logo

కమల దళం.. అధినేతల కదనోత్సాహం

నగరంలో భాజపాకు మంచి పట్టుంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 48 డివిజన్లు కైవసం చేసుకుని సత్తాచాటిన భాజపా.. అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చి.. పలుచోట్ల రెండో స్థానంలో నిలిచింది.

Updated : 03 May 2024 05:24 IST

నగరంలో అధిక స్థానాలే లక్ష్యంగా రోడ్‌షోలు

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో భాజపాకు మంచి పట్టుంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 48 డివిజన్లు కైవసం చేసుకుని సత్తాచాటిన భాజపా.. అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చి.. పలుచోట్ల రెండో స్థానంలో నిలిచింది. ఆ మాటకొస్తే నగరమే పునాదిగా భాజపా ఎదిగింది. అందుకే ఈసారి  చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌తో పాటు హైదరాబాద్‌ ఎంపీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఆ పార్టీ విస్తృత ప్రచారం చేస్తోంది. షెడ్యూల్‌ విడుదలైన నాటి నుంచే ప్రచారాన్ని వేడెక్కించింది. భాజపా అభ్యర్థుల నామినేషన్‌ కార్యక్రమాల్లో కేంద్ర మంత్రులు నేరుగా పాల్గొన్నారు.

నామినేషన్‌ నుంచే వెన్నంటి నిలిచి..

మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్‌ నామినేషన్‌ వేసినప్పుడు.. కేంద్ర మంత్రి హరిదీప్‌సింగ్‌ పూరి వచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. సికింద్రాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా జి.కిషన్‌రెడ్డి నామినేషన్‌ వేసినప్పుడు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హాజరై ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. హైదరాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత నామినేషన్‌ కార్యక్రమం  పూర్తయ్యేవరకూ కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ వెన్నంటే ఉన్నారు. చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి నామినేషన్‌ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ పాల్గొన్నారు. ప్రజా ఆశీర్వాద కార్యక్రమాల్లో రాజ్యవర్ధన్‌ రాథోడ్‌ పాల్గొని విశ్వేశ్వర్‌రెడ్డికి మద్దతు పలికారు. నిజాంపేటలో జరిగిన రోడ్డు షోలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొని ఈటలకు మద్దతుగా నిలిచారు. బుధవారం హైదరాబాద్‌ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రోడ్‌షోలో పాల్గొన్నారు.

నగరాన్ని చుట్టేస్తున్న జాతీయ నాయకులు

ఇప్పటికే భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా,  కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలు రోడ్‌షోల్లో పాల్గొన్నారు. ఈ నెల 10న ప్రధానమంత్రి నగరంలో ఎన్నికల ప్రచారానికి వస్తున్నట్టు సమాచారం. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో పాటు.. పలువురు కేంద్ర మంత్రులు ప్రచార కార్యక్రమంలో నిమగ్నమవనున్నారు. నగరంలో ఉత్తర భారతదేశానికి చెందిన వారు.. ఇక్కడ వారితో కలిసిపోయినా తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారిని ఆకర్షించడంలో భాజపా అగ్రగామిగా ఉంది. కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ వచ్చి నేరుగా కంటోన్మెంట్‌లోని మాజీ సైనికులతో సమావేశమయ్యారు. వారితో ఉన్న పరిచయాన్ని ఓటు శక్తిగా మార్చుకోవాలని ప్రయత్నించారు. రాజస్థాన్‌ మంత్రి, క్రీడాకారుడు రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌ రెండురోజులుగా ఇక్కడే ఉండి రాజస్థాన్‌కు చెందిన వారిని కలుసుకున్నారు. మల్కాజిగిరితో పాటు.. సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో ఎక్కువమంది తమిళులు ఉంటున్నారు. వారిని భాజపాకు ఓటు బ్యాంకుగా మార్చేందుకు తెలంగాణ మాజీ గవర్నర్‌, ప్రస్తుతం తమిళనాడులో ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న తమిళిసై వారానికి పైగా ఇక్కడే ఉండి ప్రచారం చేస్తున్నారు. గవర్నర్‌గా పని చేసినప్పుడు ఉన్న పరిచయాలను ఉపయోగించుకోవాలని చూస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని