logo

మోసగించే పార్టీలకు బుద్ధి చెప్పాలి : కేటీఆర్‌

‘పదేళ్లలో తెలంగాణ ఎట్లుండే.. ఇప్పుడెట్లైంది.. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం ఆగమైపోయింది.. కాంగ్రెస్‌, భాజపా మాటలకు మోసపోతే గోసపడతారని కేసీఆర్‌ ఆనాడే చెప్పారు..

Updated : 12 May 2024 06:44 IST

హుజూరాబాద్‌ రోడ్‌షోలో ప్రసంగిస్తున్న కేటీఆర్‌, పక్కన భారాస అభ్యర్థి వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి

రాంపూర్‌ (కరీంనగర్‌), హుజూరాబాద్‌, న్యూస్‌టుడే: ‘పదేళ్లలో తెలంగాణ ఎట్లుండే.. ఇప్పుడెట్లైంది.. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం ఆగమైపోయింది.. కాంగ్రెస్‌, భాజపా మాటలకు మోసపోతే గోసపడతారని కేసీఆర్‌ ఆనాడే చెప్పారు.. ఇప్పుడు 150 రోజులకే కాంగ్రెస్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింద’ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు. కరీంనగర్‌ భారాస అభ్యర్థి వినోద్‌కుమార్‌కు మద్దతుగా శనివారం హుజూరాబాద్‌లో కార్నర్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. రైతు భరోసా కింద రూ.15 వేలు, మహిళలకు రూ.2,500, వృద్ధులకు రూ.4 వేల పింఛను, ఆడబిడ్డల పెళ్లిలకు తులం బంగారం ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పాలన్నారు. కరీంనగర్‌ ఎంపీగా గెలిచిన బండి సంజయ్‌ ఈ అయిదేళ్లలో మీరెప్పుడైనా చూశారా? అని అడిగారు. అదే వినోద్‌కుమార్‌ ప్రజాసమస్యలపై లోక్‌సభలో గళం విప్పారని వివరించారు. కరీంనగర్‌ లోక్‌సభ భారాస అభ్యర్థి బి.వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ బండి సంజయ్‌కు మత విద్వేషాలు తప్ప అభివృద్ధి చేయడం, ప్రజలను గౌరవించడం తెలియదన్నారు.  పదేళ్లుగా హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉందని, జూన్‌ 2న గడువు ముగిసిపోతుండటంతో మళ్లీ రాజధానిగా కొనసాగించేందుకు లోక్‌సభలో కొట్లాడాల్సిన అవసరముందని.. అందుకే 10-12 భారాస ఎంపీలను గెలిస్తేనే తెలంగాణకు న్యాయం జరుగుతుందన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, భారాస నాయకులు నారదాసు లక్ష్మణ్‌రావు, గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌, బండ శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు. హుజూరాబాద్‌ రోడ్‌షోలో కేటీఆర్‌ ప్రసంగిస్తుండగా పార్టీ శ్రేణులు జై తెలంగాణ.. జై కేసీఆర్‌.. జై కేటీఆర్‌ అంటూ నినాదాలు చేశారు.

ప్రజా స్పందనతో మాదే విజయం

భారాసకు వస్తున్న ప్రజా స్పందనతో తాను భారీ మెజారిటీతో గెలుస్తున్నట్లు ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ అయిదు నెలల పాలనలో కరెంటు కోతలు, సాగునీటి కొరత నెలకొందని, అందుకే ప్రజల్లో కేసీఆర్‌ మళ్లీ రావాలనే ఆకాంక్ష మొదలైందన్నారు. ఎంపీగా సంజయ్‌ పార్టీ సమావేశల్లోనే మోదీని కలిశారే తప్ప, అభివృద్ధికి నిధులివ్వాలని ఏనాడూ ఆయనను అడగకుండా ప్రజా సమస్యలను గాలికి వదిలేశారన్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ.. అభివృద్ధి మరింత జరగాలంటే వినోద్‌కుమార్‌ను గెలిపించాలన్నారు. ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, మేయర్‌ వై.సునీల్‌రావు, మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్‌ తుల ఉమ, పార్టీ జిల్లా, నగర అధ్యక్షులు జి.వి.రామకృష్ణారావు, చల్ల హరిశంకర్‌, రూప్‌సింగ్‌, కార్పొరేషన్ల మాజీ ఛైర్మన్లు రవీందర్‌సింగ్‌, శ్రీనివాస్‌, అక్బర్‌, నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని