logo

అస్త్రశస్త్రాలతో ప్రచారానికి సిద్ధం

నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు జోరు పెంచారు.. ఓటర్ల మన్ననలు పొందేందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించుకుని ప్రచారంలో దూసుకెళ్తున్నారు.

Published : 28 Apr 2024 05:52 IST

ప్రణాళికలు రూపొందించుకున్న పార్టీలు

ఈనాడు, కరీంనగర్‌ : నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు జోరు పెంచారు.. ఓటర్ల మన్ననలు పొందేందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించుకుని ప్రచారంలో దూసుకెళ్తున్నారు.. పార్టీని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు అవసరమైన అస్త్రశస్త్రాలను సంధిస్తున్నారు.. కొన్ని రోజులే సమయం ఉండటంతో వీలైనన్ని ఎక్కువ కార్యక్రమాలు, ఇంటింటి ప్రచారాలు, సభలు, సమావేశాలతో క్యాడర్‌లో జోష్‌ పెంచడంతోపాటు ఓటర్లలో తమ ముద్ర వేయడంపై దృష్టి పెడుతున్నారు..


ఇంటింటి ప్రచారాలతో భాజపా

పోలింగ్‌ బూత్‌ల వారీగా ఉన్న శక్తి కేంద్రాల బాధ్యులతో భాజపా ముఖ్య నాయకులు ప్రతి నిత్యం ఫోన్‌ కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ క్షేత్రస్థాయి పరిస్థితిని అంచనా వేస్తున్నారు. కరీంనగర్‌, పెద్దపల్లి, నిజామాబాద్‌లలో ఇప్పటికే ఈ కేంద్రాల బాధ్యులతో పలుమార్లు సమన్వయ సమావేశాలు నిర్వహించారు. ప్రతి 50 మంది ఓటర్లను కలిసి వారికి కరపత్రాలను ఏక కాలంలో అందించే కార్యాచరణను కరీంనగర్‌లో అమలు చేశారు. పెద్దపల్లిలో మండలాల వారీగా పార్టీ అధ్యక్షులు ముఖ్య నేతల సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో అభ్యర్థి పాల్గొనే ప్రచార షెడ్యూల్‌ను మూడు స్థానాల పరిధిలో ఖరారు చేశారు. యువ మోర్చా, మహిళా మోర్చా, ఎస్సీ, ఎస్టీ, కిసాన్‌ మోర్చాలకు ఆయా నియోజకవర్గాల వారీగా సమావేశాల బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు ముందే ప్రధాని మోదీ జగిత్యాల బహిరంగ సభలో పాల్గొని ప్రచార శంఖం పూరించారు.. కరీంనగర్‌లో సంజయ్‌ నామినేషన్‌కు గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్రభాయి పటేల్‌, నిజామాబాద్‌లో అర్వింద్‌ నామపత్రాల దాఖలుకు ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామీ హాజరయ్యారు. మే నెలలో కేంద్ర మంత్రుల పర్యటనలు ఏర్పాటు చేసేలా ప్రణాళికలను పార్టీ జాతీయ నాయకత్వానికి పంపించారు. కరీంనగర్‌, పెద్దపల్లిల్లో మోదీ లేదా అమిత్‌షా బహిరంగ సభల నిర్వహిస్తే మేలనే భావనతో అభ్యర్థులున్నారు.


రోడ్‌ షోలు.. భారీ సభలు

కాంగ్రెస్‌ పార్టీ రోడ్‌ షోలు, కార్నర్‌ సమావేశాలతోపాటు సీఎం రేవంత్‌ సభలతో ప్రచారంలో దూసుకెళ్లడంపై దృష్టి పెట్టింది. కరీంనగర్‌ స్థానంలో అభ్యర్థి ఖరారు ఆలస్యం కావడంతో కాంగ్రెస్‌ పార్టీ అన్ని మండల కేంద్రాల్లో రోడ్‌ షోలు లేదా జన సమీకరణతో కార్నర్‌ సమావేశాల్ని నిర్వహించేందుకు షెడ్యూల్‌ను ఖరారు చేసింది. రోజుకు నాలుగు మండలాల్లో పర్యటనలకు ప్రణాళికలు రూపొందించుకున్నారు. పెద్దపల్లిలో ఇప్పటికే నియోజకవర్గ కేంద్రాల్లో సమావేశాల్ని ఏర్పాటు చేయగా.. త్వరలో మహిళలు, యువతతో ప్రత్యేక భేటీలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఇంటింటి ప్రచార బాధ్యతల్ని ఎక్కడికక్కడే మండలాల నాయకులకు అప్పగిస్తున్నారు. మ్యానిఫెస్టోపై రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేయిస్తున్నారు. ఈ నెల 22న నిజామాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డికి మద్దతుగా సభలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 30, మే 1, 3వ తేదీల్లో ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. 30న జమ్మికుంటలో కరీంనగర్‌ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు మద్దతుగా నిర్వహించే సభకు, మే 1న నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధి కోరుట్లలో, మే 3న పెద్దపల్లి లోక్‌సభ స్థానం పరిధి ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా నిర్వహించే సభల్లో ఆయన పాల్గొననున్నారు. ఏఐసీసీ నాయకులు, ఇతర ముఖ్య నేతలను ప్రచారానికి రప్పించనున్నారు.


కేసీఆర్‌ బస్సు యాత్రపై ఆశలు

కేసీఆర్‌ బస్సు యాత్రతోపాటు కేటీఆర్‌, హరీశ్‌ల రోడ్‌షోలపై భారాస అభ్యర్థులు గంపెడాశలు పెట్టుకున్నారు. ఓటర్లను తమ వైపునకు తిప్పుకోవడానికి కేసీఆర్‌ పర్యటన కీలకమని ఈ పార్టీ అభ్యర్థులు భావిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మే 2న కరీంనగర్‌ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ మద్దతుగా జమ్మికుంటలో రోడ్‌షో నిర్వహించనున్నారు. 3వ తేదీన రామగుండంలో రోడ్‌ షో నిర్వహించి పెద్దపల్లి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు గెలిపించమని కోరనున్నారు. 5వ తేదీన జగిత్యాలలో రోడ్‌షో నిర్వహించి నిజామాబాద్‌ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌కు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. సాయంత్రం 6 గంటల సమయంలో ఈ రోడ్‌షోలుంటాయి. మాజీ మంత్రి కేటీఆర్‌, హరీశ్‌రావుల రోడ్‌షోలను ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో మూడు చోట్ల నిర్వహించడానికి ఆ పార్టీ నేతలు ప్రణాళికలు రూపొందించారు. ఆయా లోక్‌సభ స్థానాలకు కన్వీనర్‌లుగా ఉన్న నాయకుల లోటుపాట్లు గమనిస్తూ పార్టీ కార్యక్రమాల తీరుపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు