logo

శిశువు అపహరణకు యత్నం

కర్నూలు సర్వజన వైద్యశాలలోని గైనిక్‌ విభాగం నుంచి ప్రమీల అనే మహిళ బుధవారం రాత్రి 7 గంటలకు నవజాత శిశువును ఎత్తుకెళ్తూ సెక్యూరిటీ గార్డుకు పట్టుబడటం సంచలనంగా మారింది.

Published : 02 May 2024 03:17 IST

పట్టుకున్న సెక్యూరిటీ సిబ్బంది

  పట్టుబడిన ప్రమీల

కర్నూలు వైద్యాలయం, కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : కర్నూలు సర్వజన వైద్యశాలలోని గైనిక్‌ విభాగం నుంచి ప్రమీల అనే మహిళ బుధవారం రాత్రి 7 గంటలకు నవజాత శిశువును ఎత్తుకెళ్తూ సెక్యూరిటీ గార్డుకు పట్టుబడటం సంచలనంగా మారింది. కర్నూలు జిల్లా కల్లూరు మండలం బస్తిపాడు గ్రామానికి చెందిన జ్యోతి అనే మహిళ మూడు రోజుల కిందట పెద్దాస్పత్రిలో చేరి మగ పిల్లాడికి జన్మనిచ్చింది. పక్క బెడ్డులో ఉన్న ప్రమీల అనే మహిళ జ్యోతితో మాటలు కలిపింది. తానూ ప్రసవం కోసం వచ్చానంటూ రెండు రోజులుగా వారితో చనువుగా ఉంటోంది. పిల్లాడు బాగున్నాడని.. తన భర్తకు చూపించి తీసుకొస్తానని ప్రమీల చెప్పడంతో జ్యోతి నమ్మి శిశువును ఇచ్చింది. ప్రమీల బుధవారం రాత్రి బిడ్డను ఎత్తుకుని గైనిక్‌ విభాగం ప్రధాన గేటు నుంచి వస్తుండగా బయట కాపలాగా ఉన్న మధు అనే సెక్యూరిటీ గార్డు ఆమెను అడ్డుకుని పిల్లాడిని ఎక్కడికి తీసుకెళ్తున్నావంటూ నిలదీశారు. డిశ్ఛార్జి కార్డు చూపమని చెప్పడంతో ఆమె సమాధానం చెప్పలేక పట్టుబడింది. వెంటనే సమాచారం అందుకున్న సెక్యూరిటీ పర్యవేక్షకుడు సర్వేశ్వరయ్య ఆమెను మూడో పట్టణ పోలీసుస్టేషన్‌లో అప్పగించారు. తనది ఆదోని ప్రాంతమని, ప్రస్తుతం కర్నూలు పాత నగరంలో ఉంటున్నానని.. తన భర్త హమాలీ పని చేస్తాడని ప్రమీల చెప్పింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కాగా ఆస్పత్రిలో కొన్నేళ్లుగా సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. అయినా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని