logo

ఓటు సమ్మేళనాలు

ఎన్నికల్లో గెలవాలంటే అన్ని వర్గాల ఓటర్లను ప్రసన్నంచేసుకోవాలి. శాసనసభ ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం చేస్తారు. అదే లోక్‌సభ ఎన్నికల్లో..

Updated : 29 Apr 2024 05:28 IST

అన్ని వర్గాలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ప్రచారం

మోతీనగర్‌లో సేవాభారతి ట్రస్టు సభ్యులతో సునీతా మహేందర్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నికల్లో గెలవాలంటే అన్ని వర్గాల ఓటర్లను ప్రసన్నంచేసుకోవాలి. శాసనసభ ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం చేస్తారు. అదే లోక్‌సభ ఎన్నికల్లో.. పైగా ఎండలు మండిపోతున్న తరుణంలో ఓటర్లందరినీ కలవడం కత్తిమీద సామే. ఈ క్రమంలోనే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆత్మీయ సమ్మేళనాలకు శ్రీకారంచుడుతున్నారు. మతపెద్దలు, సామాజిక వర్గాలు, గేటెడ్‌ కమ్యూనిటీలు, కాలనీసంఘాలు, కార్మిక, ఉద్యోగ సంఘాతో సమావేశమై ఓట్లు అభ్యర్థిస్తున్నారు. గతంలో తమ పార్టీ చేసిన పనులు, గెలిపిస్తే ఏం చేయాలనుకుంటున్నామో వివరిస్తున్నారు. అభ్యర్థులే నేరుగా హాజరవ్వడం లేదా కుటుంబసభ్యులు, పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యేలా చూస్తున్నారు. తెల్లవారుజామున వాకర్లతో మాటామంతితో మొదలయ్యే ఈ సమావేశాలు.. రాత్రివేళ బస్తీలు, కాలనీల్లో అందర్నీ కలిసేవరకూ కొనసాగుతున్నాయి.

కూకట్‌పల్లిలో కాలనీ సంఘం సమావేశంలో ఈటల రాజేందర్‌

అజెండా అందరి ముందు

సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తే జన సమీకరణకు భారీగా ఖర్చుపెట్టాలి. మల్కాజిగిరి, చేవెళ్ల నియోజకవర్గాల్లో అన్ని వర్గాల ఓటర్లను చేరుకోవడానికి సుధీర్ఘ సమయం పడుతుంది. అదే ఫంక్షన్‌హాళ్లు, కమ్యూనిటీ కేంద్రాలు, కాలనీ సంఘాలతో సమావేశాలకు జనసమీకరణ అవసరముండదు. రవాణా, భోజనం వంటి ఖర్చు తగ్గుతుంది. ఎండలతో సంబంధం లేకుండా ఉదయం నుంచి రాత్రి వరకూ సమావేశాలు నిర్వహించుకోవచ్చు. స్థానికులు తమ ప్రాంతం, స్థానిక సమస్యల్ని అభ్యర్థుల దృష్టికి తీసుకెళ్తున్నారు. అభ్యర్థులు హామీలు కూడా ఇస్తున్నారు. ప్రస్తుతం రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో ఈ తరహా ప్రచారం ఎక్కువగా కనిపిస్తోంది. ఆత్మీయ సమావేశాలు ప్రధానంగా కొన్ని సామాజికవర్గాల ఓట్లు ఆకర్షించడం లక్ష్యంగా నిర్వహిస్తున్నారు. ఎన్నికల సంఘం నిఘా ఉంటుందన్న ఉద్దేశంతో కొందరు అభ్యర్థులు జెండాలు, కార్యకర్తల హడావుడి లేకుండానే గుట్టుగా నిర్వహిస్తున్నారు.

విందు రాజకీయాలు!

పోలింగ్‌ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ కాలనీలు, గేటెడ్‌ కమ్యూనిటీలు, బస్తీల్లో విందు రాజకీయాలు జోరందుకున్నాయి. అభ్యర్థులు సాయంత్రం తర్వాత ముఖ్య నాయకులు, కార్యకర్తలకు ‘అన్నీ’ చూసుకుంటున్నారు. ప్రధాన అభ్యర్థులు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఎప్పటికప్పుడు సర్వేలతో విజయావకాశాలు అంచనా.. పార్టీ ఎక్కడ వెనుకబడి ఉందో సమీక్షించుకుంటున్నారు. దానికి తగ్గట్టే ప్రచారాన్ని చేస్తున్నారు. ఉదాహరణకు ఓ మల్కాజిగిరి అభ్యర్థి.. నియోజకవర్గ పరిధిలోని బస్తీలు, పేదలు ఉండే 20కిపైగా ప్రాంతాల్లో పార్టీ కొంత వెనుకంజలో ఉన్నట్లు సర్వేతో తెలుసుకొని.. ఆయా ప్రాంతాల్లో ఓటర్లను ఎక్కువగా కలిసేందుకు పర్యటనలకు శ్రీకారం చుట్టారు. స్థానిక నాయకులతో అక్కడి వారిని మచ్చికచేసుకోవడానికి తరచూ విందులు ఏర్పాటుచేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని