logo

ఒకటినే వేతనాలు చెల్లించేలా చట్టం చేయాలి

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులకు వేతనాలు ఏరోజు వస్తాయో తెలియక అయోమయానికి గురవుతున్నారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదారుల సంఘాల ఐక్యవేదిక ఛైర్మన్‌ కె.ఆర్‌.సూర్యనారాయణ అన్నారు.

Published : 23 Apr 2024 04:16 IST

మాట్లాడుతున్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదారుల సంఘాల ఐక్యవేదిక ఛైర్మన్‌ సూర్యనారాయణ

కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులకు వేతనాలు ఏరోజు వస్తాయో తెలియక అయోమయానికి గురవుతున్నారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదారుల సంఘాల ఐక్యవేదిక ఛైర్మన్‌ కె.ఆర్‌.సూర్యనారాయణ అన్నారు. కర్నూలు నగరం నంద్యాల చెక్‌పోస్టులోని దేవి ఫంక్షన్‌ హాలులో ఆ సంఘం సమావేశం సోమవారం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఒకటో తేదీనే వేతనాలు చెల్లించేలా చట్టం చేయాలని పేర్కొన్నారు. సీపీఎస్‌, జీపీఎస్‌తో ఉద్యోగులకు సామాజిక భద్రత కరవవుతుందని, పాత పింఛను విధానం పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఓపీఎస్‌ సాధించేలా సంఘం కృషి చేస్తుందన్నారు. పీఆర్సీ, డీఏ, జీపీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐసీ తదితరాలకు సంబంధించి రాష్ట్రంలోని ఉద్యోగులకు సుమారు రూ.25 వేల కోట్లు రావాల్సి ఉందని చెప్పారు. పెండింగ్‌ బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని.. ఫలితంగా ఉద్యోగులు మానసిక క్షోభకు గురవుతున్నారన్నారు.  సంఘం రాష్ట్ర కోఛైర్మన్‌ కరణం హరికృష్ణ, సెక్రటరీ జనరల్‌ బాజిపఠాన్‌, రోడ్లు భవనాల శాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాపారావు, వాణిజ్య పన్నుల శాఖ రాష్ట్ర కార్యదర్శి జి.ఎం.రమేష్‌, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులు బంగి శ్రీధర్‌, నాగేంద్రప్ప తదితరులు పాల్గొన్నారు.

పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకోవాలి

రానున్న ఎన్నికల్లో ప్రతి ఉద్యోగి పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఐక్యవేదిక ఛైర్మన్‌ కె.ఆర్‌.సూర్యనారాయణ అన్నారు. సమావేశానికి ముందు ఆయన మాట్లాడుతూ ఐకాస పేరుతో ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వానికి వినతిపత్రాల పేరుతో.. ఫొటోలతో మభ్యపెట్టారు తప్ప ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని