logo

ఇక..ఉత్తర దిగ్విజయయాత్ర!

కర్ణాటక దక్షిణ, పాతమైసూరు, కరావళి ప్రాంతాల్లో తొలివిడత ఎన్నికలను విజయవంతంగా ముగించిన పార్టీలు.. రెండో విడతపై దృష్టి సారించాయి.

Published : 28 Apr 2024 04:58 IST

నేటి నుంచి దిగ్గజాల ప్రచార భేరీ

నరేంద్రమోదీ, రాహుల్‌గాంధీ

ఈనాడు, బెంగళూరు : కర్ణాటక దక్షిణ, పాతమైసూరు, కరావళి ప్రాంతాల్లో తొలివిడత ఎన్నికలను విజయవంతంగా ముగించిన పార్టీలు.. రెండో విడతపై దృష్టి సారించాయి. పార్టీల పథాధికారులు, కార్యాధ్యక్షులు, సమన్వయకర్తలంతా తమ కార్యాలయాలను రాష్ట్ర ‘ఉత్తర’ వలయానికి బదిలీ చేశారు. దక్షిణ ప్రాంతానికి భిన్నమైన వ్యూహాలను రచించిన పార్టీలు వాటిని అమలు చేసేందుకు శ్రేణులను సిద్ధం చేశాయి. మరోవైపు తొలివిడత పోలింగ్‌ను దాదాపు ప్రశాంతంగా ముగించిన ఎన్నికల సంఘం మలివిడత కోసం సిబ్బందిని సమాయత్తం చేసింది. మరో పది రోజుల్లో నిర్వహించే రెండో విడత ఎన్నికల కోసం 14 స్థానాల అభ్యర్థులంతా జోరుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.

నేడు మోదీ రాక..

తొలివిడత ఎన్నికల్లో మూడుసార్లు రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండో విడత కోసం ఆదివారం ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఉత్తర ప్రాంతంలో ఇప్పటికే ఓసారి పర్యటించిన మోదీ.. తన రెండో పర్యటనలో భాగంగా రెండు రోజులు రాష్ట్రంలోనే ప్రచారం చేస్తారు. ఆదివారం ఉదయం బెళగావికి చేరుకుని, ఉత్తర కన్నడలోని శిరసి, దావణగెరె, కల్యాణ కర్ణాటకలోని హొసపేటెలో ప్రచారం చేస్తారు. ఆరోజున అక్కడే విడిది చేసి, సోమవారం బాగల్‌కోటెలో పర్యటిస్తారు. ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర కర్ణాటక ప్రాంతంలో సంచరిస్తూ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నిలువగా.. కీలక నేతలు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, యోగీ ఆదిత్యనాథ్‌ ప్రచారానికి వస్తారని తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో ఇక్కడి 14 నియోజకవర్గాలూ కొల్లగొట్టిన భాజపా.. ఈసారి అదే స్థాయి విజయం కోసం పరితపిస్తోంది. దక్షిణ ప్రాంతంలో జేడీఎస్‌తో పొత్తుతో అనుకున్న లక్ష్యాలను సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేస్తోంది. ఉత్తర ప్రాంతంలో కాంగ్రెస్‌తో దాదాపు ఒంటరి పోరు చేయాల్సిందే. ఇక్కడి 14 నియోజకవర్గాల్లో దావణగెరె, బీదర్‌, రాయచూరు తదితర స్థానాల్లో కాస్తో, కూస్తో కార్యకర్తలున్న జేడీఎస్‌కు మిగిలిన 11 స్థానాల్లో భాజపాకు నామమాత్రపు మద్దతు మాత్రమే ఇవ్వగలదు. తొలివిడత స్థానాల్లో జేడీఎస్‌ నేతలు హెచ్‌.డి.దేవేగౌడ, కుమారస్వామిలు విస్తృతంగా ప్రచారం చేసినా మలివిడత స్థానాల్లో ఏమేరకు ప్రచారం చేస్తారన్నది ఆసక్తికరం. తాను ఎన్‌డీఏ అభ్యర్థుల గెలుపునకు మరో వారం రోజుల పాటు ప్రచారం చేస్తానని ప్రకటించిన దేవేగౌడ సోమవారం నుంచి ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది.

పట్టువీడని కాంగ్రెస్‌

దక్షిణ, మధ్య కర్ణాటకలో జేడీఎస్‌ పొత్తుతో భాజపా కాస్త బలంగా కనిపించటంతో కాంగ్రెస్‌ అభ్యర్థులు గట్టిపోటీ ఎదుర్కొన్నారు. ఉత్తర ప్రాంతంలో భాజపాతో ప్రత్యక్షంగా పోటీ చేయాల్సి ఉండటంతో కాంగ్రెస్‌ ప్రచారాన్ని మరింత బలంగా చేయాలని చూస్తోంది. గత విధానసభ ఎన్నికల్లో భాజపాకు పట్టున్న బెళగావి, కలబురగి, కల్యాణ కర్ణాటక ప్రాంతాల్లో పాగా వేసిన కాంగ్రెస్‌ గత ఏడాదిలో ఇక్కడి భాజపా నేతలను తమవైపు తిప్పుకొంది. దావణగెరె, శివమొగ్గ, ధార్వాడల్లో భాజపా సీనియర్లు, మఠాధిపతుల వ్యతిరేకత నుంచి లబ్ధిపొందే ప్రయత్నం చేస్తోంది. కరవు పరిహారంపై తాము విజయం సాధించామన్న ధీమాతో ఉన్న కాంగ్రెస్‌.. రెండో విడతలో అదే అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని చూస్తోంది. భాజపా లేవనెత్తిన మతప్రాతిపదిక చర్చలు, ముస్లింల రిజర్వేషన్‌ అంశాలపై ఇప్పటికే ఆ పార్టీ జాతీయ నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ ప్రచారాల్లో విరుచుకుపడ్డారు. రెండో విడతలో వీరిద్దరూ మరో రెండు సార్లు ప్రచారానికి రానుండగా, సోనియాగాంధీ బళ్లారిలో ప్రచారానికి వస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మంత్రుల వారసులు, మహిళా అభ్యర్థులను ఎక్కువగా బరిలో దింపిన కాంగ్రెస్‌కు ఇక్కడ పార్టీ వనరులను మరింత సమర్థమంతంగా వినియోగించుకోవాలని చూస్తోంది.

హొసపేటెలో నరేంద్రమోదీ ప్రచారసభ కోసం సిద్ధమైన ప్రాంగణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని