logo

రాష్ట్రానికి గులాబీ జెండా అవసరం

గ్రామాలు మొదలుకొని పట్టణాల వరకు భారాసకు ఉన్న శక్తి, క్యాడర్‌ ఏ జాతీయ పార్టీకి లేదని, ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి గులాబీ జెండా అవసరమని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌ కుమార్‌ పేర్కొన్నారు.

Published : 29 Apr 2024 02:23 IST

మాట్లాడుతున్న భారాస ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్‌, చిత్రంలో కేటీఆర్‌ తదితరులు

వేములవాడ, న్యూస్‌టుడే: గ్రామాలు మొదలుకొని పట్టణాల వరకు భారాసకు ఉన్న శక్తి, క్యాడర్‌ ఏ జాతీయ పార్టీకి లేదని, ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి గులాబీ జెండా అవసరమని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఆదివారం వేములవాడ పట్టణంలో జరిగిన నియోజకవర్గం బూత్‌ కమిటీల సమావేశానికి భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో కలిసి హాజరైన ఆయన మాట్లాడుతూ కేవలం 1.8 శాతం ఓట్ల తేడాతో మాత్రమే అధికారం కోల్పోయామన్నారు. మనం కోల్పోయింది అధికారం కాదని, ప్రజా సేవ చేసే అవకాశాన్ని అని చెప్పారు. ఓట్ల కోసం గోదావరి జలాలను తమిళనాడుకు తరలించే కుట్ర జరుగుతోందని, దీన్ని అడ్డుకునే శక్తి కేవలం భారాసకు మాత్రమే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ రోజుల్లో అయిదుగురు ఎంపీలు గెలిస్తే చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డిలు అవహేళనగా మాట్లాడారని గుర్తు చేశారు. స్వరాష్ట్ర సాధనలో అయిదుగురు ఎంపీలుగా ఉన్న తాము 32 రాజకీయ పార్టీల దగ్గరకు వెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో కష్ట పడితే విజయం మనదేనని, ప్రతి నాయకుడు, కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్‌ఛార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు, జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ మాధవి, జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్‌ తుల ఉమ, పార్టీ జిల్లా ఎన్నికల ఇన్‌ఛార్జి ప్రవీణ్‌కుమార్‌లు ప్రసంగించారు. కార్యక్రమంలో కరీంనగర్‌ మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌, మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ మనోహర్‌రెడ్డి, జగిత్యాల జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ హరిచరణ్‌రావు,  సెస్‌ వైస్‌ ఛైర్మన్‌ తిరుపతి, పార్టీ అధ్యక్షులు గోస్కుల రవి, దేవయ్య, మేకల ఎల్లయ్య, సత్తిరెడ్డి, క్రాంతికుమార్‌, ఎంపీపీలు వజ్రమ్మ, స్వరూప, రేణుక, చంద్రయ్యగౌడ్‌, జడ్పీటీసీ సభ్యులు మ్యాకల రవి, నాగం భూమయ్య, సెస్‌ డైరెక్టర్లు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని