logo

ప్రచారం ఉద్ధృతం

లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఖమ్మం, మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానాల్లో మళ్లీ పాగా వేయాలని భారాస సర్వశక్తులు ఒడ్డుతోంది. పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారు.

Updated : 29 Apr 2024 06:07 IST

ఈటీవీ- ఖమ్మం: లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఖమ్మం, మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానాల్లో మళ్లీ పాగా వేయాలని భారాస సర్వశక్తులు ఒడ్డుతోంది. పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ రెండు స్థానాల్లో సత్తా చాటాలని కమలదళం ఉవ్విళ్లూరుతోంది. భాజపా బహిరంగ సభలకు ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు.


నేడు ఖమ్మంలో కేసీఆర్‌ రోడ్‌షో

రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టిన భారాస అధినేత కేసీఆర్‌.. సోమవారం నుంచి రెండు రోజుల పాటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఖమ్మం, మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానాల పార్టీ అభ్యర్థులు నామా నాగేశ్వరరావు, మాలోత్‌ కవితకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. సోమవారం సాయంత్రం ఖమ్మం నగరంలోని మయూరి సెంటర్‌ నుంచి జడ్పీ సెంటర్‌ వరకు రోడ్‌షో చేపట్టనున్నారు. జడ్పీ సెంటర్‌లో భారాస శ్రేణులు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఖమ్మంలోని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌ నివాసంలో రాత్రి బస చేస్తారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల ముఖ్యనాయకులతో మంగళవారం ఉదయం ప్రత్యేకంగా సమావేశమవుతారు. తాజా రాజకీయ పరిస్థితులతోపాటు లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. తల్లాడ,కొత్తగూడెంలో సాయంత్రం రోడ్‌షోలు నిర్వహిస్తారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలిసారి ఖమ్మం వస్తున్న గులాబీ దళపతికి ఘనస్వాగతం పలికేందుకు భారాస శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఖమ్మం నగరంలో రోడ్‌షో జరిగే ప్రాంతాలు గులాబీమయమయ్యాయి. ఖమ్మం నగరంలో జరిగే రోడ్‌షోకు ఖమ్మం, పాలేరు, మధిర, వైరా నియోజకవర్గాల నుంచి కార్యకర్తలను తరలించేందుకు భారాస నాయకులు ఏర్పాట్లు చేశారు. మహబూబాబాద్‌లో పార్టీ అభ్యర్థి మాలోత్‌ కవితకు మద్దతుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రోడ్‌షో బుధవారం జరగనుంది.


కొత్తగూడెంలో భాజపా బహిరంగ సభకు నడ్డా రాక

ఖమ్మం, మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానాల భాజపా అభ్యర్థులు తాండ్ర వినోద్‌రావు, అజ్మీరా సీతారాంనాయక్‌కు మద్దతుగా భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాల్లో ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం పర్యటించనున్నారు. దిల్లీ నుంచి విజయవాడకు ఉదయం చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కొత్తగూడెం ప్రకాశం మైదానంలో 11 గంటలకు దిగుతారు. మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అనంతరం మహబూబాబాద్‌లో నిర్వహించే బహిరంగ సభకు జేపీ నడ్డా హాజరవుతారు. ఖమ్మం లోక్‌సభ స్థానంలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల నుంచి కొత్తగూడెం సభకు భారీగా జనాన్ని సమీకరించేందుకు భాజపా నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. జేపీ నడ్డాతోపాటు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఇతర ముఖ్యనేతలు హాజరుకానున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని