logo

ప్రచండ ఎండ!

పాలమూరులో భానుడు విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఏప్రిల్‌లోనే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో చెరువులు, నదులు, వాగులు, బావులు, చెక్‌డ్యాంలు, నీటికుంటలు ఎండిపోతున్నాయి.

Published : 29 Apr 2024 05:25 IST

రోజూ 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతల నమోదు

మహబూబ్‌నగర్‌ : ప్రభుత్వ బాలికల కళాశాల సమీపంలో నీటిని తాగేందుకు చలివేంద్రం వద్ద పోగైన జనం

పాలమూరు, న్యూస్‌టుడే : పాలమూరులో భానుడు విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఏప్రిల్‌లోనే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో చెరువులు, నదులు, వాగులు, బావులు, చెక్‌డ్యాంలు, నీటికుంటలు ఎండిపోతున్నాయి. గత నెలలో 30 - 40 డిగ్రీల మధ్యనే ఉష్ణోగ్రతలు ఉండగా, ఈ నెల మొదటి వారం నుంచి ఎండలు మండుతున్నాయి. వారం నుంచి తీవ్రత మరింత పెరిగింది. ఉష్ణోగ్రత 35 డిగ్రీల లోపల ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. 35-40 డిగ్రీల మధ్య ఉంటే ఎల్లో అలెర్ట్‌గా ప్రకటిస్తారు. వాతావరణాన్ని గమనిస్తుండాలి. 40-45 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు ఉంటే ఆరెంజ్‌ జోన్‌గా ప్రకటిస్తారు. 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైతే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంటుందని, ఎండలో బయటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేస్తారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాలు ఆరెంజ్‌ జోన్‌లో ఉన్నాయి. 40 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి.

రెడ్‌జోన్‌లో పాన్‌గల్‌, కొత్తకోట : ఈ నెల 26న వనపర్తి జిల్లాలో 45.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదివారం వనపర్తి జిల్లాలోని పాన్‌గల్‌ మండలంలో 45.1, కొత్తకోట మండలంలో 45.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇదే జిల్లాలోని పెబ్బేరులో 44.5 డిగ్రీలు నమోదైంది. ఈ జిల్లా రెడ్‌ జోన్‌లోకి వెళ్లిపోయింది. ఆదివారం మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలంలో 44.1, బాలానగర్‌లో 44.0, అడ్డాకులలో 43.5, కోయిలకొండలో 43.3, మిడ్జిల్‌లో 43.1, మహబూబ్‌నగర్‌ అర్బన్‌లో 43.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలంలో 44.7, కోడేరులో 44.5, అచ్చంపేటలో 44.2, పెద్దకొత్తపల్లిలో 44.2, కల్వకుర్తిలో 44.1, నారాయణపేట జిల్లా ఉట్కూర్‌లో 43.8, ధన్వాడ, కృష్ణాలో 43.6, కొత్తపల్లిలో 43.3, జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్‌ మండలంలో 44.7, వడ్డేపల్లిలో 44.3, అలంపూర్‌లో 44.3 డిగ్రీల చొప్పున అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని