logo

కిరాణా కొట్లలో మద్యం విక్రయాలు

ఖమ్మం కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో ఓ కిరాణా దుకాణంలో మద్యం సీసాలు దొరికాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రాకముందు ఈ ప్రాంతంలో నాలుగు బెల్ట్‌ దుకాణాలు ఉండేవి.

Published : 29 Apr 2024 01:23 IST

ఎన్నికల వేళ సవాలుగా నియంత్రణ

తిరుమలాయపాలెం మండలంలో సారాబట్టి ధ్వంసం చేస్తున్న సిబ్బంది

ఖమ్మం సారథినగర్‌, న్యూస్‌టుడే: ఖమ్మం కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో ఓ కిరాణా దుకాణంలో మద్యం సీసాలు దొరికాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రాకముందు ఈ ప్రాంతంలో నాలుగు బెల్ట్‌ దుకాణాలు ఉండేవి. నిర్వాహకులను బైండోవర్‌ చేశారు. చుట్టుపక్కల డిమాండ్‌ను గుర్తించిన చిరు వ్యాపారులు కిరాణా దుకాణాలు, జ్యూస్‌ పాయింట్లు, హోటళ్లలో విక్రయాలు మొదలు పెట్టారు. ఓ బెల్ట్‌ దుకాణాన్ని మూసేస్తే పదుల సంఖ్యలో పుట్టుకొస్తుండటంతో అధికారులు తల పట్టుకుంటున్నారు.

  • అనుమానిత బెల్ట్‌ దుకాణాల వివరాలు, నిందితుల సమాచారం ఆ శాఖ వద్ద ఉంది. కొత్తగా పుట్టుకొచ్చినవి మాత్రం ఇప్పటి వరకు నిఘా కంట పడకుండా కొనసాగుతున్నాయి. వరుసగా దుకాణాలన్ని సోదా చేసుకుంటూ పోతే తప్ప అక్రమ మద్యం ఆచూకీ దొరకదు. ఈ పరిస్థితి మొత్తం ఆబ్కారీశాఖనే గందరగోళంలోకి నెట్టింది.

ఎస్సైల కొరత

ఉమ్మడి ఖమ్మం జిల్లాను పర్యవేక్షించే ఎన్‌ఫోర్స్‌మెంట్‌, రెండు జిల్లా టాస్క్‌ఫోర్స్‌ విభాగాలు, ఖమ్మం, కొత్తగూడెం కేంద్రాలు పని చేస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో ఏడు ఆబ్కారీ స్టేషన్లు ఉన్నాయి. అన్ని స్టేషన్లలో ఎస్సైల కొరత ఉంది. ఖమ్మం టాస్క్‌ఫోర్స్‌ విభాగంలో ఎస్సై లేడని ఖమ్మం 2 స్టేషన్‌లోని ఎస్సైని ఇక్కడికి తీసుకువచ్చారు. పాత నేరస్థులు, నేరాలు, అక్రమాలు ఎక్కువగా ఖమ్మం స్టేషన్‌ 2 పరిధిలోనే ఉన్నాయి. ఆ స్టేషన్లో ఇప్పుడు ఓ మహిళా ఎస్సై ఉన్నారు. రెండు స్టేషన్లలో ఇద్దరేసి ఎస్సైలు ఉన్నారు. అక్కడికి కొత్తగా వచ్చిన సి.ఐ.లు తమ వద్ద ఉన్న ఎస్సైలను మారిస్తే ఇబ్బందులు ఉంటాయని, అవగాహన వచ్చే వరకైనా వారి అవసరం ఉందని చెబుతుండటంతో సర్దుబాటు చేయలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మూడు నెలల కిందటి వరకు ఉరుకులు పరుగులు పెట్టిన తనిఖీ బృందాలు ఇప్పుడు డీలా పడ్డాయి.


సంధికాలంలో అయోమయం

రెండు నెలల కిందట ఆబ్కారీశాఖలో సి.ఐ., ఎస్సైల బదిలీలు జరిగాయి. కొత్తగా వచ్చిన వారే అధికంగా ఉన్నారు. వీరిలో ఒకరిద్దరికి మినహా జిల్లాపై పట్టులేదు. వీరిలో కొందరు శుక్రవారం తమ ఊరెళ్లి వీలైతే సోమవారం, లేదా మంగళవారం వస్తున్నారని శాఖలో వినికిడి. కారణాలేవైనా దిశానిర్దేశం చేసే అధికారులు మూడు, నాలుగు రోజులే ఉంటున్న పరిస్థితుల్లో ఆ ప్రభావం కిందిస్థాయి సిబ్బందిపైనా పడింది. ఈ సంధికాలాన్ని అక్రమార్కులు అదునుగా మార్చుకున్నారు. గతంలో పూర్తిగా రూపుమాపామని చెప్పుకునే గుడుంబా ఇప్పుడు గుప్పుమంటోంది. పాత నేరస్థులు తిరిగి రంగంలోకి దిగి గ్రామీణ ప్రాంతాల సరిహద్దుల్లో బట్టీలు ఏర్పాటు చేసినట్టు వచ్చిన సమాచారంతో ఆబ్కారీశాఖలో కలవరం మొదలైంది. ఉన్నతాధికారులు అప్రమత్తత ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయిలో తనిఖీలు జరగడం లేదనే విమర్శలు ఉన్నాయి.


నియంత్రిస్తున్నాం

నాగేంద్రరెడ్డి, ఖమ్మం ఆబ్కారీశాఖ అధికారి

ఎస్సైల కొరత ఉంది. లేనిచోట సర్దుబాటు చేస్తున్నాం. ఏ స్టేషన్‌ పరిధిలోని సమస్యలు అక్కడ ఉన్నాయి. ఉన్నంతలో ఉన్నవారిని అప్రమత్తం చేస్తూ తనిఖీలు ముమ్మరం చేశాం. ఇప్పటి వరకు 377 కేసులు నమోదు చేశాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని