logo

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి: పొంగులేటి

తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్‌ చేశారు

Published : 02 May 2024 06:33 IST

ఖమ్మం: కార్డు పోస్టు చేస్తున్న మంత్రి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి రఘురాంరెడ్డి, చిత్రంలో తెదేపా నేతలు రామనాథం, హరీశ్‌చంద్ర తదితరులు
ఖానాపురం హవేలి, న్యూస్‌టుడే: తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్‌ చేశారు. ఖమ్మంలోని తెదేపా కార్యాలయానికి పొంగులేటి, కాంగ్రెస్‌ అభ్యర్థి రఘురాంరెడ్డి బుధవారం వెళ్లారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని 72 రోజులుగా తెదేపా పార్లమెంటరీ కమిటీ ప్రధాన కార్యదర్శి హరీశ్‌చంద్ర ఆధ్వర్యంలో చేపట్టిన పోస్టుకార్డు ఉద్యమానికి మంత్రి మద్దతు తెలిపారు. సీఎంగా ఎన్టీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా ఉంటాయన్నారు. రఘురాంరెడ్డి మాట్లాడుతూ తన వివాహానికి ఎన్టీఆర్‌ వచ్చారని గుర్తుచేసుకున్నారు. సినీనటుడు బాలకృష్ణ, తాను క్లాస్‌మేట్స్‌ అని చెప్పారు. తెదేపా పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు వాసిరెడ్డి రామనాథం,  కొండబాల కరుణాకర్‌, కన్నేటి పృథ్వీ, బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం కమాన్‌బజార్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం కార్మికులకు  అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తోందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మే డేను పురస్కరించుకొని ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ ఆవరణలో కార్మిక సంఘం నాయకుడు నున్నా మాధవరావు      ఆధ్వర్యంలో వాహన ర్యాలీ నిర్వహించారు. వివిధ సంఘాల కార్మికులు కాంగ్రెస్‌లో చేరారు. రూ.100కోట్లతో మార్కెట్‌ను అభివృద్ధి పరుస్తామని మంత్రులు తెలిపారు. మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ మానుకొండ రాధాకిశోర్‌, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు కొత్తా సీతారాములు పాల్గొన్నారు.

 ఏన్కూరు, తల్లాడ: కేంద్రంలోని భాజపా సర్కారు విభజన హామీలను విస్మరించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఏన్కూరు, తల్లాడలో బుధవారం రోడ్‌షో నిర్వహించారు. పదేళ్లు పరిపాలించిన కేసీఆర్‌ తన ఆస్తులు పెంచుకున్నారే తప్ప సామాన్యులను పట్టించుకోలేదన్నారు. ఐదేళ్లలో రూ.లక్ష రుణమాఫీ చేయని కేసీఆర్‌ రైతుల కోసం ఏదో ఉద్ధరిస్తానని మాట్లాడటం విడ్డూరంగా ఉందని దెప్పిపొడిచారు. ఖమ్మంలో నామాను గెలిపిస్తే కేంద్ర మంత్రి చేస్తానని కేసీఆర్‌ చెబుతున్నారని, అంటే కేసీఆర్‌ ఏపార్టీతో టచ్‌లో ఉన్నారో ప్రజలకు అర్థమైందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి    రఘురాంరెడ్డి మాట్లాడుతూ  తనకు ఒక్క అవకాశం ఇస్తే ఐదేళ్లపాటు ఇక్కడే ఉంటూ సేవ చేస్తానన్నారు. ఎమ్మెల్యే మట్టా రాగమయి, మాలోతు రాందాస్‌నాయక్‌, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, బొర్రా రాజశేఖర్‌, శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, వేముల కృష్ణప్రసాద్‌, పిడమర్తి రవి, స్వర్ణ నరేందర్‌, బేబీ స్వర్ణకుమారి పాల్గొన్నారు.

 ఖమ్మం కమాన్‌బజార్‌: దివ్యాంగుల సంక్షేమానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని దివ్యాంగుల సంక్షేమ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ముత్తినేని వీరయ్య అన్నారు. విజయ సంకల్ప్‌ యాత్ర-2 ఖమ్మం చేరుకున్న సందర్భంగా డీసీసీ కార్యాలయంలో బుధవారం మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల మ్యానిఫెస్టోలో దివ్యాంగుల సంక్షేమం కోసం ఆరు అంశాలను పొందుపరిచినట్లు వివరించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి రఘురాంరెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. పార్టీ నగర అధ్యక్షుడు మహ్మద్‌ జావేద్‌, కుంచెం ఉప్పలయ్య, సౌజన్య, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని