logo

ఎన్నిక, తీర్పు రెండూ సంచలనమే.. భారాస ఎమ్మెల్సీ దండె విఠల్‌ భవిష్యత్తు ప్రశ్నార్థకం!

ఉమ్మడిజిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండె విఠల్‌ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అయితే పైకోర్టులో అప్పీల్‌ చేసుకునేందుకు నాలుగువారాలపాటు తీర్పును సస్పెన్షన్‌లో పెట్టింది. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీగా దండె విఠల్‌ ఎన్నిక ఎంతటి సంచలనాన్ని రేకెత్తించిందో ఇప్పుడు హైకోర్టుతీర్పు అంతే ప్రాధాన్యతాంశంగా మారింది.

Published : 04 May 2024 08:22 IST

ఈటీవీ - ఆదిలాబాద్‌

ఉమ్మడిజిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండె విఠల్‌ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అయితే పైకోర్టులో అప్పీల్‌ చేసుకునేందుకు నాలుగువారాలపాటు తీర్పును సస్పెన్షన్‌లో పెట్టింది. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీగా దండె విఠల్‌ ఎన్నిక ఎంతటి సంచలనాన్ని రేకెత్తించిందో ఇప్పుడు హైకోర్టుతీర్పు అంతే ప్రాధాన్యతాంశంగా మారింది. దండె విఠల్‌ ఎమ్మెల్సీగా కొనసాగుతారా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. శాసనసభ ఎన్నికల తర్వాత పార్టీలో ఉన్న కొద్దిమంది కీలక నేతల్లో ఒకరైన దండె విఠల్‌ రాజకీయ భవితవ్యం ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రెండున్నరేళ్ల కిందట ఎమ్మెల్సీగా ఎన్నికైన రోజున ఉమ్మడి జిల్లాలో 10 మంది ఎమ్మెల్యేలు, నలుగురు జడ్పీ ఛైర్మన్లు, 11 మున్సిపాల్టీల్లో తిరుగులేని రాజకీయ శక్తిగా ఉన్న భారాస ఇప్పుడు డీలాపడింది.

ఇదీ సంగతి..

ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కోసం 2021 నవంబరు 16న నోటిఫికేషన్‌ జారీ చేసిన ఎన్నికల కమిషన్‌ అదే నెల 23 వరకు నామపత్రాలను స్వీకరించింది. భారాస అభ్యర్థిగా దండె విఠల్‌,  పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, పెందూర్‌ పుష్పరాణి సహా 30 మంది స్వతంత్ర అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. ఉపసంహరణకు చివరి రోజైన 2021 నవంబరు 26న 27 మంది స్వతంత్ర అభ్యర్థులు నామపత్రాలను ఉపసంహరించుకోగా దండె విఠల్‌, పెందూర్‌ పుష్పరాణి, పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి పోటీలో ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. అదేరోజు చివరి నిమిషంలో పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి తరఫున నిర్మల్‌ జిల్లా దస్తూరాబాద్‌ మండలాధ్యక్షుడు సింగార్‌ కిషన్‌ నామపత్రాన్ని ఉపసంహరించుకోవడం ఒక్కసారిగా కలకలం రేకెత్తించింది. దాంతో దండె విఠల్‌, పెందూర్‌ పుష్పరాణి బరిలో ఉన్నారని అప్పటి రిటర్నింగ్‌ అధికారి(ఆర్‌వో) తేల్చటం రాజకీయంగా వివాదాస్పదమైంది.

సుప్రీం కోర్టుకెళ్తాం : దండె విఠల్‌

హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే కోరుతూ సుప్రీం కోర్టుకెళ్తాం. ఎన్నిక చెల్లదంటూ తీర్పు ఇచ్చిన హైకోర్టు అప్పీల్‌కు నాలుగువారాల గడువు ఇచ్చింది. సుప్రీం కోర్టులో న్యాయం జరుగుతుందని భావిస్తున్నా. ప్రత్యర్థుల నామపత్రాల దాఖలు, ఉప సంహరణలో నా పాత్ర ఏమిలేదు. నేను ఏకగ్రీవంగా ఎన్నిక కాలేదు. ఎన్నికల కమిషన్‌ నిబంధనలకు లోబడే ఎన్నికయ్యా. సుప్రీం కోర్టులో న్యాయం జరుగుతుందని భావిస్తున్నా.

కీలక మలుపు..

ఎన్నికల బరి నుంచి తాను తప్పుకోలేదని, అకారణంగా తప్పించారని, నామినేషన్ల ఉపసంహరణను ఆమోదించే ముందు నిబంధనల ప్రకారం ఆర్‌వో తన అభిప్రాయాన్ని అడగలేదని పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి అదే రోజు ప్రకటించారు. పైగా తన తరఫున ఫోర్జరీ సంతకంతో నామపత్రాన్ని ఉప ఉపసంహరించుకున్నారని ప్రకటించినా ఫలితం లేకుండా పోయింది. దాంతో పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి ఎన్నిక నిర్వహణపై స్టే విధించాలని కోరగా కోర్టు సమ్మతించలేదు. అభ్యంతరాలుంటే తరువాత చూసుకోవాలని సూచించింది. ఆర్‌వో నిర్ణయం ఆధారంగా ఎన్నికల కమిషన్‌ 2021 డిసెంబరు 10న ఎన్నిక నిర్వహించి అదే నెల 14న దండె విఠల్‌ విజయం సాధించినట్లు ప్రకటించటం సంచలనమైంది. దండె విఠల్‌ ఎన్నికైన తర్వాత రాజేశ్వర్‌రెడ్డి మళ్లీ కోర్టును ఆశ్రయించటంతో ఇప్పుడు ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇవ్వటం గమనార్హం.


న్యాయ వ్యవస్థకు నమస్సులు

- పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి

ఎవరినైనా డబ్బులు, అధికార హోదాతో భయపెట్టాలని చూసేవారికి ఈ తీర్పు చెంపపెట్టు లాంటిది. ప్రజాస్వామ్య పరిరక్షణ న్యాయ వ్యవస్థతో నిరూపితమైందని ఈ తీర్పు ద్వారా రుజువైంది. వాస్తవాలను పరిగణనలోకి తీసుకొని తీర్పు ఇచ్చిన న్యాయవ్యవస్థకు నమస్సులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని