logo

డీసీఎంఎస్‌ మాజీ ఛైర్మన్‌ రాయల కన్నుమూత

భారాస నేత, ఖమ్మం డీసీఎంఎస్‌ మాజీ ఛైర్మన్‌ రాయల వెంకటశేషగిరిరావు(69) అనారోగ్యంతో కన్నుమూశారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన ఆయన కాలేయ(లివర్‌) సంబంధిత వ్యాధితో బాధపడుతూ..

Published : 16 May 2024 03:47 IST

ముఖ్యమంత్రులుగా పనిచేసిన పలువురితో సన్నిహిత సంబంధాలు

రాయల శేషగిరిరావు మృతదేహం వద్ద తాతా మధు, లింగాల కమల్‌రాజ్‌, సండ్ర వెంకటవీరయ్య, కొండబాల కోటేశ్వరరావు

తల్లాడ, న్యూస్‌టుడే: భారాస నేత, ఖమ్మం డీసీఎంఎస్‌ మాజీ ఛైర్మన్‌ రాయల వెంకటశేషగిరిరావు(69) అనారోగ్యంతో కన్నుమూశారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన ఆయన కాలేయ(లివర్‌) సంబంధిత వ్యాధితో బాధపడుతూ.. నెల రోజుల క్రితం సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. శేషగిరిరావుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. తల్లాడ మండలం గంగదేవిపాడు సొసైటీ ఛైర్మన్‌గా ఉన్న రాయల వెంకటశేషగిరిరావు 2020లో ఉమ్మడి ఖమ్మం జిల్లా కేంద్ర మార్కెటింగ్‌ సొసైటీ(డీసీఎంఎస్‌) ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2024 జనవరి 23వ తేదీ వరకూ ఆ పదవిలో కొనసాగారు. డీసీసీబీలో తీసుకున్న కారు రుణం సకాలంలో చెల్లించలేదన్న కారణంగా శేషగిరిరావును డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ పదవి నుంచి తొలగించారు.

ఇదీ రాజకీయ నేపథ్యం..

1978లో రాజకీయరంగ ప్రవేశం చేసిన శేషగిరిరావు యువజన కాంగ్రెస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అనంతరం ఎన్టీఆర్‌ స్థాపించిన తెదేపాలో చేరారు. తల్లాడ మండల మొదటి ఎంపీపీగా 1987 నుంచి 1992 వరకు సేవలందించారు. గంగదేవిపాడు సొసైటీ ఛైర్మన్‌గా, డైరెక్టర్‌గా 1995 నుంచి 2003 వరకు, 2013 నుంచి 2020 వరకు విధులు నిర్వర్తించారు. రాయలకు మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆంగ్ల భాషా పరిజ్ఞానమున్న ఆర్వీఆర్‌కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్లు, పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ ఉన్నతాధికారులతో పరిచయాలున్నాయి.

రాయల మృతికి కేసీఆర్‌ సంతాపం

భారాస సీనియర్‌ నేత, డీసీఎంఎస్‌ మాజీ ఛైర్మన్‌ రాయల వెంకటశేషగిరిరావు మృతికి భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు. శేషగిరిరావుతో దశాబ్దాల కాలంగా తనకున్న రాజకీయ అనుబంధాన్ని, పలు పదవుల ద్వారా రైతులు, ప్రజలు, పార్టీ కోసం శేషగిరిరావు చేసిన కృషిని ఈ సందర్భంగా కేసీఆర్‌ గుర్తుచేసుకున్నారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

  • రాయల మృతి పట్ల భారాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, భారాస జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌, జడ్పీ ఛైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కొండబాల కోటేశ్వరరావు సంతాపం ప్రకటించారు. ఆర్వీఆర్‌ పార్ధివదేహం బుధవారం రాత్రి మిట్టపల్లికి చేరుకుంది. ఆయన అంత్యక్రియలు గురువారం నిర్వహించనున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని