logo

భారాస అభ్యర్థులపై వీడనున్న ఉత్కంఠ

వచ్చే ఎన్నికల్లో భారాస తరఫున బరిలో నిలవనున్న అభ్యర్థుల తొలి జాబితాను సోమవారం ప్రకటించనున్నట్లు పార్టీ అధిష్ఠానం వెలిబుచ్చింది.

Updated : 21 Aug 2023 06:45 IST

వైరాలో మదన్‌లాల్‌కు అవకాశం?
ఈటీవీ ఖమ్మం

వచ్చే ఎన్నికల్లో భారాస తరఫున బరిలో నిలవనున్న అభ్యర్థుల తొలి జాబితాను సోమవారం ప్రకటించనున్నట్లు పార్టీ అధిష్ఠానం వెలిబుచ్చింది. దీంతో ఉభయ జిల్లాల్లో ఎవరికి టికెట్‌ లభించనుందనే చర్చ గులాబీ శ్రేణుల్లో జోరుగా సాగుతోంది. మరోవైపు ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. రెండు నియోజకవర్గాల్లో అప్పుడే అసమ్మతి సెగలు మొదలయ్యాయి.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిల్లో 8 మంది ఎమ్మెల్యేలు భారాసకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పనితీరు, ప్రజల్లో ఆదరణ, సర్వే ఫలితాల ఆధారంగా వచ్చే ఎన్నికలకు అభ్యర్థులెవరో ఖరారు చేస్తున్నట్లు అధిష్ఠానం ప్రకటించింది. ఆ పార్టీ వర్గాలు, ముఖ్యనేతల విశ్వసనీయ సమాచారం ప్రకారం ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్‌కుమార్‌, పాలేరు కందాళ ఉపేందర్‌రెడ్డి, మధిర లింగాల కమల్‌రాజు, సత్తుపల్లి సండ్ర వెంకటవీరయ్య, కొత్తగూడెం వనమా వెంకటేశ్వరరావు, పినపాక రేగా కాంతారావు, అశ్వారావుపేట మెచ్చా నాగేశ్వరరావు, ఇల్లెందు బానోత్‌ హరిప్రియ, భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావు పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. వైరా నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాములునాయక్‌కు బదులు మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌ పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. పార్టీ అంతర్గత సర్వేలో ఆయన పట్ల సానుకూలత వ్యక్తం కాకపోవడం వల్లే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అయినా అధిష్ఠానాన్ని ఒప్పించేందుకు రాములు నాయక్‌ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. తనకు కాదనుకుంటే కుమారుడు జీవన్‌లాల్‌కైనా అవకాశమివ్వాలని అభ్యర్థిస్తున్నారు. మాజీ ఎంపీ పొంగులేటితో కలిసి ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన తెల్లం వెంకట్రావు నెల రోజుల వ్యవధిలోనే మళ్లీ సొంతగూటికి చేరగా.. ఆయనకు భద్రాచలం అభ్యర్థిత్వం దాదాపు ఖరారైంది.

అసమ్మతి  సెగలపై దృష్టి

భారాస అభ్యర్థుల ఖరారుపై ఇప్పటికే స్పష్టత రాగా, ఆ వెంటనే కొందరిపై సొంత పార్టీలోనే వ్యతిరేకతలు మొదలవడం గమనార్హం. ఇల్లెందులో హరిప్రియ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ అసమ్మతి నాయకులు శనివారం సమావేశమైన విషయం తెలిసిందే. ఇంకోవైపు ఆమెకు మద్దతుగా పలువురు పురపాలక కౌన్సిలర్లు ఆదివారం హైదరాబాద్‌ వెళ్లి మంత్రి హరీశ్‌రావును కలిశారు. హరిప్రియకే టికెట్‌ ఖరారు చేయాలని కోరారు. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న మున్సిపల్‌ ఛైర్మన్‌ దమ్మాలపాటి వెంకటేశ్వర్లుపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. భద్రాచలం నియోజకవర్గంలోనూ తెల్లం వెంకట్రావుకు వ్యతిరేకంగా అసమ్మతి రాజుకుంది. చర్ల మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ బోదబోయిన బుచ్చయ్యకు టికెట్‌ ఇవ్వాలంటూ కొందరు మద్దతుదారులు పార్టీ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావుకు ఆదివారం విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా ముఖ్య నాయకులంతా స్థానికంగా అందుబాటులో ఉంటూ అసమ్మతి చల్లారేలా చర్యలు తీసుకోవాలని అధిష్ఠానం ఇప్పటికే దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. పార్టీ నిర్ణయమే శిరోధార్యంగా నాయకులు, శ్రేణులు ముందుకు సాగాలని సూచించినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని