logo

ఏసీబీకి చిక్కిన హెడ్‌కానిస్టేబుల్‌

జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌కు చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ సామల్ల మనోహర్‌ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

Published : 30 Apr 2024 02:07 IST

మనోహర్‌

జగిత్యాల, న్యూస్‌టుడే: జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌కు చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ సామల్ల మనోహర్‌ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. జగిత్యాల డివిజన్‌ వారెంట్‌ పార్టీ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న మనోహర్‌ జగిత్యాల మండలం పెరకపల్లి గ్రామానికి చెందిన కట్కం గంగాధర్‌ నుంచి సోమవారం సాయంత్రం జగిత్యాల రాజీవ్‌ చౌరస్తాలో రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా కరీంనగర్‌ నుంచి వచ్చిన ఏసీబీ డీఎస్పీ వి.వి.రమణమూర్తి, సీఐలు తిరుపతి, కృష్ణకుమార్‌ పట్టుకున్నారు. గంగాధర్‌ అల్లుడు బాలె తిరుపతి ఓ కేసులో అరెస్టయి బెయిల్‌ పొంది 4 నెలల క్రితం దుబాయ్‌ వెళ్లాడు. కోర్టుకు హాజరు కాకపోవడంతో అతనిపై వారెంట్‌ జారీ అయింది. వారెంట్‌ అమలు కాకుండా ఉండేందుకు డబ్బులు డిమాండ్‌ చేయడంతో దుబాయ్‌లో ఉన్న తిరుపతి హెడ్‌కానిస్టేబుల్‌ మనోహర్‌కు ఈనెల 16న రూ.4 వేలు ఫోన్‌పే చేశాడు. అయినప్పటికీ మరో రూ.5 వేలు కావాలని డిమాండ్‌ చేయడంతో తిరుపతి ఏసీబీ డీజీ సి.వి.ఆనంద్‌కు మెయిల్‌ చేయగా డీజీ ఆదేశం మేరకు ఏసీబీ అధికారులు జగిత్యాలకు వచ్చి తిరుపతి మామ గంగాధర్‌ నుంచి రూ.5 వేలు తీసుకుంటుండగా పట్టుకున్నారు. హెడ్‌కానిస్టేబుల్‌ మనోహర్‌ను కరీంనగర్‌ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరుస్తామని డీఎస్పీ రమణమూర్తి చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని