logo

రైతన్నకు కరవు సాయం

తీవ్ర కరవు బారినపడిన తమ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం వివక్షతో నిధుల విడుదలను జాప్యం చేస్తోందంటూ సుప్రీంకోర్టులో కర్ణాటక దాఖలు చేసిన పిటిషన్‌ సోమవారం కీలక మలుపు తిరిగింది.

Updated : 23 Apr 2024 06:43 IST

అందుకు ఈసీ అనుమతించింది

సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం

 

దిల్లీ : తీవ్ర కరవు బారినపడిన తమ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం వివక్షతో నిధుల విడుదలను జాప్యం చేస్తోందంటూ సుప్రీంకోర్టులో కర్ణాటక దాఖలు చేసిన పిటిషన్‌ సోమవారం కీలక మలుపు తిరిగింది. ఈ అంశంలో చర్యలు తీసుకునేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) అనుమతించిందని జస్టిస్‌ బి.ఆర్‌.గవాయి, జస్టిస్‌ సందీప్‌ మెహతా ధర్మాసనానికి కేంద్రం తరఫున అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి తెలిపారు. అందువల్ల వేగంగానే ఆ ప్రక్రియ పూర్తికావచ్చన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కనుక ఈ పిటిషన్‌పై విచారణను వచ్చే వారానికి వాయిదా వేయాలని సూచించారు. అందుకు సమ్మతించిన ధర్మాసనం...‘మనది సమాఖ్య వ్యవస్థ. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవడమే సముచితమ’ని వ్యాఖ్యానించింది. కర్ణాటక ప్రభుత్వ పిటిషన్‌పై ఈ నెల 8న విచారణ సందర్భంగా....‘కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంఘర్షణ వాతావరణం తగద’ని ధర్మాసనం హితవు పలికింది. వెంటనే స్పందించిన అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి, సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా....ఈ అంశంపై కేంద్రం నుంచి తగిన సూచనలు తీసుకుంటామని అప్పుడు విన్నవించారు.

 కరవు కోరల్లో చిక్కిన తమ రాష్ట్రానికి జాతీయ విపత్తు సహాయ నిధి (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) కింద ఆర్థిక సాయం అందించకపోవడం రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉల్లంఘించడమేనని కర్ణాటక ప్రభుత్వం తన పిటిషన్‌లో పేర్కొంది. కేంద్రం నుంచి రూ.18,171.44 కోట్ల నిధులు రావాల్సి ఉందని, తక్షణమే విడుదలకు ఆదేశించాలని విన్నవించింది. నిధుల కొరత వల్ల రైతులకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టలేకపోతున్నామని వివరించింది.

రైతుల విజయం..

కరవు సహాయక నిధుల విషయమై చర్యలకు ఎన్నికల సంఘం అనుమతించిందని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలియజేయడాన్ని కర్ణాటక రైతులు, ఆ రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయంగా కాంగ్రెస్‌ పార్టీ అభివర్ణించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటక ప్రజలు భాజపాను తిరస్కరించారనే అక్కసుతోనే ప్రధాని మోదీ ప్రభుత్వం ఆ రాష్ట్రంపై వివక్ష ప్రదర్శిస్తోందని కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ విమర్శించారు. తొలుత ఆహార భద్రత పథకం ‘అన్న భాగ్య’ను అడ్డుకునేందుకు ప్రయత్నించారన్నారు. ఆ తర్వాత చట్టబద్ధంగా విడుదల చేయాల్సిన కరవు సహాయక నిధులను ఉద్దేశపూర్వకంగానే నిలిపివేశారని ధ్వజమెత్తారు. ఆ రాష్ట్రంలో మొత్తం 236 తాలూకాలకు గాను 223 తాలూకాలు తీవ్ర కరవు బారినపడ్డాయని తెలిపారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం వల్లే కేంద్రం అఫిడవిట్‌ దాఖలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.


ఇది.. కాంగ్రెస్‌ విజయం

ఈనాడు, బెంగళూరు : కేంద్రంపై కరవు కోసం పోరుబాట పట్టిన కాంగ్రెస్‌ సర్కారు ఎట్టకేలకు విజయం సాధించింది. ఈ గెలుపు కేవలం రాష్ట్రానికే కాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థలోని సమాఖ్య విధానం, కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని ప్రశ్నించిన రాష్ట్రాలకు దక్కిన విజయంగా అభివర్ణించాలని రాజకీయ, ఆర్థిక రంగాలకు చెందిన విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సోమవారం కర్ణాటక సర్కారు కేంద్రంపై వేసిన పిటిషన్‌ను పరిశీలించిన సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం కన్నడిగులకు కొండంత ఊరట కలిగినట్లే. ఎన్నికల సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొనసాగిన మాటల యుద్ధానికి ఈ ఆదేశం ముగింపు పలికినట్లే.

నేపథ్యం ఇదిగో..

రాష్ట్రంలో గతేడాది నెలకొన్న కరవు కారణంగా 48 లక్షల హెక్టార్ల పంట భూమి నష్టపోగా 263 తాలూకాలు కరవు ప్రాంతాలుగా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ అంచనా ప్రకారం 122 ఏళ్ల తర్వాత ఇలాంటి కరవు సంభవించగా ఈ నష్టం రూ.36,162 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేసింది. ఈ నష్ట నివారణలో భాగంగా కేంద్ర సర్కారు రూ.18,171,44 కోట్లను ఎన్‌డీఆర్‌ఎఫ్‌ మార్గదర్శకాల ప్రకారం ఇవ్వాలని కేంద్రానికి మనవి చేసింది. ఇందులో రూ.4,663.13 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ, రూ.12,577 కోట్ల బాధిత కుటుంబాల పరిహారం, తాగునీటి అవసరాలకు రూ.566 కోట్లు, రూ.363 కోట్ల పశువుల సంరక్షణ నిధులున్నాయి. కేంద్రానికి పలుమార్లు మనవి చేసినా స్పందన లేదన్న కారణంగా రాష్ట్ర ప్రభుత్వం గత మార్చిలో సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. ప్రకృతి విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం సుప్రీంకోర్టు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరింది. పిటిషన్‌పై ఈనెల 8న విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర, రాష్ట్రాల వాదనలను ఆలకించింది. చివరిగా కరవు సమస్యను కేంద్ర, రాష్ట్రాల మధ్య వైరంగా మార్చుకోరాదని హితవు పలికింది.

రాజకీయ దుమారం

రాష్ట్ర సర్కారు పదేపదే ఈ వ్యవహారంపై కేంద్రాన్ని తప్పుబడుతూ వచ్చింది. రాష్ట్రమంత్రులంతా దిల్లీ వెళ్లి ఆందోళన చేసిన సందర్భంగా కరవు విషయాన్ని ప్రస్తావించింది. సామాజిక మాధ్యమాల్లో కేంద్రానికి సమర్పించిన నివేదికలు, కేంద్ర మంత్రులను భేటీ చేసిన సందర్భాల చిత్రాలను కూడా పోస్టు చేసి ఆరోపించింది. కేంద్రంపై పదే పదే ఆరోపణ చేస్తున్న రాష్ట్రాన్ని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఇటీవల తప్పుబట్టారు. రాష్ట్రం కరవు నివేదికలను సకాలంలో కేంద్రానికి సమర్పించలేదని వీరు ఆరోపించారు.

ఇదో మైలురాయి..

రాష్ట్ర ప్రజలు, రైతుల సమస్యల కోసం తాము చేసిన న్యాయపోరాటంలో ఈ విజయం ఓ మైలురాయని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. ఆయన ఎక్స్‌లో వ్యాఖ్యానిస్తూ.. వారం రోజుల్లో రైతుల సమస్యలు పరిష్కరించే చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు సూచించింది. ప్రజల కోసం చేసిన సుదీర్ఘ పోరాటంలో రాష్ట్రం విజయం సాధించాం. ఐదు నెలలుగా కేంద్రం చూపిన నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ కోర్టు మెట్లెక్కే అనివార్యత ఏర్పడిందన్నారు. ఎట్టకేలకు కేంద్రంపై మేము సాధించిన మొదటి విజయమిదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని