logo

అభ్యర్థుల తరపున అన్నీ తామై..

చోటామోటా నాయకులు అని కొట్టి పారేయకండి.. ఎన్నికల వేళ వాళ్లే నేతలకు అండాదండా అవుతున్నారు. బూత్‌ స్థాయిలో ఎవరు ఎవరికి ఓటేస్తారో కచ్చితంగా చెప్పేయగలరు.

Updated : 29 Apr 2024 05:27 IST

కీలకంగా మారిన బూత్‌ స్థాయి నేతలు
ఆత్మీయ సమావేశాల్లో తాయిలాల పంపిణీ

చోటామోటా నాయకులు అని కొట్టి పారేయకండి.. ఎన్నికల వేళ వాళ్లే నేతలకు అండాదండా అవుతున్నారు. బూత్‌ స్థాయిలో ఎవరు ఎవరికి ఓటేస్తారో కచ్చితంగా చెప్పేయగలరు. అందుకే ఓటరు జాబితా పట్టుకుని టిక్కులు పెడుతున్నారు. అలా టిక్కులు పెట్టి వాట్సప్‌ గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు. అభ్యర్థి తరఫున అన్నీ తామై ఓటర్లను చూసుకుంటున్నారు. వారికి ఇవ్వాల్సిన తాయిలాలు కూడా నేరుగా చేర్చేసి చడీచప్పుడు లేకుండా పంపిణీ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. ఆత్మీయ, బస్తీ, కాలనీ సమావేశాలు ఏర్పాటు చేసి మద్దతు కూడగడుతున్నారు. ఎన్నికల వేళ అభ్యర్థులు, ముఖ్య అనుచరుల మీద నిఘా ఉండడంతో పంపిణీలకు బూత్‌, వార్డు స్థాయి నాయకులే కీలకపాత్ర పోషిస్తున్నారు. అందరికీ పంచేసి ఆగమవ్వకుండా.. ఎంతమందికి ఇవ్వాలో చెప్పి మరి పంపిణీ చేస్తున్నారు. అలా ఓటర్లు చేజారకుండా.. కనిపెట్టుకుని, ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి.. ఓటు వేసేవరకూ ఓ కంటకనిపెడుతూ కీలకపాత్ర పోషిస్తున్నారు.

ఈనాడు, హైదరాబాద్‌


ఓటరు జాబితా ప్రకారం..

ఒక్కో బూత్‌లో ఎంతమంది తమవారు ఉన్నారో.. ఎంతమందిని మనవైపు తిప్పుకోవచ్చో కచ్చితమైన లెక్కలతో బూత్‌ నాయకులు సిద్ధమయ్యారు. ఓటరు జాబితాలో పేర్లు ప్రకారం వారిని కలిసి.. నేరుగా అభ్యర్థి తరఫున పంపిణీలు చేస్తున్నారు. కొన్ని బస్తీల్లో అభివృద్ధి పనులు, ఆలయాలకు ప్రత్యేక హంగులద్దడం, యువతకు క్రీడాసామగ్రి అందజేయడం.. ఇలా నిత్యం వారితో ఉండి.. వారికి ఏమి కావాలో అవి సమకూర్చి.. ఓటర్లు చేజారిపోకుండా చూసుకుంటున్నారు. వార్డుల్లో ఓవ్యక్తి ఓటరు జాబితాలో టిక్కులు పెట్టుకుంటుంటే.. చూసిన ‘ఈనాడు’ విలేకరికి.. ఆ టిక్కుల లెక్కలు ఏమిటో వివరించారు. తమవారితోనే కలుస్తున్నాం కనుక ఎవరి దృష్టి తమపై ఉండదని అంటున్నారు. టిక్కు పెట్టామంటే.. ఓటు మీట నొక్కేవరకూ వారంతా తమతో ఉన్నట్టే అని చెబుతున్నారు.


సమావేశాలతో చేరువ..

తెల్లారితే ఒకరికొకరు కనిపిస్తారు.. పలకరించుకుంటారు.. తరచూ కలుసుకుని సరదాగా గడుపుతారు. అవన్నీ ఐదారుగురికే పరిమితం. ఎన్నికల వేళ అలా కాదు.. ఏకంగా బస్తీ, వార్డు, బూత్‌స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయడం.. అవసరమైతే అభ్యర్థిని ఒకసారి వచ్చి కలిసి వెళ్లమని సూచించడం.. ఇలా అన్నీ బూత్‌, వార్డు కమిటీ నేతలే దగ్గరుండి చూసుకుంటున్నారు. ఎవరికి వారు తమ గౌరవానికి భంగం కలగకుండా ఓటర్లను సమాయత్తం చేసి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు పుట్టిన రోజు వేడుకలనూ వదలడం లేదు. అభ్యర్థుల తరఫున రంగంలోకి దిగి ఓటర్లను పెంచుతున్నారు. దీంతో ఎప్పుడు ఎటువైపు వెళ్లిపోతారో అనే భయం ఇప్పుడు అభ్యర్థులకు ఉండడం లేదు. వారితో వాట్సప్‌ గ్రూపులు ఏర్పాటు చేసి ప్రచార వివరాలను షేర్‌ చేసుకుంటున్నారు. జనసమీకరణకు వినియోగించుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని