logo

గ్యారంటీలతో ప్రజలకు ఊతం

బెంగళూరు ఉత్తర లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి ఆచార్య రాజీవ్‌గౌడకు మద్దతుగా ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ సోమవారం దాసరహళ్లిలో  రోడ్‌షో నిర్వహించి, ఓట్లు అభ్యర్థించారు.

Published : 23 Apr 2024 02:10 IST

 దాసరహళ్లిలో రోడ్డుషో నిర్వహిస్తున్న ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి ఆచార్య రాజీవ్‌గౌడ తదితరులు

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : బెంగళూరు ఉత్తర లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి ఆచార్య రాజీవ్‌గౌడకు మద్దతుగా ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ సోమవారం దాసరహళ్లిలో  రోడ్‌షో నిర్వహించి, ఓట్లు అభ్యర్థించారు. రాజీవ్‌గౌడ నగరంలోనే పుట్టి పెరిగారని, ఆయన తాత దొడ్డప్ప పాడి పరిశ్రమ, పట్టు పెంపకం తదితరాలను నగరానికి నేర్పారని వివరించారు. విధానసభ ఎన్నికల సమయంలో ప్రకటించిన ఐదు గ్యారంటీ పథకాలను పూర్తిస్థాయిలో అమలులోకి తెచ్చినట్లు వివరించారు. పది నెలల నుంచి గ్యారంటీ పథకాల ద్వారా అనేక మంది లబ్ధిపొందుతున్న విషయం గుర్తుచేశారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రతి పేద కుటుంబానికీ రూ.లక్ష అందజేస్తామని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ప్రకటించారని సంతోషం వ్యక్తం చేశారు. కొత్తగా 25 గ్యారంటీ పథకాలు అమలులోకి తెస్తామన్నారు. అభ్యర్థి ఆచార్య రాజీవ్‌గౌడతో పాటు మాజీ శాసనసభ్యుడు మంజునాథ్‌, డీసీసీ అధ్యక్షుడు అబ్దుల్‌ వాజిద్‌, కాంగ్రెస్‌ నేత అక్క పద్మసాలి తదితరులు పాల్గొన్నారు.

పనిచేసే వారికే జనం పట్టం

 బెంగళూరు (యశ్వంతపుర): బెంగళూరు దక్షిణ లోక్‌సభ నియోజకవర్గంలో భాజపా అభ్యర్థి తేజస్విసూర్య గత ఎన్నికల్లో గెలిచినా ప్రజలకు అందుబాటులో లేరని, అలాంటి వ్యక్తిని ఇంటికి పంపించాలని చిక్కబళ్లాపుర శాసనసభ్యుడు ప్రదీప్‌ఈశ్వర్‌ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థి సౌమ్యారెడ్డికి మద్దతుగా ఆయన సోమవారం చిక్కపేట, జయనగర తదితర ప్రాంతాల్లో రోడ్‌షో నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రజాప్రతినిధులుగా సామాన్యులకు అందుబాటులో ఉండని వ్యక్తులను ఓడించాలని స్పష్టం చేశారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యలకు స్పందించే వారికే పట్టం కట్టాలన్నారు. ఆ వరుసలో ముందుండే సౌమ్యారెడ్డిని గెలిపిస్తే నగరంలో తొలి మహిళ ఎంపీ అవుతుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేతలు నాగరాజు, రిజ్వాన్‌ హర్షద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని