రెసిడెన్షియల్‌ ప్యాలెస్‌. దీని ఆర్కిటెక్ట్‌ మొనేసర్‌ ఎర్నెస్ట్‌ జాస్పర్‌. నిజాం ప్రభువు అభ్యర్థనతో ఆ ప్యాలెస్‌ను పోలిన విధంగా కొన్ని మార్పులు చేసి ప్రస్తుత ఆర్ట్స్‌ కళాశాల భవనాన్ని ఆయనే రూపొందించారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా.. ఆ చారిత్రక భవన రూపశిల్పి ఫొటో ఇప్పటివరకు లేకపోవడం శోచనీయం.  కానీ ఓయూ పరిశోధక విద్యార్థి ఎన్‌.వర్షిత్‌రెడ్డి, తన స్నేహితులు, పరిశోధన పర్యవేక్షకుడు ప్రొఫెసర్‌ అర్జున్‌రావు సహకారంతో నాలుగేళ్లపాటు అన్వేషించి జాస్పర్‌ ఫొటోను సాధించారు.

అధ్యయనం.. అన్వేషణ : వర్షిత్‌రెడ్డి ఒకవైపు జాస్పర్‌ గురించి అధ్యయనం చేస్తూనే.. మరోవైపు ఫొటో కోసం అన్వేషణ కొనసాగించారు. మన దేశంతో పాటు ఈజిప్ట్‌, ప్యారిస్‌ సహా చాలా దేశాల్లోని గ్రంథాలయాల్లో పురాతన గ్రంథాల నుంచి పలు వివరాలు సేకరించారు. ఆర్ట్స్‌ కళాశాల నిర్మాణం పూర్తయ్యాక జాస్పర్‌ బెల్జియం వెళ్లిపోయారు. అతను సిగ్గరి కావడంతో ఫొటోలు తీసుకోలేదు.

కేసులు పెడతామని బెదిరింపులు

ఈజిప్ట్‌ రాజధాని కైరో నగరంలో జాస్పర్‌ ఆధ్వర్యంలో నిర్మించిన హోటల్‌లో ఫొటో ఉందని గుర్తించారు. హోటల్‌ యాజమాన్యాన్ని సంప్రదించినా వారు స్పందించలేదు. కైరోలో భారత రాయబార కార్యాలయ సహకారంతో అక్కడి అధికారులను సంప్రదించారు. వర్షిత్‌ రెడ్డి తీరు బాగాలేదని, మరోసారి అడిగితే ఆయనపై కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించినా వెనక్కి తగ్గలేదు.

ఇలా చేరింది భాగ్యనగరానికి..

ఆరునెలల క్రితం అంతర్జాలంలో మళ్లీ శోధిస్తుండగా.. జాస్పర్‌ డిజిటల్‌ ఫొటో కనిపించింది. దాని మూలాలను అన్వేషించగా.. ప్యారిస్‌లోని జాతీయ గ్రంథాలయంలో ఉందని తెలిసింది. అక్కడ డిజిటల్‌ పద్ధతిలో మార్చిన ఆయన ఫొటో, వివరాలను ఓ చరిత్ర పుస్తకంలో ప్రచురించారు. అక్కడి గ్రంథాలయ అధికారులను అభ్యర్థించగా.. సానుకూలంగా స్పందించడంతో ప్రఖ్యాత రూపశిల్పి ఎర్నెస్ట్‌ జాస్పర్‌ ఫొటో హైదరాబాద్‌కు వచ్చింది.


గురువుకు దక్షిణ.. : జాస్పర్‌ ఫొటోను సోషల్‌ సైన్సెస్‌ ప్రిన్సిపల్‌, ప్రొఫెసర్‌ అర్జున్‌రావుకు గురుదక్షిణగా ఇచ్చారు. ఓయూ 107వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జాస్పర్‌ ఫొటోను పెద్దగా మార్పించి ప్రదర్శనలో ఉంచారు. వర్షిత్‌ రెడ్డి కష్టాన్ని, కృషిని ఆచార్యులు అభినందించారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని