logo

ఓటుకు పట్టం..!

ఓటు చైతన్యం వెల్లివిరిసింది. పోలింగ్‌ ప్రారంభానికి ముందే కేంద్రాల వద్ద ఓటర్లు బారులుదీరారు. ‘తెల్లావారకముందే పల్లే లేచింది..’ అన్న చందంగా గ్రామీణ ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేసేందుకు తరలారు.

Updated : 14 May 2024 07:02 IST

ములకలపల్లిలో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న యువత

ఓటు చైతన్యం వెల్లివిరిసింది. పోలింగ్‌ ప్రారంభానికి ముందే కేంద్రాల వద్ద ఓటర్లు బారులుదీరారు. ‘తెల్లావారకముందే పల్లే లేచింది..’ అన్న చందంగా గ్రామీణ ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేసేందుకు తరలారు. ఓ పక్క పండుటాకులు, ఇంకోపక్క యువకులు.. వీరితోపాటు వయోజనులు.. కేంద్రాలన్నీ కోలాహలంగా మారాయి. ప్రకృతీ ఓటింగ్‌కు అనుకూలించింది. సోమవారం పార్లమెంటు ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా ఉభయ జిల్లాల్లో కనిపించిన పరిస్థితులు ఇవి..

పోలింగ్‌ ప్రక్రియ ప్రత్యక్ష వీక్షణ

ఖమ్మం నగరం, న్యూస్‌టుడే: ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు సెగ్మెంట్లలో సోమవారం పోలింగ్‌ ప్రక్రియను ఖమ్మం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ నుంచి నిరంతరం పర్యవేక్షించారు. కలెక్టర్‌ గౌతమ్‌ సహా ఎన్నికల పరిశీలకులు సంజయ్‌ జి. కోల్టే, పోలీస్‌ పరిశీలకుడు చరణ్‌జీత్‌ సింగ్‌, వ్యయ పరిశీలకులు అరుణ్‌ ప్రసాద్‌ కృష్ణస్వామి, శంకర్‌నంద్‌ మిశ్రాలు పోలింగ్‌ ప్రక్రియను పరిశీలించారు. 1,896 పోలింగ్‌ కేంద్రాల్లో అమర్చిన సీసీ కెమెరాలను కంట్రోల్‌ రూమ్‌లోని కంప్యూటర్లకు అమర్చారు. డిజిటల్‌ తెరలపై పోలింగ్‌ కేంద్రాల్లో పరిస్థితిని గమనించారు. పోలింగ్‌ కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు ఏర్పడినా వెంటనే ప్రత్యక్షంగా తెలుసుకున్న అధికారులు వెంటనే పరిష్కరించారు. కొన్ని కేంద్రాల్లో ఈవీఎంలను అమర్చడంలో పొరపాటు వల్ల 10 నుంచి 15 నిమిషాలు పోలింగ్‌ ఆగినా ఆ తర్వాత వేగంగా కొనసాగిందని కలెక్టర్‌ గౌతమ్‌ తెలిపారు. ఖమ్మంలో పలు కేంద్రాలను ఆయన సోమవారం తనిఖీ చేశారు.

చర్ల: రాళ్లాపురం అటవీ ప్రాంతం నుంచి తిప్పాపురం పోలింగ్‌ కేంద్రానికి కాలినడకన వెళుతున్న గొత్తికోయలు

ఇడమమ్మా నీకు వందనం..

చిత్రంలో ఉన్న మహిళ పేరు ఇడమమ్మ. చర్ల మండలంమారుమూల మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన రాళ్లాపురం గ్రామం. సోమవారం గ్రామస్థులు ఓటేసేందుకు అక్కడి నుంచి 4 కి.మీ. దూరంలోని తిప్పాపురం పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్నారు. ఇడమమ్మ ఇంటిపనులు ముగించుకొని చంటిపిల్లను చంకలో వేసుకొని దట్టమైన అడవిలో ఇలా ఓటు కోసం కాలినడకన వస్తున్న దృశ్యాన్ని ‘న్యూస్‌టుడే’ క్లిక్‌ మనిపించింది. మైదాన ప్రాంతాలతో పోల్చితే తిప్పాపురం, ఉంజుపల్లి లాంటి కీకారణ్య పోలింగ్‌ కేంద్రాల్లో అత్యధిక శాతం ఓటింగ్‌ నమోదు కావడం గమనార్హం.

చర్ల, న్యూస్‌టుడే

చిత్రంలోని యువకుడి పేరు నారాయణ్‌ సోనీ. కొత్తగూడెం మేదరబస్తీ వాసి. యూఎస్‌ఏ టెక్సాస్‌లోని హోస్టన్‌ యూనివర్సిటీలో ఎంఎస్సీ చదువుతున్నారు. తొలిసారి ఓటేసే అవకాశాన్ని చేజార్చుకోవద్దన్న ఉద్దేశంతో ఈ నెల 8వ తేదీనే అమెరికా నుంచి బయలుదేరి 10న కొత్తగూడెం చేరుకున్నారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలోని 127వ బూత్‌లో ఓటేశారు. ‘విదేశం నుంచి రావడం కాస్త ఖర్చుతో కూడుకున్న పనే. కానీ, తొలిసారి ఓటేసే అవకాశం చేజార్చుకోవద్దని మా నాన్న నరేంద్రకుమార్‌ సూచించారు. ఓటును సద్వినియోగం చేసుకున్నానన్నారు.

కొత్తగూడెం కలెక్టరేట్, న్యూస్‌టుడే

తొలిసారే టెండర్‌ ఓటు

కొత్తగూడెం పట్టణం, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో టెండర్‌ ఓటు నమోదైంది. కొత్తగూడెం పట్టణంలోని కూలీలైన్‌కు చెందిన ఓ యువతి తొలిసారి ఓటేసేందుకు ప్రభుత్వ పాఠశాలలోని 141వ పోలింగ్‌ కేంద్రానికి వెళ్లారు. ప్రిసైడింగ్‌ అధికారికి పోల్‌ చీటీ, ఆధార్‌ కార్డు అందజేశారు. ఓటరు జాబితాలో పరిశీలించగా అప్పటికే ఆమె ఓటు వేరొకరు వేసినట్లు అధికారి గుర్తించారు. దీంతో తాను ఓటేయలేదని ఆమె తన ఎడమ చేతి వేలిని చూపారు. తొలిసారి ఓటేసే అవకాశం కల్పించాల్సిందేనని పట్టుబట్టారు. అధికారులు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుని యువతికి బ్యాలెట్‌ అందజేయగా.. ఆమె ఓటుహక్కు సద్వినియోగం చేసుకున్నారు. ఆ ఓటును అధికారులు కవర్‌లో సీల్‌ చేసి టెండర్‌ ఓటు పెట్టెలో వేస్తారు. అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చినప్పుడు మాత్రమే దాన్ని లెక్కిస్తారు.

నాడు ఛాలెంజ్‌ ఓటు.. నేడు ఓటే లేదు

టేకులపల్లి, న్యూస్‌టుడే: గత ఎన్నికల్లో ఛాలెంజ్‌ ఓటు వేసిన ఆ యువకుడు ఈసారి ఓటే వేయలేకపోయారు. టేకులపల్లి మండలం బర్లగూడెం గ్రామానికి చెందిన పూనెం నరేందర్‌కు ఒడ్డుగూడెం పోలింగ్‌ బూత్‌ 137లో ఓటు ఉంది. సోమవారం ఓటు వేసేందుకు వెళ్లగా జాబితాను చూసిన బీఎల్‌ఓ.. ‘నీ ఓటు తొలగించినట్టు ఉంద’ని చెప్పడంతో నివ్వెరపోయారు. వెంటనే సీఈఓ తెలంగాణ వెబ్‌సైట్‌లో పరిశీలించగా అతని ఓటు అందులో భద్రంగా ఉంది. దాన్ని చూపించి పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లగా ప్రిసైడింగ్‌ అధికారి అభ్యంతరం తెలిపారు. యువకుడు వెంటనే ఫోన్లో తహసీల్దార్‌, ఎన్నికల అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. తహసీల్దార్‌ ఓటు వేయొచ్చని, స్థానిక ప్రిసైడింగ్‌ అధికారిని సంప్రదించాలని సూచించారు. ప్రిసైడింగ్‌ అధికారి నో చెప్పడంతో నిరాశగా వెనుదిరిగారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నరేందర్‌ ఓటు ఎవరో వేయటంతో బ్యాలెట్‌ పద్ధతిలో ఛాలెంజ్‌ ఓటు వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు