logo

యువత.. మార్చేను నేతలరాత

సార్వత్రిక ఎన్నికల్లో పాలమూరులోని రెండు లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటములపై యువ ఓటర్లు కీలక భూమిక పోషించనున్నారు. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు యువ మంత్రం జపిస్తున్నారు.

Updated : 28 Apr 2024 06:15 IST

అభ్యర్థుల గెలుపోటముల్లో ఆ ఓటర్లు కీలక భూమిక

ఈనాడు, మహబూబ్‌నగర్‌: సార్వత్రిక ఎన్నికల్లో పాలమూరులోని రెండు లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటములపై యువ ఓటర్లు కీలక భూమిక పోషించనున్నారు. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు యువ మంత్రం జపిస్తున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో యువ ఓటర్లు అభ్యర్థుల విజయావకాశాల్లో కీలక భూమిక పోషించారు. ఈ సారి కూడా ఆ వర్గం ఓట్లను ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని అభ్యర్థులు పావులు కదుపుతున్నారు. మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ స్థానాల పరిధిలో మొత్తం 34,15,190 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 18-19 సంవత్సరాల వయస్సు ఉన్న ఓటర్లు 1,18,485 మంది ఉన్నారు. మొత్తం యువ ఓటర్లు 18,01,104 మంది ఉన్నారు. పాలమూరులో మొత్తం ఓటర్లలో వీరు 52.73 శాతం ఉండటం గమనార్హం.

క్షేత్రస్థాయికి..

రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో యువశక్తి పేరుతో భాజపా యువత ఓట్లను అభ్యర్థిస్తోంది. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని, రానున్న రోజుల్లో పాలమూరుకు ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీలను తీసుకొస్తామని ఆ పార్టీ ప్రచారం చేస్తోంది. జిల్లా కేంద్రాల్లో కేంద్రీయ విద్యాలయాలతోపాటు ఉమ్మడి జిల్లాకు సైనిక్‌ పాఠశాల ఏర్పాటు గురించి కూడా ప్రస్తావిస్తున్నారు. కేంద్రం ఆధ్వర్యంలో మెగా సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రం, పీఎంకేయూవై సంకల్ప్‌, ఉడాన్‌ పథకాల ద్వారా ప్రతి యువతకు లబ్ధి చేకూరేలా ప్రధాని మోదీ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు పోతున్నారని వివరిస్తున్నారు. ప్రధానంగా యువమోర్చా కార్యకర్తలు 35 ఏళ్లలోపు ఉన్న ఓటర్ల వివరాలను సేకరించి వారి వద్దకు వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఖేలో ఇండియా, డ్రగ్‌-ఫ్రీ మహబూబ్‌నగర్‌ వంటి ఆకర్షణ పథకాలతో భాజపా యువత కోసం ప్రత్యేకంగా మ్యానిఫెస్టోను కూడా విడుదల చేసింది. కేంద్రానికి జరుగుతున్న ఎన్నికలు కావడంతో యువత ఎక్కువగా భాజపా వైపు ఆకర్షితులవుతున్నారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళ్తున్నట్లు పార్గీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఉద్యోగాలే అస్త్రంగా..

గత శాసనసభ ఎన్నికల్లో యువత కాంగ్రెస్‌ పైపు ఉందని, లోక్‌సభ ఎన్నికల్లోనూ వారి మద్దతు తమకే ఉంటుందని ఆ పార్టీ నేతలు భరోసాగా ఉన్నారు. ప్రధానంగా సీఎం రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశారని ప్రచారం చేస్తున్నారు. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ కార్డు ప్రకటించి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా గ్రూప్‌ ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామని యువతకు భరోసా ఇస్తున్నారు. పీయూలో కొత్తగా ఇంజినీరింగ్‌, న్యాయ కళాశాలతో కొత్త పీజీ కోర్సులను తీసుకొచ్చి ఉన్నత విద్యావకాశాలు కల్పిస్తున్నామని ఎన్‌ఎస్‌యూఐ, యూత్‌ కాంగ్రెస్‌ నేతలు ప్రచారం చేస్తున్నారు. ప్రతి జిల్లాలో నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి యువతరానికి ఉపాధి కల్పించడానికి రేవంత్‌ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ఓటర్లకు వివరిస్తున్నారు. జిల్లాకేంద్రాల్లో ఐటీ పార్కుల అభివృద్ధి, యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పరిశ్రమల ఏర్పాటు వంటి హామీలతో ఆ పార్టీ ప్రచారం చేస్తూ యువ ఓటర్లను ప్రసన్నం చేసుకొనే పనిలో ఉంది.

ఉపాధి కల్పించామంటూ..

గత పదేళ్లలో యువత కోసం పలు ప్రాజెక్టులను తీసుకొచ్చి ఉపాధి కల్పించినట్లు భారాస ప్రచారం చేస్తోంది. మహబూబ్‌నగర్‌లో ఐటీ టవర్‌ ఏర్పాటుతోపాటు దివిటిపల్లిలో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల ద్వారా యువతకు భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెబుతోంది. ఉమ్మడి జిల్లాలో ఏర్పాటు చేసిన పారిశ్రామికవాడల్లోనూ భారాస ప్రభుత్వం యువతకు ప్రాధాన్యం ఇచ్చిందని వివరిస్తోంది. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతమున్న నైపుణ్య కేంద్రాలు భారాస హయాంలో ఏర్పాటు చేశామని గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన 30వేల ఉద్యోగాలు కూడా భారాస ప్రభుత్వం ఉన్న సమయంలోనే పరీక్షలు నిర్వహించి ఎంపిక చేసిన అభ్యర్థులే అని క్షేత్రస్థాయిలో ఓటర్లకు వివరిస్తున్నారు. యువతకు అండగా ఉండేది భారాసనేనని ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు