logo

చుకుబుకు రైలు.. గుండెల్లో గుబులు

తెలంగాణలో రైల్వే అభివృద్ధికి దక్షిణ మధ్య రైల్వే చేపడుతున్న ఏర్పాట్లు జిల్లా రైతుల్లో ఆందోళనకు కారణమైంది.

Updated : 29 Apr 2024 06:12 IST

డోర్నకల్‌- గద్వాల సర్వే పనులు అడ్డగిస్తూ, పొలాల వద్ద రైతుల పహారా

కూసుమంచి, న్యూస్‌టుడే: తెలంగాణలో రైల్వే అభివృద్ధికి దక్షిణ మధ్య రైల్వే చేపడుతున్న ఏర్పాట్లు జిల్లా రైతుల్లో ఆందోళనకు కారణమైంది. రైల్వే శాఖ ఇటీవల డోర్నకల్‌ నుంచి కూసుమంచి, సూర్యాపేట మీదుగా గద్వాల వరకు మంజూరు చేసిన రైల్వే మార్గం నిర్మాణానికి చేపడుతున్న సర్వే రైతుల కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఏళ్లుగా పలు రకాల పంటలు సాగు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్న తమకు ఆదరువు లేకుండా పోతోందని, నిర్మాణంలో విలువైన భూములు కోల్పోతామన్న ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే ప్రజాప్రతినిధులను కలిసి తమ గోడు చెప్పుకొన్న రైతులు ఇప్పుడు ప్రత్యక్షంగా ఆందోళన కార్యక్రమాలకు,
సర్వే పనుల అడ్డగింతలకు దిగుతున్నారు.


ఇదీ ఉద్దేశం..

ప్రస్తుతం సికింద్రాబాద్‌ నుంచి విజయవాడకు, హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు మధ్య రైలు మార్గాలున్నాయి. ఈ రెండింటినీ అనుసంధానం చేసే రైలు మార్గం అవసరాన్ని ఆశాఖ గుర్తించింది. అందుకనుగుణంగా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని అధ్యయనం చేసింది. అనుసంధాన వ్యవస్థను ఇప్పటివరకు రైలుమార్గం లేని ప్రాంతాల మీదుగా విస్తరించాలని నిర్ణయించి డోర్నకల్‌ - గద్వాల్‌ లైనుపై దృష్టి సారించింది. ఈ మార్గాన్ని దక్షిణ మధ్య రైల్వే గతేడాది తెరపైకి తెచ్చి ఇప్పుడు తుది స్థాన (ఫైనల్‌ లొకేషన్‌) సర్వే చేపట్టింది.


కొత్త ప్రాంతాలకు సౌకర్యం..

ప్రతిపాదిత మార్గం రూపంలో మహబూబాబాద్‌, ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని వివిధ ప్రాంతాలకు రైలు ప్రయాణ సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. డోర్నకల్‌ నుంచి ఖమ్మం గ్రామీణం, తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల మీదుగా మోతె, సూర్యాపేట, భీమవరం, నల్గొండ, నాంపల్లి, కల్వకుర్తి, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, భూత్పూర్‌ను కలుపుతూ గద్వాల్‌ వరకు నిర్మాణం చేపట్టాలని ఉద్దేశించారు.


ఇప్పటికే వందలాది ఎకరాలు..

పాలేరు నియోజకవర్గంలో సూర్యాపేట- ఖమ్మం, కోదాడ- ఖమ్మం, ఖమ్మం- దేవరపల్లి జాతీయ రహదారులకు వందలాది ఎకరాల భూములు కోల్పోయిన రైతులు ఇప్పుడు రైల్వే లైనుకోసం భూములిచ్చేది లేదంటూ భీష్మిస్తున్నారు. నెల క్రితం రహదారుల వద్ద మార్కింగ్‌ అనంతరం మూడు రోజుల నుంచి క్షేత్ర స్థాయి సర్వేకు వచ్చిన సిబ్బందిని అడ్డగిస్తున్నారు. ప్రతి పాయింట్‌ వద్ద పెద్ద సంఖ్యలో గుమికూడి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఒక్క రోజే కూసుమంచిలోని చేగొమ్మ, తిరుమలాయపాలెం, డోర్నకల్‌ సమీపంలోని దుబ్బబంజర వద్ద ఆందోళన నిర్వహించారు. ఎవరి భూముల్లో ఎంతమేర సేకరిస్తారు? అన్నదానిపై స్పష్టత లేకున్నా వారికి వారే ఓ అంచనా వేసుకుని సర్వేను అడ్డుకునేందుకు తమ భూముల వద్ద పహారా కాస్తున్నారు. బాధిత రైతులంతా కలిసి వాట్సాప్‌ మాధ్యమ సమూహాన్ని ఏర్పాటు చేసుకొని తమ భవిష్యత్తు కార్యాచరణ పంచుకుంటున్నారు.


1300-1400 ఎకరాల్లో?

డోర్నకల్‌- గద్వాల రైలు మార్గాన్ని సర్వే సంస్థ గగనతల పద్ధతుల్లో గుర్తించింది. కొద్ది రోజుల క్రితం కట్టడాలు నిర్మించాల్సిన మార్గం ఉన్న ప్రాంతాలను గుర్తించి మార్కింగ్‌ చేసింది. సూర్యాపేట- ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఎస్‌సీపీ- 104 నుంచి ప్రారంభించి డోర్నకల్‌ సమీపంలోని దుబ్బబంజర ప్రాంతంలో 118 వరకు మార్కింగ్‌ చేపట్టింది. కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం గ్రామీణం మండలాల్లో సుమారు 1,300 నుంచి 1,400 ఎకరాల భూములు సేకరించనున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని