logo

ఆకాశంలో సగం.. వినిపించని గళం

ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగంగా ఉన్న మహిళలు క్యూలైన్లలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకోవడానికే పరిమితమవుతున్నారు. నగరం నుంచి పార్లమెంటు వేదికగా గళం వినిపించేందుకు దశాబ్దాల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది.

Published : 30 Apr 2024 03:01 IST

ఏడు దశాబ్దాల్లో రాజధానిలో ఒక్కరికే ఎంపీగా అవకాశం
సికింద్రాబాద్‌ నుంచి పార్లమెంటుకు మణెమ్మ

ఈనాడు- హైదరాబాద్‌: ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగంగా ఉన్న మహిళలు క్యూలైన్లలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకోవడానికే పరిమితమవుతున్నారు. నగరం నుంచి పార్లమెంటు వేదికగా గళం వినిపించేందుకు దశాబ్దాల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. చైతన్యవంతమైన ఓటర్లుండే రాజధాని పరిధిలోని నాలుగు లోక్‌సభ నియోజకవర్గాల్లో ఇప్పటివరకూ ఒక్కరు మాత్రమే ఎంపీగా గెలుపొంది పార్లమెంటులో అడుగుపెట్టారు. సికింద్రాబాద్‌ నుంచి మాజీ సీఎం టంగుటూరి అంజయ్య సతీమణి మణెమ్మ రెండుసార్లు గెలుపొందారు. ఇక్కడ మినహా మిగిలిన మూడు నియోజకవర్గాల నుంచి ఇప్పటివరకూ ఒక్క మహిళకూ ప్రాతినిథ్యం దక్కపోవడం గమనార్హం. రాజధానిలో ఈ సారి నాలుగు నియోజకవర్గాల్లో కోటికిపైగా ఓటర్లున్నా.. ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థుల సంఖ్య తక్కువగానే ఉంది. హైదరాబాద్‌ నుంచి మాధవీలత, మల్కాజిగిరి నుంచి సునీతా మహేందర్‌ రెడ్డి ప్రధాన పార్టీల నుంచి పోటీలో ఉన్నారు.

మణెమ్మ


హైదరాబాద్‌..

1952లో ఏర్పాటైన హైదరాబాద్‌ నియోజకవర్గంలో ఇప్పటివరకూ మహిళలు నెగ్గలేదు. హైదరాబాద్‌కు మొత్తం 17 సార్లు ఎన్నికలు జరిగాయి. ఎంఐఎంకు కంచుకోట లాంటి ఈ నియోజకర్గం నుంచి అత్యధికంగా సుల్తాన్‌ సల్లావుద్దీన్‌ ఒవైసీ ఆరుసార్లు.. ఆయన కుమారుడు అసదుద్దీన్‌ ఒవైసీ నాలుగుసార్లు విజయం సాధించారు. ఈసారి భాజపా తమ అభ్యర్థిగా కొంపల్లి మాధవీలతను ప్రకటించింది. ఈమె ప్రచారంలో దూసుకెళ్తున్నారు..

ఓటర్లు(లక్షల్లో)

పురుషులు - 11.20
మహిళలు - 10.85


సికింద్రాబాద్‌

నగరం నుంచి తొలిసారి మహిళను పార్లమెంటుకు పంపిన నియోజకవర్గం సికింద్రాబాద్‌. 1952లో ఏర్పాటైన ఈ నియోజకవర్గానికి 1987లో ఉప ఎన్నికలు రాగా మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య సతీమణి మణెమ్మ కాంగ్రెస్‌ తరఫున గెలుపొందారు. ఆ తర్వాత 1989లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు. సికింద్రాబాద్‌కు మొత్తం 19 సార్లు ఎన్నికలు రాగా రెండు సార్లు మినహా సికింద్రాబాద్‌ నుంచి పురుషులే ప్రాతినిథ్యం వహించారు. బండారు దత్తాత్రేయ సికింద్రాబాద్‌ నుంచి అత్యధికంగా నాలుగుసార్లు గెలుపొందారు.

ఓటర్లు(లక్షల్లో)

పురుషులు - 10.83
మహిళలు - 10.27


చేవెళ్ల

రాష్ట్రానికే తలమానికమైన ఐటీ కారిడార్‌ విస్తరించిన చేవెళ్ల నియోజకవర్గం 2009లో ఏర్పాటైంది. తొలిసారి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సూదిని జైపాల్‌రెడ్డి విజయం సాధించారు. మూడుసార్లు ఎన్నికలు జరగ్గా పురుషులే విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో ప్రధాన పార్టీలేవీ మహిళల్ని పోటీలో నిలబెట్టలేదు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల కలబోతగా ఉండే నియోజకవర్గంలో గత మూడు ఎన్నికల్లో కొత్త అభ్యర్థులే విజయం సాధించారు.

ఓటర్లు(లక్షల్లో)

పురుషులు - 15.04
మహిళలు - 14.33


మల్కాజిగిరి

విభిన్న సంస్కృతులు, వర్గాల వారుండే దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం మల్కాజిగిరి. పునర్విభజనలో భాగంగా 2009లో ఏర్పాటైంది. గత మూడు ఎన్నికల్లో మహిళలకు ప్రాతినిథ్యం దక్కలేదు. ఈసారి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పట్నం సునితామహేందర్‌ రెడ్డి బరిలో నిలిచారు. ఈమె ప్రచారంలో దూసుకెళ్తున్నారు.

ఓటర్లు(లక్షల్లో)

పురుషులు - 19.45
మహిళలు - 18.33

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని