logo

ఎన్నికల వేళ... పెరగని మద్యం అమ్మకాలు

ఎన్నికలు అనగానే పోటీలో ఉన్న అభ్యర్థులు మద్యం పంపిణీ, విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తుంటారు. కానీ జిల్లాలో మాత్రం మద్యం అమ్మకాలపై ఎన్నికల ప్రభావం చూపలేదు.

Updated : 28 Apr 2024 05:50 IST

ముమ్మర తనిఖీల ఫలితం

న్యూస్‌టుడే, సిరిసిల్ల కలెక్టరేట్‌ : ఎన్నికలు అనగానే పోటీలో ఉన్న అభ్యర్థులు మద్యం పంపిణీ, విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తుంటారు. కానీ జిల్లాలో మాత్రం మద్యం అమ్మకాలపై ఎన్నికల ప్రభావం చూపలేదు. ఇందుకు ఆబ్కారీశాఖ చెబుతున్న లెక్కలే నిదర్శనం. పార్లమెంటు ఎన్నికల కోడ్‌ మార్చి 16న ప్రారంభమైనప్పటి నుంచి జిల్లాలో ఆబ్కారీశాఖ అధికారులు బెల్టుషాపులు మూసివేయించారు. గుడుంబా స్థావరాలపై దాడులు చేస్తున్నారు. వీటి ఫలితంగా విక్రయాలు తగ్గాయని చెబుతున్నారు.

జిల్లాలో 48 మద్యం దుకాణాలు, 8 బార్లు ఉన్నాయి. వీటిపై ఆబ్కారీశాఖ అధికారులు నిఘా పెట్టడంతో పాటు గ్రామాలు, పట్టణాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మద్యం అక్రమంగా తరలిస్తున్న వారితోపాటు నిల్వ ఉంచిన మద్యాన్ని పట్టుకొని కేసులు నమోదు చేస్తున్నారు. తనిఖీల్లో మద్యంతో పాటు సారా, బెల్లం స్వాధీనం చేసుకుంటున్నారు. జిల్లాలో ఎక్సైజ్‌ శాఖ అధికారుల తనిఖీల్లో రూ.22,699 విలువైన మందు పట్టుకున్నారు. ఇప్పటి వరకు 136 కేసులు నమోదు చేశారు.  

5 బాటిళ్ల మద్యం, ఆరు బీర్ల వరకు అనుమతి

శుభకార్యాలు, పండగల సందర్భంలో ఒక వ్యక్తి 5 మద్యం బాటిళ్లు, ఆరు బీర్లు తీసుకుపోవడానికి అనుమతి ఉంటుంది. మద్యాన్ని తరలించేప్పుడు అధికారులకు పట్టుబడితే దానికి సరైనా ఆధారాలు చూపించాలి. శుభకార్యాల పేరుతో ఇంటికి తీసుకెళ్లి విక్రయిస్తున్నట్లు తెలిస్తే కేసులు నమోదు చేస్తారు.

ప్రభావం చూపని ఎన్నికలు

ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో మద్యం షాపులపై ఎలాంటి ప్రభావం చూపడం లేదు. జనవరి నుంచి ఇప్పటి వరకు ప్రతి నెలా అమ్మకాలు మామూలుగానే కొనసాగుతున్నాయి. వేసవి తీవ్రత నేపథ్యంలో ఎక్కువగా బీర్లకే మద్యం ప్రియులు మొగ్గుచూపుతున్నారు. ఓవైపు బీర్ల వినియోగం పెరగగా, మరోవైపు వాటి సరఫరా తక్కువగా ఉంది. దీంతో స్టాకు వచ్చిన వెంటనే  అమ్ముడు పోతున్నాయి. వాటిని చల్లబరిచే వరకు కూడా వినియోగదారులు ఆగడం లేదని విక్రయదారులు చెబుతున్నారు.


136 కేసులు నమోదు

జిల్లాలోని మూడు ఎక్సైజ్‌ స్టేషన్‌ల పరిధిలో సిబ్బంది విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు బెల్టుషాపుల్లో మద్యం అమ్మేవారితో పాటు గుడుంబా తయారీదారులపై మొత్తం 136 కేసులు నమోదు చేశాం. అక్రమంగా మద్యం తరలిస్తుండటంతో రెండు ద్విచక్ర వాహనాలను సీజ్‌ చేశాం. ఎవరైనా మద్యం నిల్వ ఉంచినట్లు తెలిస్తే ఎక్సైజ్‌శాఖకు సమాచారం అందించాలి. 48 మద్యం దుకాణాల్లో విక్రయాలపై నిఘా కొనసాగిస్తున్నాం.

పంచాక్షరి, జిల్లా ఆబ్కారీ అధికారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని