logo

బెల్లం అంటే భయం!

నాటు సారా అరికట్టేందుకు అంటూ ప్రభుత్వం బెల్లం విక్రయాలపై ఆంక్షలు విధించడం తీవ్ర ఇబ్బందికరంగా మారింది. పోలీసులు, ఇతర అధికారుల తనిఖీలతో బెంబేలెత్తిపోతున్న

Published : 19 May 2022 03:14 IST

విక్రయాలపై ఆంక్షల ప్రభావం

హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే: నాటు సారా అరికట్టేందుకు అంటూ ప్రభుత్వం బెల్లం విక్రయాలపై ఆంక్షలు విధించడం తీవ్ర ఇబ్బందికరంగా మారింది. పోలీసులు, ఇతర అధికారుల తనిఖీలతో బెంబేలెత్తిపోతున్న వ్యాపారులు కిరణా దుకాణాల్లో బెల్లం విక్రయించడానికి వెనుకాడుతున్నారు. మరోవైపు గతంలో మాదిరి దుకాణాల్లో బెల్లం దొరక్క వినియోగదారులు ప్రదక్షిణలు చేస్తున్నారు. కాపు సారా తయారీలో బెల్లం ఊటే కీలకం కావడంతో దీనిని నివారించాలంటూ ప్రభుత్వం బెల్లం అమ్మకాలపై నిబంధనలు విధించింది. ఎవరైనా వినియోగదారుడికి కిలోకు మించి బెల్లం విక్రయిస్తే కచ్చితంగా అతని ఆధార్‌ నకలు, ఇతరత్రా వివరాలు తీసుకోవాలనే ఆదేశాలు జారీ అయ్యాయి. పొరపాటున ఇలా కాకుండా ఎవరైనా బెల్లం అమ్మి, నాటు సారా నిందితుల్ని పోలీసులు, ఎస్‌ఈబీ అధికారులు పట్టుకుని విచారించినప్పుడు ఫలానా దుకాణంలో తాను బెల్లం కొనుగోలు చేసినట్లుగా వాంగ్మూలం ఇస్తే, తక్షణమే సదరు వ్యాపారిని అదుపులోకి తీసుకుంటున్నారు. హనుమాన్‌జంక్షన్‌ సరిహద్దున ఏలూరు జిల్లా పరిధిలో ఉన్న ఓ వ్యాపారిని వారం కిందట ఇదే విధంగా అరెస్టు చేసినట్లు సమాచారం. ఈ పరిణామంతో కిరణా వ్యాపారులు బెల్లం అమ్మడం మానేశారు. బాగా పరిచయం ఉన్న వినియోగదారులైతేనే పావు కిలో, అర కిలో చొప్పున విక్రయిస్తున్నారు. కొన్నిచోట్ల బెల్లం అమ్మడం లేదంటూ చెప్పేస్తున్నారు. మరోవైపు విజయవాడ, తాడేపల్లిగూడెం ప్రాంతాల నుంచి హోల్‌సేల్‌గా వచ్చే బెల్లం కూడా వారం రోజుల నుంచి ఆగిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. మార్కెట్‌లో బెల్లం దొరకనీయకుండా ఇదేమి పనంటూ వినియోగదారులు వాపోతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని