logo

తలరాతను మార్చే ఓట్లు తరలిపాయె..!

రెండు లోక్‌సభ స్థానాల్లో తలరాతలను మార్చే కీలక ఓటు బ్యాంకు తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోయింది. విభజన సమయంలో మిగతా నియోజకవర్గాల ఓట్లు, సీట్లుపై స్పష్టత ఉన్నప్పటికీ ఐదు మండలాలు పూర్తిగా, రెండు మండలాలు పాక్షికంగా ఏపీకి వెళ్లాయి.

Published : 29 Apr 2024 01:36 IST

మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి అరకు స్థానంలో కలిసిన భద్రాచలం దేవాలయం భూములు

భద్రాచలం, న్యూస్‌టుడే: రెండు లోక్‌సభ స్థానాల్లో తలరాతలను మార్చే కీలక ఓటు బ్యాంకు తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోయింది. విభజన సమయంలో మిగతా నియోజకవర్గాల ఓట్లు, సీట్లుపై స్పష్టత ఉన్నప్పటికీ ఐదు మండలాలు పూర్తిగా, రెండు మండలాలు పాక్షికంగా ఏపీకి వెళ్లాయి. ఖమ్మం, మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానాలకు సంబంధించిన 1.30 లక్షల ఓట్లు ఏపీలో కలిసిపోయాయి. ఈ మార్పు ఎన్నో అంశాలను తెరపైకి తీసుకొచ్చింది. భద్రాచలం నియోజకవర్గ ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గి రాష్ట్రంలోనే చిన్నదిగా మారింది. తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉండగా వరుస క్రమంలో భద్రాచలం చిట్టచివరిది. రాష్ట్రంలోనే కనిష్ఠంగా 1.51 లక్షల మంది ఓటర్లు ఇక్కడ ఉండటం విశేషం.

గుర్తుకొస్తున్నాయి..!

భద్రాచలం నియోజకవర్గంలోని కూనవరం, వరరామచంద్రాపురం, చింతూరు మండలాలు పూర్తిగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలిశాయి. భద్రాచలం మండలంలోని 22 గ్రామ పంచాయతీలకు 21 ఏపీలో విలీనమయ్యాయి. ఈ 21 గ్రామ పంచాయతీలను కలిపి ఎటపాక మండలం చేశారు. ఇలా విలీనమైన మండలాల నుంచి 91,221 ఓట్లు అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అరకు లోక్‌సభ స్థానంలో కలిశాయి. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల (అశ్వారావుపేట నియోజకవర్గం)తో పాటు పినపాక నియోజకవర్గంలోని బూర్గంపాడు మండలం నుంచి కొన్ని గ్రామాలు ఏలూరు జిల్లాలో కలిశాయి. పినపాక, అశ్వారావుపేట నియోజకవర్గాల నుంచి 39,135 ఓట్లు పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో కలిశాయి. ఇవి ఏలూరు లోక్‌సభ స్థానంలో భాగంగా ఉన్నాయి. అభ్యర్థుల జయాపజయాలను నిర్ణయించే స్థాయిలోని ఓటర్లు దశాబ్దం కిందటే తెలంగాణ నుంచి తరలినప్పటికీ ప్రతి ఎన్నికల్లో ఈ అంశం గుర్తుకొస్తూనే ఉంటోంది. భౌగోళికంగా విడిపోయినప్పటికీ మానసికంగా ఆ ఓటర్లతో మనది మరపురాని జ్ఞాపకమే. విలీనమైన వాటిలో పురుషోత్తపట్నం, గుండాల, పిచుకలపాడు, ఎటపాక, కన్నాయిగూడెం గ్రామ పంచాయతీలను తిరిగి భద్రాచలంలో కలపాలన్నది ప్రతి ఎన్నికల సమయంలో ప్రధాన పార్టీల అజెండాగా మారింది.


జడ్పీ నుంచి ఎంపీ వరకు జలగం సోదరులు

ఖమ్మం నగరం, న్యూస్‌టుడే: తొలితరం జలగం సోదరులు వెంగళరావు, కొండలరావు జడ్పీ ఛైర్మన్‌, ఎమ్మెల్యే, ఎంపీగా ఎన్నికై రికార్డు సృష్టించారు. ఖమ్మం జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా 1959 నుంచి 1964 వరకు జలగం వెంగళరావు పని చేశారు. ఆయన సోదరుడు జలగం కొండలరావు 1964 నుంచి 1970 వరకు ఖమ్మం జడ్పీ ఛైర్మన్‌ పదవిలో కొనసాగారు.

  • 1977, 1980 ఎన్నికల్లో జలగం కొండలరావు ఖమ్మం లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 1984, 1989లో ఖమ్మం లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి జలగం వెంగళరావు పార్లమెంట్‌ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
  • 1957లో వేంసూరు(సత్తుపల్లి) నియోజకవర్గం నుంచి జలగం కొండలరావు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 1962, 1967, 1972లో మూడుసార్లు వేంసూరు నియోజకవర్గం నుంచి జలగం వెంగళరావు ఎమ్మెల్యేగా గెలిచారు. 1972లో గెలిచిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. 1978లో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆ వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. సీనియర్‌ జలగం బ్రదర్స్‌ జడ్పీ ఛైర్మన్‌, ఎంపీ, ఎమ్మెల్యే పదవులు చేపట్టారు.

జూనియర్‌ జలగం బ్రదర్స్‌కు దక్కని ఎంపీ పదవి

  • జలగం వెంగళరావు కుమారులు ప్రసాదరావు, వెంకటరావు ఎమ్మెల్యేగా ఎన్నికైనా ఎంపీ పదవులు మాత్రం ఇప్పటి వరకు వారికి దక్కలేదు. జలగం ప్రసాదరావు 1983, 1989 ఎన్నికల్లో సత్తుపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1989లో ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన రాష్ట్ర చిన్ననీటిపారుదల, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా పని చేశారు.
  • జలగం వెంకటరావు 2004లో సత్తుపల్లి నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో కొత్తగూడెం నుంచి తెరాస తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009, 2018, 2023 ఎన్నికల్లో ఓటమి చెందారు.
  • 1999లో కాంగ్రెస్‌ పార్టీలో ఖమ్మం ఎంపీ టిక్కెట్‌ కోసం జలగం ప్రసాదరావు ప్రయత్నించి విఫలమయ్యారు. అప్పటి నుంచి ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు.
  • 2024లో భాజపా ఖమ్మం ఎంపీ టిక్కెట్‌ కోసం జలగం వెంకటరావు ప్రయత్నించారు. చివరి నిమిషంలో చేజారింది. దీంతో జూనియర్‌ జలగం బ్రదర్స్‌ను ఎంపీ టిక్కెట్‌ వరించనట్టైంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని