logo

సీఎం నేడు సుడిగాలి పర్యటన

ఎన్నికల షెడ్యూల్‌ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాలుగోసారి పాలమూరుకు రానున్నారు. ప్రచారంలో భాగంగా ఇప్పటికే కొడంగల్‌, నారాయణపేట, మహబూబ్‌నగర్‌లో పర్యటించిన సీఎం మరోసారి పాలమూరులో మంగళవారం సుడిగాలి పర్యటన చేయనున్నారు.

Published : 23 Apr 2024 04:08 IST

నారాయణపేట, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో కార్యక్రమాలు

బిజినేపల్లి: సభాస్థలిని పరిశీలిస్తున్న ఐజీ సుధీర్‌బాబు, ఇతర పోలీసు అధికారులు

ఈనాడు, మహబూబ్‌నగర్‌: ఎన్నికల షెడ్యూల్‌ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాలుగోసారి పాలమూరుకు రానున్నారు. ప్రచారంలో భాగంగా ఇప్పటికే కొడంగల్‌, నారాయణపేట, మహబూబ్‌నగర్‌లో పర్యటించిన సీఎం మరోసారి పాలమూరులో మంగళవారం సుడిగాలి పర్యటన చేయనున్నారు. నారాయణపేట జిల్లా మద్దూరుకు మధ్యాహ్నం 12 గంటలకు రానున్నారు. మండల కేంద్రంలో జరిగే కొడంగల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌  నాయకుల సమావేశంలో పాల్గొంటారు. సమావేశం ముగిసిన అనంతరం కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డిపల్లిలోని బావాజీ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం మద్దూరు వచ్చి హెలీకాప్టర్‌లో నాగర్‌కర్నూల్‌ వెళ్లి ఎంపీ అభ్యర్థి మల్లు రవి నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొంటారు. బిజినేపల్లిలో జరిగే జనజాతర సభలో పాల్గొంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. నారాయణపేట, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

రెండు స్థానాల్లో గెలుపు లక్ష్యంగా..: పాలమూరులోని రెండు లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ జెండా ఎగరేయాలని రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు. సొంత జిల్లా కావడంతో ఈ రెండు స్థానాల్లో గెలుపు బాధ్యతలను ఆయన ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. రెండు చోట్లా త్రిముఖ పోరు నెలకొనడంతో ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకూడదని భావిస్తున్నారు. ముఖ్య ప్రాంతాల్లో స్వయంగా సీఎం పర్యటిస్తూ పార్టీ గెలుపునకు కావాల్సిన దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే మహబూబ్‌నగర్‌ లోక్‌సభ పరిధిలో మూడు సార్లు పర్యటించారు. ఎన్నికలు ముగిసేలోగా ఈ లోక్‌సభ పరిధిలో మరో రెండు సభలను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో కాంగ్రెస్‌కు మెజార్టీ వచ్చేలా ప్రత్యేకంగా కాంగ్రెస్‌  ప్రణాళికలు రూపొందిస్తోంది. మద్దూరు సమావేశంలోనూ మరోసారి తన సొంత నియోజకవర్గంలోని తాజా పరిస్థితిపై సమీక్ష చేయనున్నారు. ఎలాగైనా ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌కు 50వేల మోజార్టీ రావాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు. కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డిపల్లిలో బావాజీ ఆలయానికి రాష్ట్రం నలుమూలల నుంచి బంజారాలు అధిక సంఖ్యలో వస్తారు. ఈ జాతరకు హాజరు కావడంతో వారి మద్దతును కూడకట్టుకునే అవకాశం ఉంటుంది.


కందనూలుకు మొదటిసారి...

బిజినేపల్లిలో జన జాతర సభకు సిద్ధం చేస్తున్న వేదిక

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా రేవంత్‌ నాగర్‌కర్నూల్‌ రానుండటంతో ఘన స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం స్వగ్రామం కొండారెడ్డిపల్లి కూడా నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ పరిధిలోనే ఉంది. ఈ నియోజకవర్గం పరిధిలో ప్రస్తుతం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో భాజపా, భారాస నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. భాజపా నుంచి ప్రస్తుత ఎంపీ పి.రాములు కుమారుడు భరత్‌ ప్రసాద్‌, భారాస నుంచి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ పోటీలో ఉన్నారు. ఈ జిల్లాలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉండటంతో ప్రధానంగా వీరిని లక్ష్యంగా చేసుకునే ప్రచారం కొనసాగే అవకాశం ఉంది. వెనకబడిన ప్రాంతమైన నాగర్‌కర్నూల్‌కు సాగునీటి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంది. గత శాసనసభ ఎన్నికల్లోనూ రేవంత్‌  బిజినేపల్లిలోనే బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రచారం నిర్వహించారు. మళ్లీ ఈ సార్వత్రిక ఎన్నికల్లోనూ అక్కడే మల్లు రవి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని