logo

మనసున్న రాజు..

ఒకటీ రెండు కాదు.. ఏకంగా 40 గోవులు ఆ గడిలో కన్పిస్తుంటాయి.. ఇదేదో గోశాల అనుకుంటే పొరబాటు.. అలాగని విరాళాలు సేకరించి పశువుల బాగోగులు చూసే సంస్థ అంతకన్నా కాదు.

Published : 16 May 2024 03:43 IST

గోవుల సేవలో తరిస్తున్న లక్ష్మీనర్సింహారావు

తాను కొనుగోలు చేసి పెంచుతున్న ఆవులతో లక్ష్మీనర్సింహారావు

కూసుమంచి, న్యూస్‌టుడే: ఒకటీ రెండు కాదు.. ఏకంగా 40 గోవులు ఆ గడిలో కన్పిస్తుంటాయి.. ఇదేదో గోశాల అనుకుంటే పొరబాటు.. అలాగని విరాళాలు సేకరించి పశువుల బాగోగులు చూసే సంస్థ అంతకన్నా కాదు.. వధశాలకు వెళ్లే ఆవులను నిలువరించి, వాటిని రైతుల నుంచి కొనుగోలు చేసి వాటి పెంపకానికి రూ.లక్షలు వెచ్చిస్తోంది ఆ కుటుంబం..
దివంగత కేవైవీ రంగారావు ‘కూసుమంచి పట్వారీ’గా జిల్లాకు సుపరిచితులు. ఆయన కుమారుడు కేశరాజు లక్ష్మీనర్సింహారావు, తన కొడుకులతో కలిసి బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ రంగంలో స్థిరపడ్డారు. తన తండ్రి రంగారావు మరణాంతరం పూర్వీకుల నుంచి వచ్చిన భూముల్లో స్వయంగా వ్యవసాయం చేయిస్తున్నారు. వారంలో ఒకసారి వచ్చి వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో కూసుమంచి, పరిసర గ్రామాల రైతులు పోషణ చేపట్టలేని పరిస్థితుల్లో ఆవుల్ని విక్రయించుకోవడాన్ని కొన్నేళ్ల క్రితం గమనించారు. అదీ కోతకు తరలించే వ్యాపారులకు విక్రయించడాన్ని తట్టుకోలేకపోయారు. దీన్ని నిలువరించాలని భావించిన ఆయన అదే ధరను తాను చెల్లించి రైతుల నుంచి కొనేవారు. రెండు, మూడేళ్ల వ్యవధిలో అలా సేకరించిన వాటి సంఖ్య 32 వరకు చేరింది. ఒక్కో ఆవుకు రూ.20-32 వేల చొప్పున రూ.లక్షలు ఇందుకే ఖర్చు చేశారు. పెంపకం క్రమంలో వాటి సంఖ్య 40కు చేరింది. ప్రస్తుతం కొనుగోళ్లను నిలిపివేసి వాటి పోషణకు ప్రాధానమిస్తున్నారు. ఆవుల పాలు కూడా తీయకుండా దూడలకే తాగిస్తున్నారు.

పోషణపై ప్రత్యేక శ్రద్ధ: ఆవులను ప్రత్యేక శ్రద్ధతో పెంచుతున్నారు. తనకున్న భూమిలో ఆరు ఎకరాలను ఎలాంటి సాగు చేయకుండా మేత కోసం బీడుగా ఉంచుతున్నారు. నాలుగు ఎకరాల మామిడి తోటలోనూ గ్రాసం ఉండేలా చూస్తున్నారు. ఇతర రైతుల నుంచి రెండు ఎకరాలను కేవలం పశుగ్రాసం కోసం కౌలుకు తీసుకున్నారు. దీనికి తోడు వానాకాలం, యాసంగిలో తన సాగుభూమిలో వస్తున్న వరి గడ్డిని విక్రయించకుండా ఆవుల కోసమే వందలాది మోపులు నిల్వ చేస్తున్నారు. అవసరమైతే ఎండు గడ్డి కొంటున్నారు. వాటిని మేతకు తీసుకెళ్లేందుకు, పోషణ కోసం ప్రత్యేకంగా ఓ మనిషిని నియమించారు.


‘‘విధిలేని పరిస్థితుల్లో రైతులు తమ ఆవులను అమ్ముకోవటం బాధవేసింది. మూగజీవాలు కోతకు వెళ్లకుండా నా వంతు ప్రయత్నం చేస్తున్నా. రూ.లక్షలు ఖర్చవుతున్నా కుటుంబ సభ్యుల సహకారంతో వాటి పోషణ చిత్తశుద్ధితో చేస్తున్నా. గోమాత సేవలో తరిస్తున్నాను.’’  

లక్ష్మీనర్సింహారావు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు