logo

కరవు గాయానికి మందు!

కేంద్ర, రాష్ట్రాల మధ్య కరవు పరిహారం కోసం కొనసాగుతున్న పోరు కొలిక్కి వచ్చింది. గత శుక్రవారం కేంద్ర సర్కారు వారం రోజుల్లో ఈ పరిహారం చెల్లిస్తామని హామీ ఇస్తూ విచారణ వాయిదా చేయాలని కోరిన విషయం తెలిసిందే.

Published : 28 Apr 2024 05:01 IST

ఎట్టకేలకు పరిహారం విడుదల
కేంద్ర స్పందన స్వల్పమే: కాంగ్రెస్‌

ఈనాడు, బెంగళూరు : కేంద్ర, రాష్ట్రాల మధ్య కరవు పరిహారం కోసం కొనసాగుతున్న పోరు కొలిక్కి వచ్చింది. గత శుక్రవారం కేంద్ర సర్కారు వారం రోజుల్లో ఈ పరిహారం చెల్లిస్తామని హామీ ఇస్తూ విచారణ వాయిదా చేయాలని కోరిన విషయం తెలిసిందే. ఈ హామీ ప్రకారం శనివారం కేంద్ర ఆర్థికశాఖ రూ.3,454.22 కోట్లను ఖరీఫ్‌ కరవు పరిహారం కింద విడుదల చేస్తూ ప్రకటన జారీ చేసింది. కేంద్ర హోంశాఖ సిఫార్సు మేరకు రూ.3,498.82 కోట్లు చెల్లించాల్సి ఉండగా ఇప్పటికే ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులు రూ.44.60 కోట్లు రాష్ట్రం వద్ద ఉండటంతో వీటిని మినహాయిస్తూ కొత్త నిధులు విడుదల చేసింది. రాష్ట్ర సర్కారు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టి సమాఖ్య వ్యవస్థలో కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు సమన్వయంగా ఉండాలని సూచించింది. ఈ సూచనపై కేంద్రం తరఫున హాజరైన అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి ఈ పరిహారం కోసం ఎన్నికల సంఘానికి మనవి చేయగా అనుమతి లభించిందని కోర్టుకు వివరించారు. ఈ ప్రకారం కేంద్రం శనివారం తమిళనాడుతో పాటు కర్ణాటకకు పరిహారం విడుదల చేసింది.

కరవు పీడిత ప్రాంతాల్లో వివరాలు సేకరిస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చెలువరాయ స్వామి తదితరులు (పాతచిత్రం)

ఇది మా విజయం..

కేంద్ర సర్కారు విడుదల చేసిన పరిహారం కేవలం మా పోరాట ఫలితమేనని కాంగ్రెస్‌ ప్రకటించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శనివారం విలేకరులతో మాట్లాడుతూ కరవు పరిహారం మోదీ సాధనగా భాజపా ప్రచారం చేసుకోవడం సిగ్గుమాలిన చర్య అంటూ వ్యాఖ్యానించారు. ‘సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టిన తర్వాత కేంద్రం ఈ పరిహారాన్ని విడుదల చేసింది. దేశచరిత్రలో ఏ రాష్ట్రం పరిహారం కోసం కోర్టుల్లో ఫిర్యాదు చేయలేదు. ఇలాంటి సందర్భం దేశ సమైక్యతను దెబ్బతీస్తోందని సుప్రీంకోర్టు సూచించిన తర్వాతనే కేంద్రం పరిహారం చెల్లించింది. రాష్ట్రం కోరింది రూ.18,172 కోట్లు. కేంద్రం ఇచ్చింది రూ.3,454 కోట్లు మాత్రమే. ఇందులో మిగిలిన నిధులు ఎప్పుడు ఇస్తారో కూడా ప్రస్తావించలేదు. మిగిలిన నిధుల కోసం కోర్టులో పోరాటం చేస్తూనే ఉంటాం’అని ముఖ్యమంత్రి ప్రకటించారు. గత సెప్టెంబరు నుంచి కేంద్రంతో పరిహారం కోసం మనవి చేశామన్నారు. డిసెంబరులో ప్రధాని, అమిత్‌ షాలతో ప్రత్యేకంగా చర్చించామని వివరించారు. ఆ సందర్భంగా కేంద్ర హోంమంత్రి నేతృత్వంలో సమావేశం నిర్వహించి పరిహారం కోసం చర్చిస్తామని చెప్పారని గుర్తుచేశారు. రాష్ట్రానికి వచ్చిన హోం మంత్రి అమిత్‌ షా పరిహారం చెల్లించేందుకు ఎన్నికల సంఘం నిబంధనలు అడ్డుగా ఉన్నాయని వాపోయిన విషయాన్ని ఉటంకించారు. ఆర్థికమంత్రి కూడా.. సకాలంలో రాష్ట్రం నివేదికలు ఇవ్వలేదని బదులిచ్చారని తప్పుపట్టారు. వీరిద్దరి వ్యాఖ్యలు అవాస్తవాలని సుప్రీంకోర్టు గుర్తించినట్లు ముఖ్యమంత్రి విశ్లేషించారు. ఏడు నెలలు ఎదురుచూసినా ఫలితం లేకనే సుప్రీంకోర్టును ఆశ్రయించామన్నారు. ఇప్పుడు ఇచ్చిన ఈ పరిహారం ఏమాత్రం సరిపోదని తేల్చిచెప్పారు.

పోరాటం కొనసాగింపు..

ఏనుగుకు అరకొర మజ్జిగ ఇచ్చినట్లు రూ.3,454 కోట్లు ఇచ్చారని, కనీసం రూ.15 వేల కోట్లయినా సరిపోయేదని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ అన్నారు. మిగిలిన నిధుల కోసం మా పోరాటం కొనసాగిస్తామని ఆయన ప్రకటించారు. రాష్ట్రం కోసం కాంగ్రెస్‌ చేసిన పోరాటానికి చివరకు విజయం దక్కిందన్నారు. ప్రజల సమస్యలపై రాజకీయాలు మరచి భాజపా కూడా సమిష్టిపోరుకు సిద్ధమవ్వాలని ఆయన సూచించారు. రాష్ట్రంపై ఏమాత్రం నిబద్ధత ఉన్నా ఇకనైనా భాజపా సహకరించాలన్నారు. రాష్ట్రంపై కేంద్రానికి సవతితల్లి ధోరణి ఉందని సుప్రీం కోర్టు కూడా గుర్తించినట్లు రాష్ట్ర రెవెన్యూమంత్రి కృష్ణబైరేగౌడ అన్నారు. ఏడు నెలలు ఎదురుచూసిన తర్వాతనే కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. ఇది కేంద్రం కనికరంతో ఇచ్చిన పరిహారం కాదు. న్యాయబద్ధంగా దక్కించుకున్న నిధులని ఆయన వివరించారు. మేము కేంద్రంతో జరిపిన చర్చలేవీ సఫలం కాలేదు. చివరకు ఇలా విజయం సాధించాం. మళ్లీ కేంద్రానికి లేఖ రాసి మిగిలిన నిధుల కోసం మనవి చేస్తామని మంత్రి ప్రకటించారు.

మోదీకి ధన్యవాదాలు..

కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం హామీలను నెరవేర్చేందుకే ప్రయత్నిస్తుంది.. ఈ క్రమంలో రాష్ట్ర రైతుల కోసం రూ.3,454 కోట్లను విడుదల చేసిన ప్రధాని మోదీకి భాజపా ధన్యవాదాలని భాజపా తెలిపింది. కర్ణాటకలో ఎన్నడూ లేనంత కరవు నెలకొన్నా రైతుల కోసం కనీసం మధ్యంతర పరిహారం కూడా చెల్లించని రాష్ట్రం కేవలం అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నట్లు సామాజిక మాధ్యమంలో ఆరోపించింది. ఎన్నికల నియమావళి ఉన్నా రాష్ట్ర ప్రజల కష్టాలకు ప్రధాని మోదీ స్పందించారని, ఓ వైపు కరవు పరిహారం, అభివృద్ధి కోసం నిధులు లేవని ఖజానా ఖాళీ చేసిన సర్కారు.. ఆ పార్టీ రాష్ట్ర బాధ్యులు, కలెక్షన్‌ కింగ్‌ సుర్జేవాల ప్రత్యేక విమానాల్లో తిరిగేందుకు సదుపాయాలు కల్పించినట్లు భాజపా ఆరోపించింది. ఆయనతో దేశంలోని ఆ పార్టీ ఎన్నికల ఖర్చులన్నీ తీర్చుకునేందుకు రాష్ట్రాన్ని ఏటీఎంగా మార్చుకున్నట్లు భాజపా తప్పుపట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని