logo

ప్రతి ఓటు విలువను సంక్షేమ రూపంలో తిరిగిస్తా

భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు వేసిన ప్రతి ఓటు విలువను సంక్షేమ రూపంలో తప్పకుండా తిరిగి ఇస్తానని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. ఆదివారం సాయంత్రం హొసపేటెలో ఏర్పాటు చేసిన విజయసంకల్ప యాత్ర కార్యక్రమంలో ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.

Published : 29 Apr 2024 01:07 IST

 హొసపేటె సభలో ప్రధాని మోదీ భరోసా 

ప్రధాని మోదీ, అభ్యర్థి శ్రీరాములు ముచ్చట్లు

హొసపేటె, న్యూస్‌టడే: భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు వేసిన ప్రతి ఓటు విలువను సంక్షేమ రూపంలో తప్పకుండా తిరిగి ఇస్తానని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. ఆదివారం సాయంత్రం హొసపేటెలో ఏర్పాటు చేసిన విజయసంకల్ప యాత్ర కార్యక్రమంలో ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. భారతీయుల ఓటుకు చాలా విలువ ఉంది. 2014, 2019లో మీరు వేసిన ఓటువల్లే నేడు అయోధ్యలో రామ మందిర నిర్మాణం సాధ్యమైందని కృతజ్ఞతలు తెలియజేశారు. కరోనాను దేశం నుంచి తరిమికొట్టాను, వికసిత భారత్‌, వందే భారత్‌ మీ విలువైన ఓటువల్లే సాధ్యమైందని నొక్కిపలికారు. దేశమంతటా మరోసారి మోదీ అనే మంత్రం మార్మోగుతోందని హర్షం వ్యక్తం చేశారు. మోదీ మరోసారి అధికారంలోకి వస్తే కాంగ్రెస్‌కు పుట్టగతులు ఉండవని, మాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. వారి అవినీతి కర్మకాండలను వెలికితీస్తామని ఇప్పటి నుంచే వారికి భయం చుట్టుకుందని చురకలంటించారు. 2014కన్నా పూర్వం మన దేశం ఎలా ఉండేది, ఇప్పుడెలా ఉందని భేరీజు చేసుకోండి. జమ్ము-కశ్మీరులో ఎక్కడలేని శాంతి నెలకొంది, ప్రజలు శాంతియుతంగా జీవిస్తున్నారు. ఆలయాల నిర్మాణం, పండగ పర్వదినాల ఆచరణలో భారతీయులు ఎన్నడూ ముందుంటారు. అలాంటి గడ్డపైన శ్రీరామమందిరాన్ని నిర్మిస్తే ఓర్చుకోలేని కాంగ్రెస్‌ను ఈ ఎన్నికల్లో అడవిపాలు చేయండని పిలుపునిచ్చారు. తన ప్రసంగ వ్యవధిలో సగం సమయాన్ని ఉత్తర కర్ణాటక గురించి చెప్పటానికి కేటాయించి ఈ ప్రాంతం జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఏడు జిల్లాలు కలిగిన ఉత్తర కర్ణాటక (కల్యాణ కర్ణాటక) భాజపా హయాంలోనే చాలా అభివృద్ధి చెందిందని కొనియాడారు. కొప్పళ తాలూకా కిన్నాళ బొమ్మలకు ప్రపంచస్థాయి గుర్తింపు దక్కింది. బళ్లారి జీన్స్‌ను అదే స్థాయికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. పదేళ్లలో ఉత్తర కర్ణాటకలో రైలు సేవలు మెరుగుపడ్డాయని గుర్తు చేశారు. కర్ణాటకలో ఏడాది నుంచి కటిక చీకట్లు కమ్ముకున్నాయి. ఒక చేత్తో ఉచిత విద్యుత్తు ఇచ్చి, మరో చేత్తో విద్యుత్తు కోతతో ఇబ్బందులపాలు చేస్తున్నారు. శాంతి భద్రతలు మంచాన పడ్డాయి. హత్యలు, అత్యాచారాలు, దౌర్జన్యాలు పెరిగాయి. బాంబులు, తుపాకుల నీడలో కన్నడిగులు గుండెలను చేతుల్లో పెట్టుకుని జీవిస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వాలు, ఏలికలు మనకి అస్సలు అవసరం లేదని తేల్చిచెప్పారు. 5.45నిమిషాలకు వేదికపైకి వచ్చిన మోదీ 6 గంటలకు తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అంతకుముందు మాజీ సీఎం కుమారస్వామి, పార్టీ రాష్ట్రాధ్యక్షుడు బి.వై.విజయేంద్ర, బళ్లారి అభ్యర్థి శ్రీరాములు మాట్లాడారు. రాయచూరు, కొప్పళ అభ్యర్థులు రాజా అమరేశ్వర నాయక, బసవరాజ్‌ క్యావటర్‌ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో సభాస్థలి ప్రవేశద్వారంలో పోలీసులు, కార్యకర్తల నడుమ తోపులాటలు చోటు చేసుకున్నాయి. సూర్యుడి తాపం ఎక్కువగా ఉండటంతో తాగునీటికోసం కార్యకర్తలు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

పెద్ద సంఖ్యలో హాజరైన కార్యకర్తలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని