logo

రాహుల్‌గాంధీని ప్రధాని చేయటమే లక్ష్యం: పొంగులేటి

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీని ప్రధాని చేయటమే లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సత్తుపల్లిలో ఎమ్మెల్యే మట్టా రాగమయి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన నియోజకవర్గ కాంగ్రెస్‌  విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.

Published : 29 Apr 2024 02:07 IST

సత్తుపల్లిలో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, చిత్రంలో కాంగ్రెస్‌ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి, ఎమ్మెల్యే మట్టా రాగమయి తదితరులు

సత్తుపల్లి, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీని ప్రధాని చేయటమే లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సత్తుపల్లిలో ఎమ్మెల్యే మట్టా రాగమయి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన నియోజకవర్గ కాంగ్రెస్‌  విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ కుటుంబానికి ప్రజలంతా అండగా నిలవాలని పిలుపునిచ్చారు.  ఆగస్టు 15లోపు రైతులకు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన విధంగా ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రసంగిస్తూ దేశ రాజకీయాల దృష్ట్యా వామపక్షాలు కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నాయని, న్యాయం, ధర్మం కోసం, మంచి పనిచేసే వారికి మద్దతివ్వాలన్నారు. మంచి కుటుంబం నుంచి వచ్చిన రామసహాయం రఘురాంరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. రైతుల్లో చిరునవ్వులు చూసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి రుణమాఫీ చేయనున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే మట్టా రాగమయి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో తన విజయం కోసం ఏవిధంగా కృషి చేశారో అంతకంటే రెట్టింపు శ్రమించి రఘురాంరెడ్డిని గెలిపించుకుందామని చెప్పారు.  కాంగ్రెస్‌ అభ్యర్థి రఘురాంరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 150 రోజుల్లోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఐదు గ్యారంటీలను అమలుచేసిందని, సెంట్రల్‌ మ్యానిఫెస్టోలోని 25 గ్యారంటీలను కూడా కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే నెరవేరుస్తుందన్నారు. పదేళ్లు రాష్ట్రాన్ని అధోగతి పాలుచేసిన కేసీఆర్‌కు కాంగ్రెస్‌ గురించి మాట్లాడే నైతిక హక్కులేదని వ్యాఖ్యానించారు. తనను ఎంపీగా గెలిపిస్తే జిల్లాను వదిలివెళ్లనని, అన్ని విధాలా అభివృద్ధి చేస్తాన్నారు. టీఎస్‌ఈ డబ్ల్యూఐడీసీ ఛైర్మన్‌ మువ్వా విజయబాబు, డీసీసీ అధ్యక్షుడు పువాళ్ల దుర్గాప్రసాద్‌, డాక్టర్‌ మట్టా దయానంద్‌, నున్నా రామకృష్ణ, స్వర్ణలత, నారాయణవరపు  శ్రీనివాసరావు, చల్లారి వెంకటేశ్వరరావు,  సీపీఐ, సీపీఎం నాయకులు మోరంపూడి పాండురంగారావు, దండు ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

మామిళ్లగూడెం:  కాంగ్రెస్‌ అభ్యర్థి రఘురాంరెడ్డి సీపీఎం మద్దతు కోరారు. నగరంలోని సీపీఎం జిల్లా కార్యాలయానికి ఆదివారం వచ్చి ఆపార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న సీపీఎం.. ఖమ్మం లోక్‌సభ స్థానంలో తనకు మద్దతు ఇవ్వాలని జిల్లా నాయకత్వాన్ని కోరారు. దేశంలో మోదీ సర్కారు అప్రకటిత ఎమర్జెన్సీ అమలుచేస్తోందని ఆరోపించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్‌ అభ్యర్థి రఘురాంరెడ్డి విజయానికి శాయశక్తులా కృషిచేస్తామన్నారు. కాంగ్రెస్‌ నాయకులు బాలసాని లక్ష్మీనారాయణ, ఎండీ.జావీద్‌, తుమ్మల యుగంధర్‌, మిక్కిలినేని నరేంద్ర, చావా నారాయణరావు, సైదుబాబు, స్వర్ణకుమారి, సీపీఎం నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, యర్రా శ్రీకాంత్‌, మాచర్ల భారతి,   వై.విక్రమ్‌, భూక్యా వీరభద్రం, కల్యాణం వెంకటేశ్వరరావు, మాదినేని రమేశ్‌, తదితరులు పాల్గొన్నారు.


కాంగ్రెస్‌ సమన్వయకర్తల నియామకం

ఖమ్మం కమాన్‌బజార్‌, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ శాసనసభ నియోజకవర్గాల వారీగా    సమన్వయకర్తలను నియమించింది. ఈ మేరకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పది శాసనసభ స్థానాలకు సంబంధించిన వారి వివరాలను ఆదివారం వెలువరించింది.
ఖమ్మం నియోజకవర్గానికి నూకల నరేశ్‌రెడ్డి, పాలేరు- మారబోయిన రఘునాథయాదవ్‌, మధిర- రాపోలు జయప్రకాశ్‌, సత్తుపల్లి- సరిపల్లి నాగభూషణ్రెడ్డి, వైరా- రాంరెడ్డి గోపాల్‌రెడ్డి, బొర్రా రాజశేఖర్‌, కొత్తగూడెం- తుళ్లూరు బ్రహ్మయ్య, అశ్వారావుపేట- ఎం.శ్యాంసుందర్‌రెడ్డి, భద్రాచలం- తోటకూర రవిశంకర్‌, నల్లపు దుర్గాప్రసాద్‌, నున్నా రామకృష్ణ, పినపాక- మోత్కూరి ధర్మారావు, ధరావత్‌ రామ్మూర్తినాయక్‌, బిక్కసాని నాగేశ్వరరావు, ఇల్లెందు - నియోజకవర్గానికి వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, పగడాల మంజులను సమన్వయకర్తలుగా నియమించింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని