logo

ఎలుకా కొరకకే!

నారాయణపేటలోని చిన్నపిల్లల ఆస్పత్రిలో రోగులకు ఎలుకలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వచ్చిన చిన్న పిల్లలు, కుటుంబికులు ఆందోళన చెందుతున్నారు.

Updated : 29 Apr 2024 06:37 IST

పేట ప్రభుత్వ పిల్లల ఆస్పత్రిలో పట్టించుకోరు: రోగుల ఆవేదన

ఓ మహిళ కాలి వేలిని కొరికిన ఎలుక...

న్యూస్‌టుడే, నారాయణపేట: నారాయణపేటలోని చిన్నపిల్లల ఆస్పత్రిలో రోగులకు ఎలుకలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వచ్చిన చిన్న పిల్లలు, కుటుంబికులు ఆందోళన చెందుతున్నారు.ఇటీవల ఒకరిద్దరు రోగుల కాళ్లు, చేతులకు ఎలుకలు కొరికి గాయపరిచాయి. రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన ఆస్పత్రిలో ఈ పరిస్థితి ఏమిటని పలువురు వాపోతున్నారు.

  • నారాయణపేటలో ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరేంది. పైకప్పు పెచ్చులూడి వర్షం వస్తే చిత్తడిగా మారుతుండటంతో రోగులు, ఇటు వైద్యసిబ్బంది ఇబ్బందులు పడ్డారు. జిల్లా ఆస్పత్రిలో ప్రసవాలకు సంబంధించి ప్రత్యేక విభాగం, సరైన మౌలిక వసతులు లేకపోవడంతో తరచూ గర్భిణులను మహబూబ్‌నగర్‌ ఆస్పత్రికి పంపేవారు. దీంతో రోగులు, వారి కుటుంబికులు ఎంతో అవస్థలు అనుభవించేవారు. ఆస్పత్రికి వస్తున్న రోగుల తాకిడి రీత్యా గర్భిణులు, చిన్నారులకు ప్రత్యేకంగా ఆస్పత్రి ఏర్పాటు చేశారు..అప్పటి కలెక్టర్‌ హరిచందన ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా రూ.4కోట్ల వ్యయంతో చిన్న పిల్లల ఆస్పత్రి నిర్మాణం చేపట్టారు. వంద పడకల ఆస్పత్రిలో అన్ని రకాల సౌకర్యాలు, ఆక్సిజన్‌ సదుపాయం, ఐసీయూ ఏర్పాటు చేశారు. ఆస్పత్రి చుట్టూ ప్రహరీ సైతం నిర్మించారు. ఈ కొత్త ఆస్పత్రిలో సైతం ఎలుకల సంచారం అధికం కావడం, రోగులైన చిన్నారుల మధ్య ఎలుకల తచ్చాడుతుండటంతో ఆందోళన చెందుతున్నారు.  రెండు రోజుల క్రితం ఓ మహిళ కాలివేలిని ఎలుక కొరకడంతో లబోదిబోమంటు ఆస్పత్రి నుంచి బయటకు రావడం కనిపించింది. ఒకవేళ పసిబిడ్డలకు ఇదే పరిస్థితి ఎదురైతే పరిస్థితి ఏమిటని వాపోతున్నారు.సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

పారిశుద్ధ్యం లోపం.. శాపం

చిన్నపిల్లల ఆస్పత్రి ఆవరణలో పరిశుభ్రంగా ఉండటంలేదు. రోగులు, సహాయకులు మధ్యాహ్న, రాత్రివేళ భోజనాలు చేసి శుభ్రం చేయకపోవడంతో ఆస్పత్రిలో ఎలుకలు బాగా సంచరిస్తున్నట్లు తెలుస్తోంది.. ఆస్పత్రి నిర్మాణ సమయంలో మురుగుకాల్వ వ్యవస్థను సక్రమంగా చేపట్టకపోవడం వల్ల కూడా ఎలుకలు వస్తున్నట్లు వైద్య సిబ్బంది పేర్కొంటున్నారు. ప్రహరీకి రంద్రాలు ఉండటంతో ఎలుకలు లోపలికి రాడానికి ఆస్కారం ఇస్తోంది. రోగులు తెచ్చుకున్న ఆహార పదార్థాలను  ఆస్పత్రి గదులలో పెడుతుండటంతో ఎలుకల సంచారం అధికమవుతోందని వాపోతున్నారు. పారిశుద్ధ్య పనులు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయన్న విమర్శలు రోగులనుంచి వినిపిస్తున్నాయి.  

కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాం..: ఆస్పత్రి నిర్మాణ సమయంలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా నిర్మించలేదు. దీనికితోడు ప్రహరికి రంద్రాలు వేసి ఎలుకలు ఆస్పత్రిలోకి వస్తున్నాయి. చిన్న పిల్లల ఆస్పత్రిలో ఎలుకల బెడద విషయమై కలెక్టర్‌ శ్రీహర్ష దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే సమస్యను పరిష్కరించేందుకు కృషిచేస్తాం.

డా.రంజిత్‌, సూపరింటెండెంట్, జిల్లాఆస్పత్రి, నారాయణపేట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని