logo

రూ.121.90 కోట్లతో జిల్లా న్యాయ భవనం సిద్ధం

బళ్లారి నగరం తాళూరు రహదారిలోని విశాలమైన ప్రదేశంలో జిల్లా న్యాయస్థానం నూతన భవనం సిద్ధమైంది. ఈ నెల 26న ముఖ్యమంత్రితో పాటు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించనున్నారు. ప్రస్తుతం బళ్లారి నగర నడిబొడ్డున కోర్టు భవనం నిర్వహిస్తున్నారు. సమీపంలో రైల్వేట్రాక్‌తో పాటు, భవనం ఇరుకుగా ఉంది.

Published : 24 Jun 2022 01:56 IST

మొత్తం 20 న్యాయస్థానాలు 

26న సీఎం, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేతులమీదుగా ప్రారంభం

నూతనంగా నిర్మించిన జిల్లా న్యాయస్థానం భవనం

బళ్లారి, న్యూస్‌టుడే: బళ్లారి నగరం తాళూరు రహదారిలోని విశాలమైన ప్రదేశంలో జిల్లా న్యాయస్థానం నూతన భవనం సిద్ధమైంది. ఈ నెల 26న ముఖ్యమంత్రితో పాటు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించనున్నారు. ప్రస్తుతం బళ్లారి నగర నడిబొడ్డున కోర్టు భవనం నిర్వహిస్తున్నారు. సమీపంలో రైల్వేట్రాక్‌తో పాటు, భవనం ఇరుకుగా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని 2017 నవంబరు 21న తాళూరు రహదారిలోని న్యాయమూర్తుల వసతి గృహాల సమీపంలో విశాలమైన ప్రదేశంలో జిల్లా న్యాయస్థానం భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ప్రస్తుతం న్యాయస్థానం పనులు పూర్తయినా..లోపల చిన్న చిన్న పనులు మాత్రమే మిగిలాయి. జిల్లా న్యాయస్థానం భవనం మొత్తం రూ.121.90 కోట్లతో మొత్తం ఆరు అంతస్తులు ఉండగా, వాటిలో మొదటి అంతస్తు నుంచి ఐదు అంతస్తుల వరకు కోర్టు హాల్‌ను సిద్ధం చేశారు. ఒక్కొక్క అంతస్తులో నాలుగు కోర్టులు చొప్పన మొత్తం 20 న్యాయస్థానాలు, న్యాయమూర్తులు సమావేశం నిర్వహించే సభాభవనాలు, సాక్షులు, న్యాయవాదులు, సిబ్బంది కూర్చోవడానికి ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు. కోర్టుకు తీసుకొని వచ్చిన ఖైదీలను భద్రంగా ఉంచడానికి ప్రత్యేక గదులనూ నిర్మించారు. కోర్టు దిగువన ఉన్న భవనంలో రికార్డులు, తదితర పత్రాలను భద్రపరచడానికి స్ట్రాంగ్‌ రూం ఏర్పాటు చేశారు. కోర్టు హాల్‌కు సమీపంలోని న్యాయమూర్తులకు గ్రంథాలయాలను నిర్మించారు. న్యాయస్థానంలో ఐదు లిఫ్ట్‌లను పెట్టారు. ఒక లిఫ్ట్‌ న్యాయమూర్తులు, రెండు కోర్టు సిబ్బంది, న్యాయవాదులకు మరో రెండు లిఫ్ట్‌లు సాక్షులు, ఖైదీలను తీసుకొని వెళ్లడానికి ప్రత్యేకంగా సిద్ధం చేశారు. న్యాయమూర్తులు మధ్యాహ్నం సమయంలో భోజనం చేసి, కొద్దిసేపు విశ్రాంతి తీసుకొనేలా ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు. కోర్టులో సెంట్రల్‌ ఏసీని ఏర్పాటు చేశారు. కోర్టులో వీడియో కాన్ఫరెన్స్‌హాల్‌, అగ్నిప్రమాదాలు నివారణకు ప్రత్యేకంగా పరికరాలను అమర్చారు. ఇ-సేవ కేంద్రం, హెల్ప్‌డెస్క్‌, న్యాయసేవా కేంద్రం, మరుగుదొడ్లు, తదితర సౌకర్యాలు కల్పించారు. కోర్టు ముందు విశాలమైన ఉద్యానవనం, అధికారులు, సిబ్బంది, న్యాయవాదులు, తదితరులకు వేర్వేరుగా పార్కింగ్‌ స్థలాలను సిద్ధం చేశారు. జిల్లా న్యాయస్థానం సమీపంలోని జిల్లా న్యాయవాదుల భవనం కూడా సిద్ధమవుతోంది. అక్కడే న్యాయవాదులకు గ్రంథాలయం, క్యాంటీన్‌, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు.
ప్రముఖులతో శ్రీకారం
నూతనంగా నిర్మించిన జిల్లా న్యాయస్థానం భవనాన్ని ఈ నెల 26న ఉదయం 11గంటలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రితురాజ్‌ అవస్థి, ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా న్యాయస్థానం పరిపాలనాధికారి ఆర్‌.దేవదాస్‌, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.నటరాజన్‌, రాష్ట్ర న్యాయశాఖ మంత్రి జె.సి.మధుస్వామి, మంత్రి సి.సి.పాటిల్‌, హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ టి.జి.శివశంకరగౌడ ప్రారంభిస్తారు. ప్రజాపనుల శాఖ అదనపు కార్యదర్శి బి.హెచ్‌.అనిల్‌కుమార్‌, రాష్ట్ట్ర న్యాయవాదుల పరిషత్‌ సభ్యులు కె.కోటేశ్వరరావు, అనిల్‌కుమార్‌, జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.ఎర్రిగౌడ, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.హెచ్‌.పుష్పాంజలిదేవి, అసోసియేషన్‌ సభ్యులు నాగరాజ్‌ నాయక, రవీంద్రనాథ్‌, త్రివేణి,  ప్రజాపనుల శాఖ ప్రాదేశిక ఇంజినీర్‌ ఎస్‌.హెచ్‌.పూజారి పాల్గొంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని