logo

గరీబోళ్ల బిడ్డకు, గడీల వారసులకు పోటీ

గరీబోళ్ల బిడ్డకు, గడీల వారసులకు మధ్య పోటీ అని.. ఎటు వైపు ఉంటారో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ కోరారు.

Published : 28 Apr 2024 05:48 IST

భాజపా ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ 

మహిళలకు నమస్కరిస్తున్న ఎంపీ బండి సంజయ్‌

తెలంగాణచౌక్‌ (కరీంనగర్‌), న్యూస్‌టుడే: గరీబోళ్ల బిడ్డకు, గడీల వారసులకు మధ్య పోటీ అని.. ఎటు వైపు ఉంటారో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ కోరారు. శనివారం కరీంనగర్‌లో ఎస్సారార్‌ కళాశాల మైదానంలో వాకర్స్‌ను కలిసి ప్రచారం చేశారు. కాసేపు యువకులతో క్రికెట్‌, వాలీబాల్‌ ఆడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘భాజపా, భారాస కలిసి పోతాయని చెప్పడం కాంగ్రెస్‌ ఆడుతున్న రాజకీయ డ్రామా. ఆ పార్టీని ఎవరూ నమ్మడం లేదు. కేసీఆర్‌ సర్కార్‌ ప్రజలను ఎన్ని ఇబ్బందులు పెట్టిందో కళ్లారా చూశాం. అందుకే ఓడించాం. అలాంటి పార్టీతో కలిసే కర్మ భాజపాకు లేదు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.400 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చి గాలికి వదిలేశారు. కనీసం ప్రసాదం పథకం కింద నిధులు తీసుకొస్తా ప్రతిపాదనలు పంపండి అని చెబితే కేసీఆర్‌ సర్కార్‌ పట్టించుకోలేదు. నన్ను ఎంపీగా గెలిపిస్తే కరీంనగర్‌ నియోజకవర్గానికి రూ.12 వేల కోట్ల నిధులు తీసుకొచ్చా, స్వయంగా ప్రధాని చేతుల మీదుగా జాతీయ రహదారుల విస్తరణ పనులకు శ్రీకారం చుట్టడంతోపాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. కాంగ్రెస్‌, భారాస అభ్యర్థులు ఒక్కటై నన్ను ఓడించేందుకు కుట్ర చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఓ వర్గం ఓట్ల కోసమే పాకులాడుతోంది. కాంగ్రెస్‌ పార్టీ ముస్లింల పార్టీ అని వారి ఓట్లతోనే అధికారంలోకి వస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు బహిరంగంగా ప్రకటనలు ఇస్తున్నారంటే అర్థం చేసుకోవాలి.’’ అని అన్నారు. మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణగౌడ్‌ సోదరుడు మహేందర్‌గౌడ్‌, ఇతరులు ఎంపీ కార్యాలయంలో సంజయ్‌ సమక్షంలో భాజపాలో చేరారు. వారికి ఆయన కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, మాజీ డిప్యూటీ మేయర్‌ గుగ్గిళపు రమేశ్‌, మాజీ ఎంపీపీ వాసాల రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు