logo

జగన్‌ ఏలు‘బడి’.. ఫలితం బోల్తాపడి

‘కాలం’ కలిసి రాలేదు.. పిల్లాజెల్లా వలసబాట పట్టారు.. పశ్చిమాన ఊళ్లు ఖాళీ అయ్యాయి.. విద్యార్థుల్లేక తరగతి గదులు వెలవెలబోయాయి.. గ్లోబల్‌ విద్యార్థులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని గొప్పగా చెప్పే సీఎం జగన్‌ పట్టించుకోలేదు.. ఫలితం తిరగబడింది..

Published : 23 Apr 2024 04:21 IST

పది ఫలితాల్లో జిల్లా చివరి స్థానం
చదువును దూరం చేసిన కరవు
దృష్టి సారించని ప్రభుత్వం
న్యూస్‌టుడే, కర్నూలు విద్య

పోటీ ప్రపంచంలో తట్టుకొని నిలబడాలని, ప్రపంచాన్నే ఏలే పరిస్థితికి పిల్లలు రావాలనే గట్టి సంకల్పంతో ఈ ఐదేళ్లుగా ప్రభుత్వం అడుగులు వేసింది.. నాడు..నేడు కింద బడులు బాగు చేస్తున్నాం.. విద్యార్థులకు ఇంగ్లిష్‌ చదువులు చెప్పిస్తున్నాం.. విదేశాలకు పంపిస్తున్నాం.!!

ప్రతి సభలో జగన్‌ ప్రగల్భాలివి!


‘కాలం’ కలిసి రాలేదు.. పిల్లాజెల్లా వలసబాట పట్టారు.. పశ్చిమాన ఊళ్లు ఖాళీ అయ్యాయి.. విద్యార్థుల్లేక తరగతి గదులు వెలవెలబోయాయి.. గ్లోబల్‌ విద్యార్థులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని గొప్పగా చెప్పే సీఎం జగన్‌ పట్టించుకోలేదు.. ఫలితం తిరగబడింది.. పదో తరగతి ఫలితాల్లో జిల్లా చిట్టచివరన నిలిచింది. 62.47 శాతం ఫలితంతో 26వ స్థానానికి దిగజారిపోయింది. చాలా ప్రభుత్వ పాఠశాలల్లో ఫలితాలు 30 శాతం దాటలేదు.


45 బడుల్లో 30 శాతం

కర్నూలు జిల్లా పరిధిలోని ప్రభుత్వ బడుల్లో 30 శాతం ఫలితాలు మాత్రమే వచ్చిన పాఠశాలలను పరిశీలిస్తే ఆలూరు మండల పరిధిలో 3, సి.బెళగల్‌ 2, గోనెగండ్ల 1, గూడూరు 2, హాలహర్వి 4, హొళగుంద 2, కల్లూరు 2, కోడుమూరు 1, కౌతాళం 4, కృష్ణగిరి 1, కర్నూలు 7, మద్దికెర 2, మంత్రాలయం 2, నందవరం 1, పత్తికొండ 2, పెద్దకడబూరు 2, తుగ్గలి 2, వెల్దుర్తి మండల పరిధిలోని 5 ప్రభుత్వ బడులు 30 శాతం మాత్రమే ఫలితాలు సాధించాయి.


62.47 శాతం మంది ఉత్తీర్ణత

కర్నూలు జిల్లా పరిధిలో ప్రైవేటు, ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, ఆదర్శ, కేజీబీవీ, గిరిజన, సాంఘిక సంక్షేమ, ఏపీ రెసిడెన్షియల్‌ పాఠశాలలు కలిపి 517 ఉన్నాయి. మార్చి 18వ తేదీ నుంచి 27వ తేదీ వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు జరిగాయి. రెగ్యులర్‌, సప్లిమెంటరీ కింద మొత్తం 31,181 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 30,802 విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఇందులో బాలురు 16,276 మంది హాజరవగా 9,313 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 14,526 మంది పరీక్ష రాయగా 9,929 మంది పాసవ్వడం విశేషం.


ఆటంకంగా బోధనేతర పనులు

  • వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించింది. మధ్యాహ్న భోజన పథక నిర్వహణ, నాడు-నేడు బడుల పర్యవేక్షణ, యాప్‌లలో వివిధ అంశాలకు సంబంధించిన చిత్రాలు అప్‌లోడ్‌ చేయడం తదితర బాధ్యతలు చేపట్టాల్సిందేనని ఆదేశించింది. ఎక్కువ సమయం వాటికోసమే కేటాయించాల్సి వస్తోందని ఉపాధ్యాయ సంఘాల నేతలు పేర్కొంటున్నారు.
  • పరీక్షల సమయంలో సిఫార్సు లేఖలతో ప్రభుత్వం చేసిన బదిలీల హడావుడి పదో తరగతి విద్యార్థులపై తీవ్రంగా చూపింది. చాలా ప్రాంతాల్లో పదో తరగతి పాఠాలు బోధించే ఉపాధ్యాయులు లేకపోవడంతో ఫలితాలపై ప్రభావం పడింది.
  • ఏటా పదో తరగతి సిలబస్‌ను డిసెంబర్‌ నెలలోనే పూర్తి చేయడంతోపాటు జనవరి మొదటి వారం నుంచి వంద రోజుల ప్రణాళిక అమలు చేసేవారు. ఈ ఏడాది వంద రోజుల ప్రణాళిక ఊసేలేదు. పాఠశాలల దత్తత కానరాలేదు. ఇవన్నీ ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపింది.

పాఠాలు చెప్పేవారేరీ

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని జడ్పీ ఉన్నత బడుల్లో 7,797 మంది ఉపాధ్యాయుల అవసరం ఉండగా 6,971 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఆదోని డివిజన్‌లో 373, కర్నూలు డివిజన్‌ 187, నంద్యాల డివిజన్‌ 142, డోన్‌ డివిజన్‌లో 123 సబ్జెక్టు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఎక్కువగా పశ్చిమ ప్రాంతం, ఆదోని డివిజన్‌లో 373 సబ్జెక్టు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రత్యేకించి భౌతిక శాస్త్రం, గణితం, ఆంగ్ల ఉపాధ్యాయుల కొరత ఉన్నా విద్యా సంవత్సరం పొడవునా భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు.


లెక్కల్లో తప్పారు

విద్యార్థులు గణితంలో తడబడ్డారు. జనరల్‌ సైన్సు, సాంఘిక శాస్త్రంలోనూ ఇదే పరిస్థితి ఉంది. లాంగ్వేజ్‌ వారీగా పరిశీలిస్తే తెలుగులో 3,612, ఉర్దూ 363, ఆంగ్లంలో 15,038, కన్నడలో 220 మంది విద్యార్థులు పాసయ్యారు.


పశ్చిమాన పడిపోయిన ఫలితం

పశ్చిమ ప్రాంతం ఆదోని డివిజన్‌లో 245 పాఠశాలలు ఉన్నాయి. పశ్చిమ ప్రాంతంలో 19 మండలాలు ఉన్నాయి. ఇక్కడ 16,164 మంది విద్యార్థులకు పరీక్షలకు హాజరుకాగా 9,210 మంది ఉత్తీర్ణత సాధించారు. చాలా పాఠశాలల్లో 30 శాతం మంది కూడా ఉత్తీర్ణత సాధించలేకపోయారు. ఖరీఫ్‌, రబీ సీజన్లలో కరవు ప్రభావంతో ‘కాడి’తప్పింది. కరవు తీవ్రంగా ఉండటంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా అన్నదాతలు ‘కాడి’వదిలి.. పల్లెను ఖాళీ చేసి ఉపాధి బాట పట్టారు. ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు తెదేపా హయాంలో 71 వరకు సీజనల్‌ వసతిగృహాలు ఏర్పాటు చేసేవారు. చదువుకొనే విద్యార్థులు వలస వెళ్లకుండా ఆయా వసతిగృహాల్లో ఉంచేవారు. ఫలితంగా చదువులకు ఆటంకం ఏర్పడేది కాదు.. జగన్‌ ప్రభుత్వం పట్టించుకోలేదు.. తల్లిదండ్రులు తమ పిల్లలను వెంటబెట్టుకొని వలస వెళ్లారు. పరీక్షల సమయానికి వచ్చారు.


హాలహర్వి : బిలేహల్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను ఉన్నతీకరించారు. గదుల్లేక పోవడంతో ప్రాథమిక పాఠశాలలోనే బోధన కొనసాగుతోంది... సరిపడా ఉపాధ్యాయులు లేరు.. 11 మంది పరీక్ష రాయగా ఒక్క విద్యార్థే ఉత్తీర్ణత సాధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని