logo

‘పడమటి’ గాలి ఎటు వీచేనో!

చిక్కమగళూరు.. కాఫీ తోటల ఘుమఘుమలు, సెలయేటి పరవళ్లు, పడమటి కనుమల నిండుదనంతో తులతూగే ప్రాంతం. ఉడుపి..

Published : 15 Apr 2024 02:44 IST

కీలక నియోజకవర్గంలో ఆసక్తికర రాజకీయాలు

జయప్రకాశ్‌హెగ్డే (కాంగ్రెస్‌), కోటా శ్రీనివాస్‌పూజారి (భాజపా)

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : చిక్కమగళూరు.. కాఫీ తోటల ఘుమఘుమలు, సెలయేటి పరవళ్లు, పడమటి కనుమల నిండుదనంతో తులతూగే ప్రాంతం. ఉడుపి.. పేరుచెబుతూనే పరమానంద లయుడు చిన్నికృష్ణుడి ఆలయం, మాల్పే వద్ద సముద్రతీరం, కుందాపుర సమీప చేపల వేట, మణిపాల్‌ విద్యాలయాలు.. ఇలా ఎన్నెన్నో కళ్లముందు కదలాడతాయి. ఈ రెండు నగరాల సమాహారంగా రూపుదాల్చిందే ఉడుపి- చిక్కమగళూరు లోక్‌సభ నియోజకవర్గం! పడమటి కనుమలకు అటు.. ఇటుగా విస్తరించిన విధానసభ సెగ్మెంట్ల సమాహారమిదీ. ఒకప్పటి కాంగ్రెస్‌ అధినాయకురాలు ఇందిరాగాంధీకి రాజకీయ జీవనాన్ని పునరుజ్జీవింప చేసిన గడ్డ ఇదే. జాతీయ స్థాయిలో నేటికీ చక్కని గుర్తింపునకు ఆమె ఇక్కడ విజయం సాధించడమే కారణంగా చెప్పవచ్చు. దేశంలో అత్యయిక పరిస్థితుల అనంతరం ఆమె చిక్కమగళూరు లోక్‌సభ నియోజకవర్గంలో పోటీ చేసి విజయం సాధించడం ఓ చరిత్ర. ప్రస్తుతం రాజకీయాలు మారాయి. స్థానిక నేతలు ఇక్కడి బరిలో నువ్వా-నేనా అంటూ సత్తా చాటుతున్నారు. విధానపరిషత్తులో ప్రతిపక్ష నేత కోటాశ్రీనివాస్‌ పూజారి (భాజపా)- రాష్ట్ర వెనకబడిన వర్గాల కమిషన్‌ మాజీ అధ్యక్షుడు జయప్రకాశ్‌ హెగ్డే (కాంగ్రెస్‌) పోటీ పడుతున్నారు. నిజానికిది ఒకప్పుడు కాంగ్రెస్‌ కంచుకోట.. ప్రస్తుతం భాజపాకు బలమైన క్షేత్రం. మరోసారి పూర్వవైభవం సాధించేందుకు కాంగ్రెస్‌ నేతలు శ్రమటోడుస్తున్నారు. ఇక్కడ గడచిన రెండు ఎన్నికల్లో నెగ్గిన శోభాకరంద్లాజె మరోసారి పోటీ చేసేందుకు విఫలయత్నం చేశారు. స్థానిక భాజపా కార్యకర్తల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ‘గోబ్యాక్‌ శోభాకరంద్లాజె..’ అనే ఉద్యమాన్ని చేపట్టడంతో అధిష్ఠానం ఆమెను ఇక్కడి నుంచి తప్పించి ‘బెంగళూరు ఉత్తర’కు పంపారు. అందివచ్చిన అవకాశం కోసం ఇక్కడి నేతలు సీటీ రవి, తేజస్విని గౌడ ప్రయత్నించి భంగపడ్డారు. విధానపరిషత్‌లో విపక్ష నేత పూజారికి కమలనాథులు టికెట్‌ ప్రకటించారు. ఆయనకు హిందీ, ఆంగ్లం రాకపోవడంపై కాంగ్రెస్‌ గట్టిగా ప్రచారం చేస్తోంది. ఆ కీలక భాషలు రాని పూజారి లోక్‌సభలో ప్రవేశించి ఏమి చేస్తారని కాంగ్రెస్‌ అభ్యర్థి జయప్రకాశ్‌ హెగ్డే బహిరంగ సభల్లో ప్రశ్నిస్తున్నారు. ‘గెలిచిన తరువాత నేర్చుకుంటా’నని శ్రీనివాస్‌పూజారి బదులివ్వడం ప్రస్తావనార్హం. ఇక్కడ 2009లో జరిగిన ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా సదానందగౌడ గెలిచారు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి.. లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశారు. 2011లో వచ్చిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి జయప్రకాశ్‌హెగ్డే విజయం సాధించారు. 2014, 2019లో శోభా నెగ్గడం ప్రస్తావనార్హం. ఆమె కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రిగా బాధ్యతలు నిర్వహించినా.. స్థానికంగా వ్యతిరేకత మూటగట్టుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌, భాజపా మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని