logo

రాజాసింగ్‌.. రాస్తా అలగ్‌: ప్రచారానికి దూరంగా భాజపా ఎమ్మెల్యే

ఆయన ఎవరి మాట వినరు.. ఆయన మాట పార్టీ వినదు. అందుకేనేమో ఆయన కొద్ది కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

Updated : 29 Apr 2024 08:52 IST

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: ఆయన ఎవరి మాట వినరు.. ఆయన మాట పార్టీ వినదు. అందుకేనేమో ఆయన కొద్ది కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కనీసం లోక్‌సభ ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొనడం లేదు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలంటూ కొద్దిమంది నేతలు ఆయనకు చెప్పినా అబ్బే...నా దారి ఇంతే అంటున్నారు. ఆయన ఎవరో కాదు...గోషామహల్‌ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌.

కంటిలో నలుసులా..

పార్టీ సీనియర్‌ నేతల మాటల్లో చెప్పాలంటే రాజాసింగ్‌ భాజపాకు కంటిలో నలుసులా మారారు. ఈ ఎమ్మెల్యే వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజధానిలో ఒకప్పుడు మాజీ ఎంపీ ఆలె నరేంద్ర హిందుత్వానికి ప్రతినిధిగా ఉండేవారు. ఆయన చనిపోయిన తరువాత ఆ స్థానాన్ని రాజాసింగ్‌ భర్తీ చేశారనే చెప్పొచ్చు. రాజధానిలో కొన్నిసార్లు భాజపా పరువును నిలబెట్టిందీ ఆయనే. 2018, 23 ఎన్నికల్లో గ్రేటర్‌ పరిధిలోని మొత్తం 29 శాసనసభ స్థానాల్లో ఆయనొక్కరే కమలం పార్టీ నుంచి గెలిచారు. అలాంటి వ్యక్తి ప్రస్తుతం పార్టీలోని కొద్దిమంది సీనియర్ల వైఖరిపై మండిపడుతున్నారు. సుమారు రెండు నెలలుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ సహాయ నిరాకరణ చేస్తున్నారు.

కీలక సమయంలో..

కీలకమైన లోక్‌సభ ఎన్నికల సమయంలో సొంత నియోజకవర్గం గోషామహల్‌ పరిధిలోనూ ఆ పార్టీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా ఇప్పటివరకు ప్రచారం చేయలేదు. ప్రధానంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి ఆయనకు మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది. పార్టీ పరంగా కొన్ని నిర్ణయాలు ముందుగా తనకు చెప్పడం లేదని ఆగ్రహంతో రగిలిపోతున్నారు. 2018లో ఆయనొక్కరే భాజపా తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో శాసనసభ పక్షనేతగా ఉన్నారు. మధ్యలో జరిగిన ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావు గెలిచినా ఆయనే కొనసాగారు. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో నగరం నుంచి రాజాసింగ్‌తో పాటు రాష్ట్రంలో ఎనిమిది మంది విజయం సాధించారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు మరోసారి భాజపా శాసనసభ పక్షనేతగా ఇవ్వాలని కోరినా పార్టీ అంగీకరించలేదు. భాష మీద పట్టుతో పాటు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్న అధిష్ఠానం ఆ అవకాశాన్ని ఏలేటి మహేశ్వర్‌రెడ్డికి ఇచ్చింది. మిగిలిన కొన్ని పదవులను ఇతరులకు ఇచ్చారు. హైదరాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా మాధవీలతను ఎంపిక చేసినపుడూ ఆయనకు ముందుగా సమాచారం ఇవ్వలేదని చెబుతున్నారు. ఇతర అభ్యర్థుల విషయంలోనూ అతని అభిప్రాయం తీసుకోలేదు. ఈ కారణంగా రాష్ట్ర పార్టీలోని కొందరు అగ్రనేతలపై మండిపడుతున్నారు.

దూరం పెడుతున్నారని...

ఇటీవల హైదరాబాద్‌కు అమిత్‌షాతో పాటు ఇతర పార్టీ పెద్దలు వచ్చినా ఆయన వారిని కలవలేదు. ముఖ్యంగా కిషన్‌రెడ్డి పేరు చెబితేనే రాజాసింగ్‌ అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. తనను పార్టీ నుంచి దూరం చేయడానికి ఆయనతో పాటు  మరికొందరు ప్రయత్నిస్తున్నారనే అసంతృప్తితో ఉన్నారని అతని అనుచురులు చెబుతున్నారు. సికింద్రాబాద్‌ ఎంపీగా కిషన్‌రెడ్డి గెలవాలంటే రాజాసింగ్‌ తోడ్పాటు చాలా అవసరమని పార్టీ సీనియర్‌ నేతలు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర నేతలతో చెప్పించి ఆయన్ను సికింద్రాబాద్‌ పరిధిలో పర్యటించేలా ఒప్పించాలని కోరుతున్నారు. హైదరాబాద్‌ పరిధిలోనూ రాజాసింగ్‌ గట్టి ప్రభావాన్ని చూపిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని