logo

నాలుగో రోజు 25 నామినేషన్లు

నామినేషన్ల ప్రక్రియ నాలుగో రోజు సోమవారం కరీంనగర్‌, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ స్థానాలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి.

Published : 23 Apr 2024 02:14 IST

కరీంనగర్‌లో 13.. పెద్దపల్లిలో 12

కరీంనగర్‌ (ఈనాడు), పెద్దపల్లి కలెక్టరేట్‌ (న్యూస్‌టుడే) : నామినేషన్ల ప్రక్రియ నాలుగో రోజు సోమవారం కరీంనగర్‌, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ స్థానాలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. కరీంనగర్‌ స్థానానికి 13 మంది నామినేషన్లను సమర్పించగా.. పెద్దపల్లి స్థానానికి 12 మంది నామపత్రాలను అందించారు. ఈ రెండు చోట్ల స్వతంత్రులతోపాటు ఇతర గుర్తింపు పొందిన పార్టీల తరఫున ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కరీంనగర్‌, పెద్దపల్లి కలెక్టరేట్‌లలో సందడి కనిపించింది. ఆదివారం సెలవు కావడంతో సోమవారం కలెక్టరేట్‌ల వద్ద అభ్యర్థులు, వారి మద్దతుదారుల సందడి పెరిగింది. ఈ నెల 25వ తేదీ వరకు అవకాశం ఉండటంతో రాబోయే మూడు రోజులపాటు నామినేషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఇప్పటి వరకు మొత్తంగా కరీంనగర్‌లో 19 మంది, పెద్దపల్లిలో 25 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు.

24న పెద్దపల్లి భాజపా అభ్యర్థి..

కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో భాజపా, భారాసల తరఫున.. పెద్దపల్లిలో కాంగ్రెస్‌, భారాస అభ్యర్థులు నామినేషన్లు వేశారు. కరీంనగర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఖరారు కానప్పటికీ వెలిచాల రాజేందర్‌రావు నామపత్రాలు దాఖలు చేశారు. అధిష్ఠానం ఆయన పేరే ప్రకటించే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. మరోవైపు ఆ పార్టీలో ఆఖరి నిమిషం వరకు టికెట్‌ విషయంలో ఎలాంటి మార్పులు చేర్పులైనా జరిగే అవకాశముందనే మరో మాట కూడా వినిపిస్తోంది. ఇప్పటికే కరీంనగర్‌ స్థానంలో ప్రధాన పార్టీల అభ్యర్థులుగా బండి సంజయ్‌ కుమార్‌ (భాజపా) బోయినపల్లి వినోద్‌కుమార్‌ (భారాస)లు, పెద్దపల్లి స్థానంలో గడ్డం వంశీ (కాంగ్రెస్‌), కొప్పుల ఈశ్వర్‌ (భారాస)లు పత్రాలను సమర్పించారు. పెద్దపల్లి స్థానంలో భాజపా అభ్యర్థిగా గోమాసె శ్రీనివాస్‌ పేరు ఇదివరకే ఖరారైనప్పటికీ ఆయన ఇంకా నామినేషన్‌ వేయలేదు. సోమవారం పెద్దపల్లిలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి మందకృష్ణ మాదిగ హాజరై ఆయనకు మద్దతు తెలిపారు. కాగా ఈ నెల 24న నామినేషన్‌ వేసేందుకు గోమాసె శ్రీనివాస్‌ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కేంద్ర మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌ భాజపా నిర్వహించే ర్యాలీ సహా నామినేషన్‌ దాఖలుకు హాజరవతారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

కాంగ్రెస్‌ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు?

కరీంనగర్‌ స్థానంలో కాంగ్రెస్‌ తరఫున వెలిచాల రాజేందర్‌రావు అట్టహాసంగా ర్యాలీ నిర్వహించి నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. ఆ పార్టీ అధిష్ఠానం ఇప్పటి వరకు ఇక్కడి అభ్యర్థిని ప్రకటించలేదు. కానీ నామినేషన్‌ ర్యాలీకి కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలి వచ్చారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, మానకొండూర్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంలతోపాటు వెలిచాల రాజేందర్‌రావు వాహనంపై నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. మూడు రోజులుగా అభ్యర్థిగా రాజేందర్‌రావును ఖరారు చేస్తారనే ప్రచారం సాగుతోంది. మూడు రోజుల కిందట తిమ్మాపూర్‌ మండలం అలుగునూర్‌లో నిర్వహించిన ఆ పార్టీ సమావేశంలోనూ అభ్యర్థిగా రాజేందర్‌రావు అనే విధంగానే శ్రేణులకు సంకేతాలిచ్చారు. తరువాత సామాజిక మాధ్యమాల్లో మరో నాయకుడిని అభ్యర్థిగా ప్రకటించినట్లు ప్రచారం సాగింది. కానీ రాజేందర్‌రావు అట్టహాసంగా నామినేషన్‌ వేయడంతో ఈయన అభ్యర్థిత్వాన్నే ఖరారు చేస్తారని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఖమ్మం, కరీంనగర్‌, హైదరాబాద్‌ స్థానాలకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిని ప్రకటించలేదు. నామినేషన్ల గడువు సమీపిస్తుండటంతో అధిష్ఠానం నుంచి అందిన మౌఖిక ఆదేశాలతోనే భారీ ర్యాలీతో నామపత్రాలు దాఖలు చేసి ఉంటారని ఆ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు.  

నామపత్రాలు దాఖలు చేసింది వీరే..

సోమవారం పెద్దపల్లి స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా దుర్గం సమ్మయ్య, ఆర్నకొండ రాజు, గడ్డం మారుతి, రాముల కార్తీక్‌, జుమ్మిడి గోపాల్‌, అంబాల మహేందర్‌, జనగామ నరేశ్‌, ముల్కళ్ల రాజేంద్ర ప్రసాద్‌, దాగం సుధారాణి, గద్దల వినయ్‌కుమార్‌, బొట్ల చంద్రయ్యలు నామినేషన్లు వేశారు. వీరితోపాటు ధర్మ స్వరాజ్‌ పార్టీ అభ్యర్థిగా మంద రమేశ్‌ పత్రాల్ని సమర్పించారు. గతంలోనే నామినేషన్లు వేసిన జాడి ప్రేమ్‌సాగర్‌, అక్కపాక తిరుపతిలు రెండో సెట్‌ వేశారు. కరీంనగర్‌ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్‌రావు నాలుగు సెట్లు నామినేషన్‌ వేయగా చింత అనిల్‌కుమార్‌ (పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా), తాళ్లపల్లి అరుణ (ఆధార్‌ పార్టీ) గట్టు రాణాప్రతాప్‌ (సోషలిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా), చిలువేరు శ్రీకాంత్‌ (ధర్మ సమాజ్‌ పార్టీ), లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి (సీపీఐ), స్వతంత్ర అభ్యర్థులుగా దేవునూరి శ్రీనివాస్‌, బంక రాజు, అబ్బడి బుచ్చిరెడ్డి, గవ్వల లక్ష్మి, జింక శ్రీనివాస్‌, బరిగె గట్టయ్య యాదవ్‌, ఎండీ జిషాన్‌లు నామపత్రాలు సమర్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని