logo

పదేళ్లలో ఏం చేశారని ఓటేయాలి?

గడిచిన పదేళ్లలో మహాప్రభు (నరేంద్ర మోదీ) ప్రజలకు ఏమి చేశారని ఓటు వేయాలి. దేశంలో నిరుద్యోగ సమస్య పెంచినందుకా?.

Published : 30 Apr 2024 01:32 IST

ప్రకాష్‌రాజ్‌ ప్రశ్న

మాట్లాడుతున్న బహుభాషా నటుడు ప్రకాశ్‌ రాజ్‌, చిత్రంలో మల్లికార్జునరెడ్డి, శివశంకర్‌, మానయ్య, తదితరులు

బళ్లారి, న్యూస్‌టుడే: గడిచిన పదేళ్లలో మహాప్రభు (నరేంద్ర మోదీ) ప్రజలకు ఏమి చేశారని ఓటు వేయాలి. దేశంలో నిరుద్యోగ సమస్య పెంచినందుకా?. పండించిన ధాన్యానికి ఎంఎస్‌పీ అడిగిన రైతులపై దౌర్జన్యం చేసినందుకా? కార్మిక చట్టాలను మార్చడానికి ముందుకు వెళ్తున్నందుకా? దేశ సంపదను కొంత మందికే దోచిపెట్టినందుకు ఓటు వేసి 400 సీట్లు ఇవ్వాలా? అని బహుభాషా నటుడు ప్రకాశ్‌ రాజ్‌ ప్రశ్నించారు. సోమవారం బళ్లారిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రామ మందిరానికి ప్రతిపక్షాలు రాలేదని ప్రధాని మాట్లాడుతున్నారే.. సొంత పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రాలేదు..కొంత మంది మఠాధీశులు వ్యతిరేకించారు. రాష్ట్రపతిని ఆహ్వానించలేదే. దీనికి ప్రధాని దేశ ప్రజలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రామమందిరం అడ్డంపెట్టుకుని ప్రచారం చేయడం దిగుజారిన రాజకీయమన్నారు. రాష్ట్రంలో 27 మంది ప్రతినిధులు పార్లమెంట్‌కు వెళ్తే..ఒక్కరోజైనా రాష్ట్రంలో నెలకొన్న కరవుపై మాట్లాడారా? ఎందుకు మాట్లాడలేదు. ప్రధాని గురించి భజన చేయడం తప్ప వారికి ఏమి తెలియదన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్లిన తర్వాత కోర్టు చీవాట్లు పెడితే రూ.3454 కోట్లు విడుదల చేశారు. నేడు రాష్ట్రంలో కరవు నివారణకు నిధులు విడుదల చేయించామని ప్రచారం చేసుకునే వారికి సిగ్గు లేదన్నారు. గతంలో 303 సీట్లు వచ్చాయి. ప్రస్తుతం 400 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పదేళ్ల అధికారంలో ఏమి చేశారని ప్రశ్నించారు. ప్రస్తుతం రాజ్యాంగం మార్పు చేస్తామని, ప్రజాస్వామ్యం ఖూనీ చేయడానికి, ముస్లింలపై దాడులు చేసినందుకు..మతాలు, కులాలు..ప్రాంతాల మధ్య ఘర్షణలు సృష్టిస్తారని ఓటు వేయాలా అని ప్రశ్నించారు.

అవినీతిపరులను పార్టీలో చేర్చుకుంటున్నారు

అవినీతి రహిత దేశంగా మారుస్తాం..అవినీతి పరులు లేని సమాజం నిర్మిస్తాం.. మహాప్రభు ప్రధాని నరేంద్ర, చాణిక్యుడుగా చెప్పుకొంటున్న అమిత్‌షా నేడు దేశ సంపదను దోచుకుని, కోర్టు, సీబీఐ, ఈడీ విచారణలు ఎదుర్కొంటున్న వారిని పార్టీలోకి చేర్చుకుని వాషింగ్‌ మిషన్‌లో వేస్తే వారు నీతివంతులుగా మారుతారా? దీనిపై దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రకాశ్‌రాజ్‌ నిలదీశారు. బళ్లారి లోక్‌సభ బరిలో ఉన్న అభ్యర్థి సమాజ సేవలో ఉన్నారని టికెట్‌ ఇచ్చారని అనుకుంటే పొరపాటు. డబ్బులు ఉండటం వల్లే సీటు ఇచ్చారని తెలిపారు. నేను ఏ పార్టీ తరఫున పనిచేయడం లేదు..దేశంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించడం ప్రతి భారతీయుడి బాధ్యత, అదే తరహాలోనే దేశ వ్యాప్తంగా పలు నియోజకవర్గాలను తిరుగుతూ అధికార పార్టీ చేసిన వైఫల్యాలను ఎత్తుచూపుతున్నాను. వాటిని ప్రశ్నిస్తున్నాను. ఫలానా పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని కోరడం లేదు. అధికార పార్టీ అభ్యర్థిని తిరస్కరించి మీకు అందుబాటులో ఉండే అభ్యర్థికి ఓటు వేయాలని కోరుతున్నానని చెప్పారు. స్థానిక ప్రతినిధులు చాగనూరు మల్లికార్జునరెడ్డి, శివశంకర్‌, మానయ్య, చంద్రకుమారి, వెంకటేశులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని