logo

కమలం అభ్యర్థి ఖరారు

సార్వత్రిక ఎన్నికల్లో భాజపా నుంచి లోక్‌సభ స్థానానికి పోటీ చేసే మొదటి జాబితాలో నాగర్‌కర్నూల్‌కు చోటు లభించింది.

Updated : 03 Mar 2024 06:53 IST

నాగర్‌కర్నూల్‌ బరిలో  భరత్‌ప్రసాద్‌

ఈనాడు, మహబూబ్‌నగర్‌: సార్వత్రిక ఎన్నికల్లో భాజపా నుంచి లోక్‌సభ స్థానానికి పోటీ చేసే మొదటి జాబితాలో నాగర్‌కర్నూల్‌కు చోటు లభించింది. ఈ స్థానం నుంచి ప్రస్తుత ఎంపీ పోతుగంటి రాములు కుమారుడు, కల్వకుర్తి జడ్పీటీసీ సభ్యుడు భరత్‌ ప్రసాద్‌ పోటీ చేయనున్నారు. కమలనాథులు శనివారం విడుదల చేసిన మొదటి జాబితాలో ఆయన పేరు ప్రకటించారు. అనూహ్యంగా మూడు రోజుల క్రితమే రాములు, ఆయన కుమారుడు భరత్‌ప్రసాద్‌ భాజపాలో చేరారు. గత మూడు నెలలుగా వారు పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరిగింది. భరత్‌కు నాగర్‌కర్నూల్‌ టిక్కెట్‌ ఇస్తే తాను పార్టీ మారుతానని చెప్పారు. ఇటీవలే భాజపా అధిష్ఠానం నుంచి టిక్కెట్‌ విషయంలో హామీ లభించడంతో రాములు భారాస వీడారు. అనూహ్యంగా మొదటి జాబితాలోనే నాగర్‌కర్నూల్‌ భాజపా అభ్యర్థిని ప్రకటించారు. 2019 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి బంగారు శృతి పోటీ చేశారు. ఈసారి కూడా ఆమె బరిలోనే ఉంటారని భావించారు. ఎస్సీ స్థానం కావడంతో పోటీ అంతగా లేకపోవడంతో ఆమెకే అధిష్ఠానం టిక్కెట్‌ ఖరారు చేస్తుందనుకున్నారు. ఇప్పుడు అనూహ్యంగా భరత్‌కు టిక్కెట్‌ కేటాయించారు. కొన్ని నెలలుగా రాములు భారాస కార్యకలాపాలకు అంటీముట్టనట్లు ఉంటున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. మరోవైపు ఈసారి భారాస నుంచి తిరిగి అవకాశం కల్పిస్తారో? లేదోనన్న అనుమానంతో రాములు భాజపాలో చేరి కుమారుడికి టిక్కెట్‌ ఇప్పించుకోవడంలో సఫలమయ్యారు.

మహబూబ్‌నగర్‌ టికెట్‌పై ఉత్కంఠ..

భాజపా మొదటి జాబితాలో మహబూబ్‌నగర్‌ అభ్యర్థిని ప్రకటిస్తారని అందరూ భావించారు. జాబితాలో ఈ స్థానానికి చోటు లభించకపోవడంతో అభ్యర్థి ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. 2019లో సార్వత్రిక ఎన్నికల్లో చివరి నిమిషంలో భాజపాలో చేరి డీకే అరుణ టిక్కెట్‌ పొంది మహబూబ్‌నగర్‌ నుంచి పోటీ చేశారు. జాతీయ ఉపాధ్యక్ష పదవితో ఆమెకు పార్టీ సముచిత స్థానం కల్పించింది. ఈ సారి కూడా తనకే టిక్కెట్‌ వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసి ప్రచారం ప్రారంభించారు. మొదటి జాబితాలో ఆమె పేరు లేకపోవడంతో పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇక్కడి నుంచి పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్‌రెడ్డి, రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్‌ కూడా టిక్కెట్‌ ఆశిస్తున్నారు. తాను బరిలోనే ఉన్నానని జితేందర్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. దిల్లీలో మకాం వేసి లాబీయింగ్‌ చేస్తున్నారు. శాంతికుమార్‌ మాత్రం నెల రోజులుగా తనకే టిక్కెట్‌ వస్తుందన్న భరోసాతో నియోజకవర్గ పరిధిలో ప్రచారం ప్రారంభించారు. అధిష్ఠానం బీసీ కోటాలో తన పేరును పరిశీలిస్తుందని, తనకు మద్దతు ఇవ్వాలని  మండలాల్లో పర్యటిస్తున్నారు. ప్రతి గ్రామంలో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. మహబూబ్‌నగర్‌లో డీకే అరుణ, జితేందర్‌రెడ్డి, శాంతికుమార్‌ మధ్య టిక్కెట్‌ విషయంలో పోటాపోటీ ఉండటంతోనే మొదటి జాబితాలో ఈ స్థానం ప్రకటించలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండో జాబితాలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

కాంగ్రెస్‌, భారాస అభ్యర్థులెవరో..

నాగర్‌కర్నూల్‌ భాజపా అభ్యర్థిని ప్రకటించడంతో కాంగ్రెస్‌, భారాస అభ్యర్థులు ఎవరన్న దానిపై చర్చ ఊపందుకుంది. కాంగ్రెస్‌ నుంచి తాను బరిలో ఉన్నానని ఇప్పటికే మల్లు రవి బహిరంగంగానే ప్రకటించారు. టిక్కెట్‌ విషయంలో తనకు అడ్డంకిగా ఉన్న దిల్లీలో రాష్ట్ర అధికార ప్రతినిధి పదవిని కూడా వదులుకున్నట్లు ప్రకటించారు. మరోవైపు ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ కూడా ఈ స్థానంపై ఆశలు పెట్టుకోవడంతో కాంగ్రెస్‌ నుంచి పోటీలో ఎవరుంటారన్న ఆసక్తి నెలకొంది. భారాస నుంచి అధిష్ఠానం టిక్కెట్‌ ఎవరికి కేటాయిస్తుందో వేచి చూడాల్సిందే.

వ్యక్తిగత వివరాలు

పేరు : పోతుగంటి భరత్‌ప్రసాద్‌ (అవివాహితుడు)
తల్లిదండ్రులు :  పి.రాములు (ప్రస్తుత నాగర్‌కర్నూల్‌ ఎంపీ), భాగ్యలక్ష్మి గృహిణి
సామాజికవర్గం : ఎస్సీ, మాదిగ
తోబుట్టువులు : అక్క డా.ప్రశాంతి, అన్న రాజేంద్రప్రసాద్‌.. ఇద్దరికీ వివాహాలయ్యాయి.
స్వగ్రామం :  గుండూరు, కల్వకుర్తి మండలం, నాగర్‌కర్నూల్‌ జిల్లా
పుట్టిన తేదీ : 07.08.1987
విద్యాభ్యాసం : ఎంటెక్‌, ఎల్‌ఎల్‌బి, ఎల్‌ఎల్‌ఎం
రాజకీయ ప్రవేశం : 2018లో కల్వకుర్తి మండలం జడ్పీటీసీ సభ్యుడిగా విజయం
లక్ష్యం : తండ్రి అడుగుజాడల్లో పయనించి, నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని